హైదరాబాద్‌లో 'బ్రేకింగ్ బ్యాడ్' : యూట్యూబ్ చూసి వైన్ తయారీ.. చౌక ధరకు విక్రయాలు

ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' గుర్తుందిగా? అందులో హీరో కెమిస్ట్రీ నాలెడ్జ్‌తో డ్రగ్స్ తయారు చేసి అక్రమంగా సంపాదిస్తాడు.

Update: 2026-07-09 05:15 GMT

ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' గుర్తుందిగా? అందులో హీరో కెమిస్ట్రీ నాలెడ్జ్‌తో డ్రగ్స్ తయారు చేసి అక్రమంగా సంపాదిస్తాడు. సరిగ్గా అలాంటి మైండ్‌సెట్‌తోనే హైదరాబాద్‌లో ఒక వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. అయితే ఇక్కడ డ్రగ్స్ కాకుండా.. యూట్యూబ్ చూసి ఏకంగా ఇంట్లోనే వైన్ తయారీ కేంద్రం పెట్టేశాడు. ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ నకిలీ వైన్ దందాను మల్కాజిగిరి జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు రట్టు చేశారు. ఈ విచిత్రమైన ఘటన హైదరాబాద్‌ పరిధిలోని నేరేడ్‌మెట్, సికింద్రాబాద్, కాప్రా ప్రాంతాల్లో స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

అసలు ఏం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఆంటోనీ పీటర్ అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం అతడు ఎంచుకున్న మార్గం 'యూట్యూబ్'. యూట్యూబ్‌లో వైన్ ఎలా తయారు చేయాలనే వీడియోలను నిశితంగా పరిశీలించి ఆ ప్రక్రియను పూర్తిగా నేర్చుకున్నాడు. ఆ తర్వాత దానినే ఒక వ్యాపారంగా మార్చాలని డిసైడ్ అయ్యాడు. ప్రభుత్వ నిబంధనలు, ఎక్సైజ్ అనుమతులు ఏవీ లేకుండానే తన నివాసంలోనే ఒక చిన్నపాటి వైన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశాడు. అతడి మేకింగ్ స్టైల్ చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఆంటోనీ కేవలం ఒకే రకమైన వైన్ కాకుండా, ఏకంగా 7 రకాల ఫ్లేవర్లలో వైన్ తయారు చేయడం ప్రారంభించాడు.

ద్రాక్ష , అనాసపండు , జామ , బత్తాయి , సపోటా , అరటిపండు, తమలపాకులతో వేర్వేరు వైన్ తయారు చేశాడు.

తయారీ విధానం.. రూ. 300లకే బ్రాండెడ్ లుక్

పోలీసుల విచారణలో ఆంటోనీ పీటర్ తన వైన్ తయారీ సీక్రెట్స్‌ను వెల్లడించాడు. పండ్ల రసాలకు తోడుగా చక్కెర, గోధుమలను కలిపి సుమారు 15 రోజుల పాటు పులియబెట్టడం ప్రక్రియకు గురిచేసేవాడు. ఆ తర్వాత వచ్చిన మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి, మార్కెట్‌లో దొరికే బ్రాండెడ్ సీసాల తరహాలోనే ప్యాక్ చేసేవాడు.

సాధారణంగా వైన్ ధరలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఆంటోనీ కస్టమర్లను ఆకర్షించడానికి సరికొత్త స్ట్రాటజీని వాడాడు. 750 మిల్లీలీటర్ల వైన్ బాటిల్‌ను కేవలం రూ. 300లకే విక్రయించేవాడు. తక్కువ ధరకే లభిస్తుండటంతో మందుబాబుల నుంచి దీనికి భారీగా డిమాండ్ పెరిగింది.

టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.. సీజ్ చేసిన ఆస్తులు

నగరంలో అనధికారికంగా వైన్ విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో మల్కాజిగిరి జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు నిందితుడి స్థావరంపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో వైన్ నిల్వలను కనుగొన్నారు. మొత్తం 377 లీటర్ల వైన్, 502 బాటిళ్లు, అలాగే తయారీకి ఉపయోగించిన పరికరాలను పోలీసులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.1.5 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

పోలీసుల హెచ్చరిక

చట్టబద్ధమైన అనుమతులు, లైసెన్సులు లేకుండా మద్యం లేదా వైన్ వంటి పానీయాలను ఇంట్లో తయారు చేయడం, విక్రయించడం తీవ్రమైన నేరమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ రకమైన హోమ్ మేడ్ ఆల్కహాల్ వల్ల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం ఆంటోనీ పీటర్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వైన్ తయారీలో ఉపయోగించిన కెమికల్స్ ఏంటి? ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా? అనే కోణంలో శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు. అలాగే ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News