ఏపీ ధాన్యాగారం పైనే ఆర్నాబ్ దాడి

ఏపీకి ధాన్యాగారంగా గోదావరి జిల్లాలను చెబుతారు. అక్కడ పండిన పంట ఒక్క ఏపీకే కాదు దేశంలో చాలా ప్రాంతాలకు ఆహారంగా మారుతుంది.

Update: 2026-10-28 07:37 GMT

ఏపీకి ధాన్యాగారంగా గోదావరి జిల్లాలను చెబుతారు. అక్కడ పండిన పంట ఒక్క ఏపీకే కాదు దేశంలో చాలా ప్రాంతాలకు ఆహారంగా మారుతుంది. అందుకే అన్నపూర్ణగా ఈ ప్రాంతాలను పిలుస్తారు. ఏపీలో బంగారు పంటలు పండే గోదావరి సీమలు కరవు కాటకాలను పూర్తిగా లేకుండా చేస్తూ వస్తున్నాయి. అలాంటి ఏపీ ధాన్యాగారం మీద గురి చూసి మరీ అతి పెద్ద దెబ్బ కొట్టింది ఆర్నాబ్ తుఫాన్. దీంతో ఏపీ మరింత ఇబ్బందులలో పడనుంది అంటున్నారు. ఇప్పటికే ఏపీలో ఎల్ నినో ప్రభావంతో మిగిలిన ప్రాంతాలలో ఈసారి ఖరీఫ్ సీజన్ లో వరి పంట లేకుండా పోతోంది. దిగుబడి కూడా దారుణంగా ఉంటుందని పెద్దగా రాదని అంటున్నారు. అయితే గోదావరి జిల్లాల మీదనే మొత్తం ఏపీ ఆశలు పెట్టుకుంది. ఇపుడు ఆర్నాబ్ పెను తుఫానుగా విరుచుకుపడి దానికే భారీ షాక్ ఇచ్చింది అని అంటున్నారు.

కోస్తా కన్నీరు :

కోస్తా అంతా ఆర్నాబ్ కొట్టిన దెబ్బతో విలవిలలాడుతోంది. సరిగ్గా ఖరీఫ్ సీజన్ పంట చేతికి అంది వచ్చే సమయానికి ఇలా ప్రకృతి వికృతిగా మారి విరుచుకుపడుతుందని రైతులు కలలో కూడా అనుకోలేదు. గత నెలలో కూడా తుఫాన్ వచ్చింది. అయితే అది సాధారణంగానే తన ప్రభావం చూపించి తప్పుకుంది. ఈసారి కూడా ఒక మాదిరిగా ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ ఇది భారీ తుఫానుల సరిసాటిగా మారింది. ఉన్నఫళంగా విరుచుకుపడి పంటలను మొత్తం సర్వ నాశనం చేసింది అని రైతన్నలు రోదిస్తున్నారు. ఇపుడు గోదావరి జిల్లాలలో ప్రతీ పోలమూ కూడా చెరువులనే తలపిస్తోంది అని విలపిస్తున్నారు.

గుండెల్లో గునపాలే :

జల ఖడ్గం తో దూసుకుని వచ్చి కోస్తా గుండెల్లో ఆర్నాబ్ గునపాలు గుచ్చింది అని అంటున్నారు. ఈ తుఫాన్ ప్రభావం నుంచి కోలుకోవడం కూడా కష్టమే అన్న మాట అంతటా వినిపిస్తోంది. మౌలిక సదుపాయాలతో పాటు అన్నింటికీ తీవ్ర నష్టం చేస్తూ ఆర్నాబ్ తన కఠిన పద ఘట్టనలతో పచ్చని ప్రాంతాలో చిచ్చు రేపింది అని అంటున్నారు. అన్నం పెట్టే కోస్తా సీమలను పాడుగా బీడుగా మార్చేసింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎల్ నినోకు దోస్త్ గా :

నిజానికి ఎల్ నినోతో వర్షాకాలం పూర్తిగా పోయింది. దాంతో మెట్ట ప్రాంతాలలో అనేక జిల్లాలలో ఈసారి వానలు లేక భూగర్భ జలాలు పూర్తిగా ఎండి సాగు సరిగా సాగలేదు. దాంతో ఈసారి వరి దిగుబడి దారుణంగా పడిపోతుంది అని అంతా భావిస్తూ వచ్చారు. మార్కెట్ లో కేజీ బియ్యం వందకు చేరువ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలు ఆదుకుంటాయని అంతా నమ్మకంగా ఉన్నారు. ఇపుడు ఆ నమ్మకాన్ని పెను తుఫాను వమ్ము చేసింది అని అంటున్నారు. ఏపీ మొత్తానికే కాకుండా దేశంలో చాలా ప్రాంతాలకు కూడా వరి కరవు తెచ్చేలా ఆర్నాబ్ దెబ్బ తీసింది అని అంటున్నారు. కాస్తా ఆగితే చాలు ఖరీఫ్ పంట చేతికి వచ్చేది అని అంటున్నారు. ఏది ఏమైనా ఊహించిన పెను ఉత్పాతం జరిగిపోయింది. అనూహ్యంగా పెను బీభత్సం సంభవించింది. ఇపుడు తుఫాన్ మిగిల్చిన నీరుతో పాటు రైతన్న కన్నీరు కూడా తోడు అవుతోంది అంటున్నారు. ఎల్ నినో కష్టాలను కాసింత అయినా తీర్చి నీటి వనరులు పెరిగేలా తుఫాను చేస్తుంది అనుకుంటే ఎవరి ఊహకూ అందనంతగా భారీ తుఫానుగా విశ్వరూపాన్ని ఆర్నాబ్ చూపించింది అని అంటున్నారు.

Tags:    

Similar News