హాస్టళ్లు కాదు... ఇక అన్నీ గురుకులాలే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
రాష్ట్రంలోని ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న హాస్టళ్ల స్థానంలో అన్నీ గురుకులాలుగా మార్చాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్ సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్కచేయకుండా, విద్యార్థుల పౌష్టికాహారం కోసం డైట్ ఛార్జీలను 10 శాతం పెంచుతూ సీఎం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాంఘిక సంక్షేమశాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హాస్టళ్లు, గురుకులాల పనితీరులో మార్పు తెచ్చేలా మార్గనిర్దేశం చేశారు.
పది శాతం డైట్ ఛార్జీల పెంపు
ప్రస్తుతం ఉన్న డైట్ ఛార్జీలను 10 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం వెల్లడించారు. ఆర్థిక శాఖ అధికారులు వచ్చే ఏడాది నుండి అమలు చేద్దామని సూచించినప్పటికీ, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే ఈ పెంపును వర్తింపజేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ హాస్టళ్ల స్థానంలో అత్యాధునిక వసతులతో కూడిన గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా గురుకులాలను తీర్చిదిద్దాలని, బయో డైవర్శిటీ పార్కుల తరహాలో నిర్వహణ ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల మరమ్మతుల కోసం రూ.100 కోట్లు కేటాయించినట్లు సీఎం ప్రకటించారు. సాస్కి పథకం కింద రూ.120 కోట్లతో ఆర్వో ప్లాంట్లు, టాయిలెట్ల నిర్మాణం ముమ్మరంగా సాగుతున్నాయని అధికారులు వివరించారు. ఇక కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో విద్యార్థులు ప్రతిభ చూపేలా ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనుట్లు సీఎం ప్రకటించారు. ఇందుకోసం బెస్ట్ టీచర్లను నియమించి నాణ్యమైన క్వాలిటీ ట్రైనింగ్ అందించాలని సీఎం ఆదేశించారు.
విద్యార్థులు తమ తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు మాట్లాడేలా స్మార్ట్ కార్డ్ బేస్డ్ టెలీఫోన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా విద్యార్థులు రోజుకు 4 నిమిషాల పాటు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే సదుపాయం కల్పించారు. ఈ నిర్ణయాల ద్వారా బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే కాకుండా, వారిని భవిష్యత్తులో దేశం గర్వించదగ్గ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.