జగన్ మార్క్ ట్యాగ్ కి దూరం ?
జగన్ రాజకీయాల్లోకి వస్తూనే ఒక పవర్ ఫుల్ స్లోగన్ వినిపించేవారు. మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు అంటూ జనంలోకి జగన్ యువ కెరటంలా దూసుకుని వచ్చారు.
జగన్ రాజకీయాల్లోకి వస్తూనే ఒక పవర్ ఫుల్ స్లోగన్ వినిపించేవారు. మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు అంటూ జనంలోకి జగన్ యువ కెరటంలా దూసుకుని వచ్చారు. నిజానికి ఈ మాటల మీద పేటెంట్ హక్కులు అన్నీ వైఎస్సార్ కి ఉన్నాయి. ఆయన పదే పదే అదే మాట చెప్పేవారు. అంతే కాదు తన మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో దానిని తుచ తప్పకుండా అమలు చేసి చూపించారు. కానీ జగన్ మాత్రం ఈ విషయంలో తడబడుతూనే సాగుతున్నారు. మొదట్లో జగన్ గట్టి పట్టుదలగా ఉండేవారు. ఆ పట్టుదలతో రాజకీయంగా నష్టాలు కూడా ఎన్నో ఎదుర్కొన్నారు. అయితే మాట తప్పేది లేదు అని జగన్ అంటే జనాలు కూడా ఆయన నిబద్ధతకు ఆకర్షితులు అయ్యేవారు. అందుకే 2014లో ఏకంగా 67 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా వైసీపీ అవతరించింది. 2019లో 151 సీట్లు దక్కాయి. అయితే 2024 లో మాత్రం జగన్ కి 11 సీట్లే దక్కాయంటే ఆలోచించాల్సిందే.
మడమ తిప్పేశారు అనేనా :
నిజానికి 2019 దాకా జగన్ మాట తప్పలేదు, మడమ కూడా తిప్పలేదు. ఆయన 2014లో అసెంబ్లీలో విపక్ష నేతగా మాట్లాడుతూ అమరావతికే తన ఓటు అని పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు అదే మాటను చెప్పారు. తాడేపల్లిలో ఇల్లు కూడా కట్టుకున్నారు. దాంతో జనాలు పూర్తిగా నమ్మారు, అమరావతి ప్రాంతంలో కూడా సీట్లు అధికంగా వైసీపీకి వచ్చాయి. కానీ ఎపుడైతే అధికారంలోకి వచ్చారో మూడు రాజధానులు అని జగన్ అన్నారు. దాంతోనే జగన్ మడమ తిప్పారని విపక్షాలు విమర్శలు చేయడం మొదలెట్టాయి. ఇక 2024 వరకూ జగన్ మూడు రాజధానులూ ముందుకు సాగలేదు, అమరావతి కూడా అలాగే ఉండిపోయింది. దాంతోనే ఎన్నికల్లో భారీ దెబ్బ పడిపోఅయింది.
మావిగన్ తో మరోసారి :
సరే జరిగింది ఏదో జరిగింది అని వైసీపీ తన తప్పులను దిద్దుకుంటుందా అని అంతా ఎదురు చూశారు. అయితే మావిగన్ తో జగన్ సరికొత్త చర్చకు తెర లేపారు. 2029 ఎన్నికలు మావిగన్ కి అమరావతికి అంటూ ఆయన వినూత్నమైన సవాల్ ని అధికార కూటమికి విసిరారు. 2029 లో కూడా రాజధాని ఇష్యూ మీదనే జనాలను తీర్పు చెప్పమని జగన్ కోరుతున్నారు. నిజానికి అమరావతికి చట్టబద్ధత వచ్చి దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయల నిర్మాణాలు అక్కడ జరుగుతున్న వేళ జగన్ విసిరిన ఈ సవాల్ పట్ల అంతా ఆలోచించే నేపథ్యం ఉందిపుడు.
నిలకడ లేదని అంటూ :
ఇక జగన్ ఈ విషయంలో అయితే కూటమికి కార్నర్ అవుతున్నారు. జగన్ రాజధాని వంటి కీలకమైన అంశం ఒక భావోద్వేగమైన విషయంలో నిలకడలేని తనాన్ని చూపిస్తున్నారు అని కూటమి నేతలు విమర్శించడానికి అవకాశం కోరి ఇచ్చారు అని అంటున్నారు. ఇపుడు అదే కూటమి ప్రచారం చేస్తోంది. ఒక విధంగా వైసీపీ నేతలు డిఫెన్స్ లో పడ్డారు అని అంటున్నారు. అంతే కాదు జనంలోనూ దీని మీద చర్చ సాగుతోంది. జగన్ అధికారంలోకి వస్తే మళ్ళీ రాజధాని ప్రయోగాలు చేస్తారు అని కూడా కూటమి నేతల నుంచి విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది.
బ్రాండ్ ఇమేజ్ కే అలా :
వైఎస్సార్ ఫ్యామిలీ అంటే మాట తప్పదు, మడమ తిప్పదు అన్నది ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది అని అంటారు. కానీ జగన్ మాత్రం ఒక్క రాజధాని విషయంలో ఇన్ని సార్లు మాటా మడమా తిప్పుతున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే వీలు కూటమికి దొరికింది. అలా వైసీపీ తానుగా డిఫెన్స్ లోకి వెళ్ళింది అని అంటున్నారు. అభివృద్ధి అంశాలలో ఎమోషనల్ సెంటిమెంట్ ఇష్యూస్ లో మరీ ముఖ్యంగా రాజధాని వంటి వాటిలో ఈ విధంగా ఒక బలమైన ప్రతిపక్షం ఇలా వ్యవహరించడం మీద కూడా చర్చ సాగుతోంది. సంక్షేమ పధకాలను అన్నీ పంటి బిగువున కరోనా సైతం లెక్క చేయకుండా అమలు చేసిన జగన్ అమరావతి విషయంలో మాత్రం తన స్టాండ్ ని మార్చుకుంటూ పోతున్నారు అని విమర్శలు అయితే గట్టిగా ఉన్నాయని అంటున్నారు. మరి నిలకడ లేదు అని విపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు జగన్ వైసీపీ ఏ విధంగా తిప్పికొట్టే యాక్షన్ ప్లాన్ తో వస్తుందో చూడాల్సి ఉందని అంటున్నారు.