తుఫాన్ తీరం దాటడం అంటే ఏంటి? నేల మీదికి వచ్చాక ఏమవుతుంది?

అర్నాబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసింది. గత మూడు రోజులుగా భయపడినట్లే తీవ్ర విధ్వంసం సృష్టించింది.

Update: 2026-10-28 10:34 GMT

అర్నాబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసింది. గత మూడు రోజులుగా భయపడినట్లే తీవ్ర విధ్వంసం సృష్టించింది. అయితే ప్రభుత్వ ముందు జాగ్రత్తల వల్ల ఎక్కడా ప్రాణ నష్టం వాటిల్లలేదని అంటున్నారు. తుఫాన్ తీరం దాటిందని, క్రమంగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే తుఫాన్ తీరం దాటడం అంటే ఏంటి? తుఫాను సముద్రంలో ఉన్నప్పుడు? నేల మీదకు అడుగుపెట్టినప్పుడు ఏం జరుగుతుందనే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఎప్పుడు తుఫాన్ వచ్చిన సర్వసాధారణంగా వినిపించే పదాలు ఇవి. అసలు తుఫాన్ తీరం దాటడం అంటే ఏంటి? తుఫాన్ సముద్రంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? బయటకు వచ్చాక ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు చాలా మంది గూగుల్ సెర్చ చేస్తున్నారు. తుఫాన్ ఎలా ఏర్పడుతుంది? భూమిపైకి ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

తుపాను తీరం దాటిందని వాతావరణ నిపుణులు చెబుతుంటారు. సముద్రం నుంచి భూమిపైకి వచ్చే క్రమంలో అడుగుతీసి అడుగు వేసినట్టు తుఫాన్ తీరం దాటడం అనేది ఒక్క క్షణంలో జరిగేది కాదని అంటున్నారు. సముద్రంలో పుట్టిన ఒక మహా గాలి చక్రం, నెమ్మదిగా ముందుకు కదులుతూ భూమి మీదికి రావడాన్నే తీరం దాటడం అంటారు. దీనికి కనీసం నాలుగైదు గంటల సమయం పడుతుందని నిపుణుల అంచనా. తుపాను అనేది వందల కిలోమీటర్ల మేర విస్తరించిన ఒక భారీ మేఘాల గుంపుగా చెబుతున్నారు. తుఫాన్ మధ్య భాగంలో ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. శాస్త్రవేత్తలు దాన్ని తుపాను కన్ను అంటారు. తుపాను మొత్తం సముద్రంలో ఉన్నప్పుడు ఎవరికీ పెద్దగా ముప్పు ఉండదని అంటున్నారు. ఎప్పుడైతే ఆ మధ్యలోని కన్ను సముద్రపు నీటిని వదిలి, నేల మీదకు అడుగు పెడుతుందో, సరిగ్గా దాన్నే తీరం దాటడం లేదా ల్యాండ్‌ఫాల్ అంటారు.

తుఫాన్ ఎలా కదులుతుంది

సముద్రంలో ఏర్పడే తుఫాన్ నేరుగా భూమి మీదకు రాదని నిపుణులు చెబుతున్నారు. బొంగరం తిరిగినట్లు సముద్రంలో చుట్టూ తిరుగుతూ మెల్లగా పక్కకు జరుగుతుంటుందని అంటున్నారు. సముద్రపు నీటి మీద తుఫాన్ ఉన్నంత సేపు దానికి నీటి ఆవిరి బలంగా ఉంటుందని అంటున్నారు. ఆ బలంతో అది మరింత వేగంగా తిరుగుతుందని చెబుతున్నారు. అలా తిరుగుతూ తిరుగుతూ నేల సరిహద్దును తాకి, భూమి మీదికి అడుగుపెడుతుందని చెబుతున్నారు. సముద్రంలో ఉన్నంత సేపు తుఫాన్ కి నిరంతరం శక్తి అందుతూనే ఉంటుంది. అందుకే అది మహా వేగంగా పరుగులు తీస్తుందని అంటున్నారు. ఎప్పుడైతే తుఫాన్ సముద్రం దాటి నేల మీదికి వస్తుందో ఆ వేగం మందగిస్తుందని అంటున్నారు. అందుకే తీరం దాటే సమయంలో గంటకు వంద కిలోమీటర్ల పైగా వేగంతో పెనుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.

తుఫాన్ లో మూడు భాగాలు

తీరం దాటే సమయంలో మూడు అంచెలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మొదట తుపాను ముందు భాగం నేలను తాకుతుందని, ఆ సమయంలో భయంకరమైన ఈదురుగాలులు వీయడంతోపాటు కుండపోత వర్షం పడుతుందని చెబుతున్నారు. ఆ తర్వాత తుపాను మధ్య భాగం, అంటే కన్ను నేల మీదికి వస్తుందని ఆ సమయంలో ఉన్నట్టుండి వర్షం ఆగిపోతుందని చెబుతున్నారు. అంటే ఆకాశం నిర్మలంగా మారుతుంది. గాలి అస్సలు వీయదు. తుపాను వెళ్లిపోయింది అనుకుని జనం బయటకు వచ్చే ప్రమాదం ఉంది. కానీ అసలైన ట్విస్ట్ అక్కడే ఉందని అంటున్నారు. తుపాను వెనుక భాగం నేల మీదకు వచ్చేసరికి గాలి అంతకుముందు వీచిన వైపు కాకుండా, దానికి పూర్తి ఎదురు దిశ నుంచి అంతకంటే ఎక్కువ వేగంతో విరుచుకుపడుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో నేల మీదకు వచ్చాక తుపానుకు సముద్రపు తేమ అందకపోవడం, ఊళ్లు, చెట్లు, కొండలు అడ్డంకిగా ఉండటం వల్ల బలహీనపడి సాధారణ వర్షంగా మారి కనుమరుగైపోతుందని వివరిస్తున్నారు.

Tags: