బొత్స పరువు పోరాటం.. కూతురు, కోడలి గెలుపుపైనే పెద్దాయన భవిష్యత్తు

ఇందులో ఆయన రాజకీయ వారసురాలిగా చెబుతున్న కుమార్తె అనూష గెలవడం ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు పరీక్షగా చెబుతున్నారు.

Update: 2026-10-28 15:30 GMT

వైసీపీ కీలక నాయకుడు, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణకు స్థానిక ఎన్నికలు పెద్ద పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో తన సొంత కుటుంబ సభ్యులను బరిలోకి దించిన బొత్స వారి గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారని అంటున్నారు. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన బొత్స ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అంటున్నారు. పార్టీ అధికారం కోల్పోవడం ఒక ఎత్తు అయితే, తనను నీడలా అనుసరించిన మేనల్లుడు, జడ్పీ మాజీ చైర్మన్ చిన్న శ్రీను పార్టీని వదిలిపోవడం వల్ల బొత్స తీవ్ర ఇరకాటంలో పడ్డారని అంటున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చాటాలని భావించిన బొత్స స్వయంగా కుటుంబ సభ్యులనే పోటీకి పెట్టి కూటమి ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారని విశ్లేషిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం మూడు చోట్ల బొత్స కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నారు. ఇందులో ఆయన రాజకీయ వారసురాలిగా చెబుతున్న కుమార్తె అనూష గెలవడం ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు పరీక్షగా చెబుతున్నారు. ఇక తన సొంత నియోజకవర్గంలోనే కోడలు, చెల్లెలను బరిలోకి దించి పెద్ద సాహసం చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. కూటమి ప్రభుత్వంతో చావోరేవో తేల్చుకోవడమే ధ్యేయంగా బొత్స పని చేస్తున్నారని చెబుతున్నారు. తన రాజకీయ వారసురాలైన కుమార్తె బొత్స అనూషతోపాటు కోడలు పూజిత, చెల్లెలు వెంకటలక్ష్మి గెలుపు బాధ్యతను బొత్స స్వీకరించారని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొత్తం మూడు మండలాల్లో కుటుంబ సభ్యులను రంగంలోకి దించారని చెబుతున్నారు. ఈ మూడు చోట్ల గెలవడం ద్వారా తన పట్టు ఏంటో చాటుకోవాలనేది బొత్స ప్రయత్నంగా చెబుతున్నారు. దీనివల్ల పార్టీలోనూ బొత్స పరపతి పెరుగుతుందని అంటున్నారు. ఈ కారణంగానే జిల్లాలోనే మకాం వేసిన బొత్స మూడు జడ్పీటీసీలను కైవసం చేసుకునేలా వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు.

జిల్లా రాజకీయాల్లో బొత్స హవా మొదలైన నుంచి ఎప్పుడూ లేనివిధంగా ప్రస్తుతం పని చేస్తున్నారని చెబుతున్నారు. 2004లో తొలిసారి మంత్రి అయిన తర్వాత బొత్స హవా మొదలుకాగా, ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో ఒక్కసారి తప్ప, మిగిలిన అన్నిసార్లు జడ్పీ చైర్మన్లుగా బొత్స కుటుంబ సభ్యులే గెలిచారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సారి కూడా తన కుమార్తెను జడ్పీ చైర్ పర్సన్ గా గెలిపించు కోవాలని ఆయన భావించారని అంటున్నారు. అయితే తన ప్రతిపాదనపై మేనల్లుడు, మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఎదురు తిరగడంతో బొత్స షాక్ కు గురయ్యారని చెబుతున్నారు. ఇదే సమయంలో తనను ధిక్కరించిన వారికి గుణపాఠం చెప్పాలంటే జిల్లా రాజకీయాలను మళ్లీ తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని బొత్స వ్యూహం రచించారని అంటున్నారు. ఈ కారణంగానే ఎన్నడూ లేనివిధంగా తన సొంత కుటుంబానికి చెందిన నలుగురితో జడ్పీటీసీ నామినేషన్లు వేయించారని అంటున్నారు.

అయితే పూసపాటిరేగ స్థానానికి సోదరుడు కుమారుడు చైతన్య వేసిన నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ప్రస్తుతం ముగ్గురి బరిలో నిలిచారు. దీంతో ఆ ముగ్గురి గెలుపు బాధ్యతను కుటుంబంలో మరో ముగ్గురికి అప్పగించారని అంటున్నారు. బొత్స కుమార్తె అనూష పోటీ చేస్తున్న బొండపల్లి, కోడలు పూజిత రంగంలో ఉన్న గరివిడి, సోదరి వెంకటలక్ష్మి తలపడుతున్న గుర్లలో వారి గెలుపు బాధ్యతను బొత్స స్వయంగా తీసుకున్నారు. గరివిడి, గుర్ల స్థానాలు తన సొంత నియోజకవర్గం పరిధిలో ఉండగా, బొండపల్లి సోదరుడు అప్పలనరసయ్య ప్రతినిధ్యం వహించిన గజపతినగరం నియోజకవర్గంలో ఉన్నాయి. దీంతో ఈ మూడు స్థానాల్లో గెలుపు బొత్సకు వ్యక్తిగతంగా ప్రతిష్టగా మారినట్లు చెబుతున్నారు. ఈ మూడు చోట్ల గెలవడం ద్వారా తన పట్టు సడలలేదని నిరూపించుకోవాలని బొత్స తాపత్రయ పడుతున్నట్లు చెబుతున్నారు. తన నియోజకవర్గంలో ఇతర నేతలను బరిలోకి దించే అవకాశం ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులను పోటీకి పెట్టడానికి ఇదే ప్రధాన కారణమని అంటున్నారు. మొత్తానికి స్థానిక ఎన్నికలే తన భవిష్యత్తుగా బొత్స ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News