డీకేకు డేంజర్ సిగ్నల్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాభవం

కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ-జేడీఎస్ కూటమి క్లీన్ స్వీప్ చేసింది.

Update: 2026-10-28 07:57 GMT

కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ-జేడీఎస్ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగగా, ఎక్కడా అధికార పార్టీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. రెండు టీచర్, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగింటిని ప్రతిపక్ష కూటమి సునాయాశంగా గెలుచుకుంది. రాష్ట్రంలో 2028 ప్రారంభంలోనే అసెంబ్లీ సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజావ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేదానికి అద్దం పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తాజా ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు గట్టి హెచ్చరికగా చెబుతున్నారు. కొద్దినెలల క్రితం సీఎం పీఠం ఎక్కిన డీకే నాలుగు ఎమ్మెల్సీ స్థానాలలో ఒక్కటి కూడా గెలుచుకోలేకపోవడానికి బాధ్యత వహించాల్సివుంటుందని అంటున్నారు.

కర్ణాటకలో రెండు టీచర్, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కోలుకోలేని విధంగా దెబ్బతగిలింది. మేధావి వర్గాలు, విద్యావంతులు పాల్గొనే ఈ ఎన్నికలు ప్రభుత్వ పాలనా తీరును, విధానాలను బేరీజు వేసే గీటురాళ్లుగా చెబుతారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పు రావడం అంటే, ప్రభుత్వ నిర్ణయాలపై విద్యావంతులలో తీవ్ర అసంతృప్తి నెలకొందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు, లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా బీజేపీ, జేడీఎస్ పార్టీల మధ్య సమన్వయం క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తోందని ఈ ఫలితాలు నిరూపించాయి. ఓట్ల బదిలీ సజావుగా జరగడం కూటమికి అఖండ విజయాన్ని అందించింది. పాలనాపరమైన లోపాలు, హామీల అమలులో జాప్యం, విద్యా, ఉపాధి రంగాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వంపై ఉన్న నిరసన ఈ బ్యాలెట్ ఓట్ల రూపంలో బయటపడిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

కర్ణాటకలో 2028 అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఈ ఎమ్మెల్సీ ఫలితాలు అధికార కాంగ్రెస్‌కు ఒక పెద్ద 'వేక్-అప్ కాల్' లాంటివని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని, ప్రస్తుత పాలనపై ప్రజల్లో మోజు తగ్గుతోందనే సంకేతాలను ఈ ఫలితాలు ఇస్తున్నాయని ప్రతిపక్షాలు గట్టిగా వాదిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై స్పందించిన నేతలు.. ఇది రాబోయే రాజకీయ మార్పునకు నాంది అని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మొత్తంగా చూస్తే, ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఎదురైన ఫలితాలు కాంగ్రెస్ హైకమాండ్‌కు, రాష్ట్ర నాయకత్వానికి పెద్ద సవాల్‌గా చెబుతున్నారు. ఇచ్చిన హామీల అమలు తీరును బేరీజు వేసుకోవడానికి, పాలనా వైఫల్యాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవడానికి ఈ ఫలితాలు ఒక గుణపాఠంగా చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే, రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేకత మరింత పెరిగి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News