పల్లా వర్సెస్ గంటా...ఎవరికి చాన్స్ ?

విశాఖ జిల్లాలో ఈసారి ఒకరికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

Update: 2026-07-09 03:49 GMT

విశాఖ జిల్లాలో ఈసారి ఒకరికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి రెండేళ్ళ పాలన పూర్తి అయింది కాబట్టి తొందరలో విస్తరణ ఉండొచ్చు అని అంటున్నారు. దాంతో ఎవరికి ఎక్కడ మంత్రి పదవులు వస్తాయన్న దాని మీద ఊహాగానాలు ప్రచారాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. విశాఖ జిల్లా విషయానికి వస్తే 2024 ఎన్నికల తరువాత మంత్రి అంటూ లేకుండా పోయారు. పక్కనే ఉన్న అనకాపల్లి జిల్లా నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు హోం మంత్రిగా చాన్స్ వచ్చింది. అలాగే నర్శీపట్నం నియోజకవర్గానికి చెందిన అయ్యన్నపాత్రుడికి రాజ్యాంగబద్ధమైన పదవి స్పీకర్ స్థానం దక్కింది. దీంతో అనకాపల్లి వరకూ బాగానే ఉన్న కీలకమైన జిల్లా విశాఖకు మంత్రి లేకుండా పోయారు అన్న అసంతృప్తి అయితే కూటమి ఎమ్మెల్యేలలో ఉంది అని అంటున్నారు.

నాలుగేళ్ళుగా అదే పరిస్థితి :]

ఇదిలా ఉంటే విశాఖ జిల్లాకు మంత్రి పదవి దక్కి నాలుగేళ్ళకు పైదాటుతోంది. వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2022 దాకా అవంతి శ్రీనివాస్ విశాఖ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు. 2022లో వైసీపీ విస్తరణ చేసినపుడు అనకాపల్లి జిల్లాకే ప్రాధాన్యత ఇచ్చింది. అనకాపల్లికి చెందిన గుడివాడ అమర్నాథ్ కి మంత్రి చాన్స్ వస్తే మాడుగులకు చెందిన బూడి ముత్యాల నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. విశాఖ జిల్లా ఆనాటి మంత్రి పదవికి నోచుకోలేదని గుర్తు చేస్తున్నారు. దాంతో ఈసారి ఆ లోటు భర్తీ అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

పల్లాకి ప్లస్ అవుతుందా :

ఇక మంత్రి వర్గ విస్తరణ అంటూ జరిగితే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ కి అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. విశాఖ నగర పరిధిలో యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి ఎపుడూ మంత్రిగా అవకాశాలు దక్కలేదు. పైగా జీవీఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే వారి మద్దతు చాలా కీలకం అవుతుందని కూడా టీడీపీలో అంతా భావిస్తున్నారు. దాంతో పాటుగా పల్లా నిబద్ధత ఆయన అంకితభావం, అధినాయకత్వం వైపు నుంచి ఉన్న సానుకూలత ఇవన్నీ కలసి ప్లస్ అవుతాయని అంటున్నారు. విద్యావంతుడిగా వివాదరహితుడిగా ఉన్న పల్లాకు న్యాయం చేయాలన్న ఆలోచన కూడా పార్టీ పెద్దలలో ఉంది అని అంటున్నారు.

గంటా సీనియారిటీతో :

ఇక భీమునిపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన కాంగ్రెస్ లో రెండేళ్ళు, టీడీపీలో 2014 నుంచి 2019 దాకా అయిదేళ్ళ పాటు మొత్తం ఏడేళ్ళు మంత్రిగా కీలక శాఖలను చూశారు. ఆయన మంత్రిగా ఉంటే జిల్లాలో పార్టీని ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఏకత్రాటిన నడిపిస్తారు అని అంటున్నారు. ఆయన పట్టు బిగించి జిల్లా రాజకీయాలను చేసిన చరిత్ర ఉందని అంటున్నారు. పార్టీనే కాదు కూటమిని కూడా ముందుకు తీసుకుని పోవాలన్నా కో ఆర్డినేషన్ కూడా ఉండాలన్నా గంటా వంటి వారి చేతిలో జిల్లాను పెడితే బాగుంటుంది అని ఆయన వర్గీయులు అంటున్నారు. గంటా కూడా ఈసారి మంత్రి అయితే చాలు తన రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టి విరమణ ప్రకటించాలని చూస్తున్నారు అని కూడా అంటున్నారు. దాంతో గంటా వర్సెస్ పల్లా గా జిల్లాలో మంత్రి పదవి విషయంలో సాగుతోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని మాత్రం ప్రచారంలో ఉన్న మాట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News