దేశ‌ భ‌ద్ర‌త‌కు AI ముప్పు: సైన్యం మ‌నోధైర్యాన్ని దెబ్బ తీసేలా కుట్ర‌!

సాంకేతికత ఎంతగా పురోగమిస్తున్నా.. దాన్ని దుర్వినియోగం చేస్తే ఎదురయ్యే ముప్పు కేవ‌లం వ్య‌క్తులు, సమాజానికే కాదు.. దేశ సమగ్రతకే పెద్ద ప్రమాదంగా మారుతోంది.

Update: 2026-10-28 09:38 GMT

సాంకేతికత ఎంతగా పురోగమిస్తున్నా.. దాన్ని దుర్వినియోగం చేస్తే ఎదురయ్యే ముప్పు కేవ‌లం వ్య‌క్తులు, సమాజానికే కాదు.. దేశ సమగ్రతకే పెద్ద ప్రమాదంగా మారుతోంది. ఇటీవల సోషల్ మీడియా- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ద్వారా రూపొందిస్తున్న `డీప్‌ఫేక్` వీడియోలు కేవ‌లం సెలబ్రిటీల‌కు మాత్ర‌మే ముప్పు తేవ‌డానికి ప‌రిమితం కాలేదు. అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన‌ దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి తీవ్రమైన సవాలుగా పరిణమిస్తున్నాయి. చైనా సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చారంటూ తప్పుడు ప్రచారాలు చేయడం.. ఫేక్ వీడియోలతో ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం ద్వారా దేశ సరిహద్దులలో ఉద్రిక్తతలను పెంచే కుట్రలు జరుగుతున్నాయని భారత సైన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇటీవల బీహార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రీతూ చౌదరి షేర్ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు తీవ్ర దుమారం రేపాయి. చైనా వాహనాలు భారత భూభాగంలోకి వచ్చేశాయని ఒక పోస్ట్‌లో.. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను చైనా ఆక్రమించిందని... భారత ఆర్మీకి అవసరమైన సరుకులు అందకుండా నిలిపివేశారని మరొక పోస్ట్‌లో ఆరోపించారు. అయితే భారత ఆర్మీ ఈ తప్పుడు పోస్టుల వెనుకున్న అసలు నిజాన్ని బయటపెట్టింది. సిక్కింలోని నాథూలా పాస్ వద్ద క‌మ‌ర్షియ‌ల్ వెహిక‌ల్స్ రాకపోకలను సైనిక ఆక్రమణగా చిత్రకరించారని.. అలాగే కశ్మీర్‌లోని కుప్వారా ప్రెస్ మీట్‌కు సంబంధించిన లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కాలియా పాత వీడియోను ఏఐ సహాయంతో డీప్‌ఫేక్‌గా మార్చి అరుణాచల్ ప్రదేశ్‌పై మాట్లాడినట్లు సృష్టించారని స్పష్టం చేసింది.

ఈ పరిణామంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత సైన్యం ప్రతిష్టను దిగజార్చడానికి... శత్రు దేశాలకు ప్రయోజనం చేకూర్చేలా ఇటువంటి వికృతమైన ఏఐ వీడియోలను ప్రచారం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు నిస్సందేహంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది మన శత్రువులు చేసే దుశ్చర్యలతో సమానమైన ద్రోహం. భారత సైన్యం ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ నీచమైన ప్రచారాన్ని నడుపుతోంది! అని ఆయన విమర్శించారు. అంతర్జాతీయ సరిహద్దులలో సైన్యం మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.

అయితే..ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడు వినోద్ జఖార్ ఈ వ్యవహారాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. వీడియో ఎడిట్ చేసిన‌దే అయినా.. అందులో చెప్పిన విషయాలు నిజమేనంటూ వ్యాఖ్యానించడం మరింత వివాదానికి దారితీసింది. ఢిల్లీలో యువత నిరసనలను అణచివేసేందుకు బలగాలను ఉపయోగిస్తున్న బీజేపీ ప్రభుత్వం, అరుణాచల్‌లో చైనా ఆక్రమణలను అడ్డుకోవడానికి ఎందుకు బలగాలను పంపడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ.. ప్రతిపక్ష పార్టీకి భారత సాయుధ బలగాలపై ఉన్న వ్యతిరేకతను ఈ ఘటన మరోసారి నిరూపించిందని విమర్శించారు.

మొత్తానికి డీప్‌ఫేక్ - సోషల్ మీడియా దుష్ప్రచారాలు, రాజకీయ సుడిగుండంలోకి రావ‌డం.. అవి మ‌న దేశ భ‌ద్ర‌త‌కే ముప్పుగా ప‌రిణ‌మించ‌డాన్ని ఈ ఘ‌ట‌న స్ప‌ష్ఠంగా అర్థ‌మ‌య్యేలా చెప్పింది. ఏఐతో ముప్పు వ్య‌క్తిగ‌త లేదా రాజ‌కీయ పార్టీల‌ వివాదాల స్థాయిని దాటి దేశ సమగ్రతకు భంగం కలిగించే వ‌ర‌కూ ప్రమాదకరంగా మారడం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. కుటిల‌ రాజకీయం కోసం జాతీయ భద్రతను, సైన్యం నిబద్ధతను పణంగా పెట్టేలా తప్పుడు కంటెంట్‌ను సృష్టించ‌డం.. అన్యాయంగా భార‌త సైన్యాన్ని ఇందుకు ఉప‌యోగించుకోవ‌డం అత్యంత ఆందోళనకరం. ఏఐ సాంకేతికతతో రూపొందే ఇటువంటి చెత్త రిపోర్టుల విష‌యంలో ప్రజలు- రాజకీయ వర్గాలు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని.. వాస్తవాలను ధృవీకరించకుండా సోషల్ మీడియాలో పోస్టులు చేయడం దేశభద్రతకే ముప్పుగా పరిణమిస్తుందని ఈ సంఘటన హెచ్చరిస్తోంది. ప్ర‌త్య‌ర్థి పార్టీని ఢీకొట్ట‌డానికి ఏకంగా దేశ భ‌ద్ర‌త‌కే ముప్పు కోర‌డం ఎంత‌టి వారికి అయినా క్ష‌మార్హం కాని నేరం! సాక్షాత్తూ సైనికులే రాజ‌కీయ నాయ‌కుల దుశ్చ‌ర్య‌ల‌ను ప్ర‌శ్నించ‌డం చూస్తుంటే.. కుటిల రాజ‌కీయాల‌తో ప్ర‌మాదం ఎలా ముంచుకొస్తుందో గుర్తు చేస్తోంది.

Tags:    

Similar News