ఏటీఎంలో నో మనీ...ఏం జరుగుతోంది ?

ఏటీఎం అంటే ఎనీ టైం మనీ. అందుకే చాలా మంది డబ్బుల కోసం నేరుగానే ఏటీఎంలను ఆశ్రయిస్తారు. తమ దగ్గర లిమిటెడ్ గా డబ్బు పెట్టుకుంటున్నారు.

Update: 2026-07-09 03:48 GMT

ఏటీఎం అంటే ఎనీ టైం మనీ. అందుకే చాలా మంది డబ్బుల కోసం నేరుగానే ఏటీఎంలను ఆశ్రయిస్తారు. తమ దగ్గర లిమిటెడ్ గా డబ్బు పెట్టుకుంటున్నారు. అయితే ఏటీఎంల వద్ద మనీ లేకపోతే ఏం చేయాలి. ఇదే ఇపుడు పెద్ద సమస్యగా మారుతోంది. ఎందుకిలా జరుగుతోంది అన్నదే పెద్ద ప్రశ్న. డబ్బు లేదా లేక సరఫరా తగ్గిందా అన్న ప్రశ్నలు వెంటనే వస్తాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం చూస్తే ఈ ఏడాది మే 22 నాటికి దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న కరెన్సీ రికార్డు స్థాయిలో 42.54 లక్షల కోట్లుగా ఉంది. ఇది ఏడాది క్రితంతో పోలిస్తే దాదాపు 12 శాతం ఎక్కువ అని చెబుతున్నారు. మరి సరఫరా ఇంతలా ఉంటే ఏటీఎం మెషీన్లలో నగదు కొరత ఎందుకు ఏర్పడుతోంది అని జనాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

డిజిటల్ చెల్లింపులు పెరిగాయి :

ఇదిలా ఉంటే దేశంలో పెద్ద ఎత్తున డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. ముఖ్యంగా యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోవడంతో ఆ మేరకు ఏటీఎంలను ఆశ్రయించే వారి సంఖ్య తగ్గింది అని ఒక లెక్క ఉంది. మరో వైపు చూస్తే ఏటీఎంలకు నిరంతరం నగదుని తెచ్చి రీఫిల్ చేయడం బ్యాంకులకు ఆపరేటర్లకు చాలా ఖరీదైనదిగా మారింది అని అంటున్నారు. అందువల్లనే సమయానికి తగినట్లుగా ఏటీఎంలలో నగదుని నింపే కార్యక్రమం కొంత నెమ్మదిస్తుంది అన్న చర్చ కూడా సాగుతోంది.

ఖరీదైన వ్యవహరంగా :

దేశంలో ఏటీఎంలు ఒకపుడు అతి పెద్ద సౌకర్యంగా ఉంటూ వచ్చాయి. ఎపుడైతే డిజిటల్ పేమెంట్స్ పెరిగాయో నాటి నుంచి నెమ్మదిగా ఏటీఎంల విస్తరణ తగ్గిపోతోంది. ఇపుడు ఉన్న వాటిని మెయిన్ టెయిన్ చేయడం మీద కూడా ఆలోచన మొదలైంది అని కూడా అంటున్నారు. నిజానికి ఏటీఎంల నిర్వహణ అన్నది ఖర్చుతో వ్యవహారంగా మారుతోంది. పెరిగిన ఇంధనం, భద్రత వేతనాల ఖర్చుల కారణంగా ఏటీఎంలను నిర్వహించడం భారంగా మారుతోంది. ఆఫ్-సైట్ ఏటీఎంల నుండి డబ్బు విత్‌డ్రా చేయడానికి బ్యాంకులు చెల్లించే ఇంటర్‌ఛేంజ్ ఫీజు ఇప్పుడు ఈ అధిక నిర్వహణ ఖర్చులను కూడా భరించడం లేదు అని అంటున్నారు. దీనివల్ల తరచుగా డబ్బు నింపడం వ్యయంగా ఆపరేటర్లకు మారుతోంది.

సెమీ అర్బన్ రూరల్ లలో సైతం :

ఇక మహా నగరాలలో కూడా చాలా మంది ఈ రోజుకీ ఏటీఎంలను ఆశ్రయిస్తున్నారు. సెమీ అర్బన్ రూరల్ సెక్టార్ లక్ అయితే ఏటీఎంలు ప్రధానమైన బ్యాంకులుగానే ఉంటున్నాయి. దాంతో నగదు నిల్వలు సకాలంలో నింపకపోతే ఇబ్బంది పడుతున్నది అధిక శాతం రూరల్ జనాలే అని అంటున్నారు. గ్రామీణ ప్రాంతం టైర్-2 పట్టణాలలో నగదు రవాణా సంస్థలకు నిర్వాహకులకు బ్యాంకుల నుండే తరచుగా తగినంత సరఫరా అందడం లేదు అని అంటున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలు నగదుపై ఆధారపడిన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

నగదు కొరతతో ఫిర్యాదులు :

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో నగదు కొరతపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ శాఖలు ఏటీఎంలలో నగదు లభ్యతను పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇక అనేక టైర్ టూ సిటీలు, చిన్న నగరాల నుండి నగదు కొరతకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని అంటున్నారు. ఎస్ బీఐతో సహా వివిధ బ్యాంకుల వినియోగదారులు ఏటీఎంలలో నగదు ఉండడం లేదని ఫిర్యాదులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో బ్యాంకులు ఏటీఎంలలో సరైన సమయంలో తగినంత నగదును నింపుతున్నాయో లేదో నిర్ధారించుకోవడానికి ఆర్బీఐ బ్యాంక్ శాఖల వద్ద ఉన్న నగదు నిల్వల వివరాలను కోరింది. బ్యాంకులు తమ ఏటీఎంలలో తగినంత నగదును నిర్వహించడంలో విఫలమైతే ఆర్బీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంబంధిత అధికార వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో సైతం :

ఇక దేశవ్యాప్తంగా గత కొంతకాలంగా ఏటీఎంలలో నగదు కొతర సమస్య పట్టి పీడిస్తోంది. అదే సమయంలో ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లో ఏటీఎంలలో నగదు లభ్యత స్థాయిలను చూస్తే 57 శాతం నుండి 64 శాతం మధ్య ఉన్నాయని చెబుతునారు. అంటే నగదు అవసరాలలో గణనీయమైన లోటు ఏర్పడింది అని అంటున్నారు. భాగం ఏటీఎంలలో నగదు కొరత విషయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ప్రస్తుతం ముందు వరుసలో ఉన్నాయని చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ సరఫరాలో గతంలో కంటే ఎక్కువ నగదు ఉన్నప్పటికీ ఏటీఎంలకు దానిని పంపిణీ చేయడానికి బ్యాంకులు ఆపరేటర్లు ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. ఇక మహా నగరాల్లోని చాలా మందికి ఏటీఎంలో నగదు అయిపోవడం ఒక చిన్న సమస్య మాత్రమే అని అంటున్నారు. వారు సాధారణంగా సమీపంలో మరొక ఏటీఎం లోకి వెళ్తారు లేదా దానికి బదులుగా యూపీఐ ఇతర డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించగలరు. కానీ నగదు విత్‌డ్రాయల్స్‌పై ఎక్కువగా ఆధారపడే సీనియర్ సిటిజన్లు పెన్షనర్లు, సంక్షేమ లబ్ధిదారులు, రైతులు చిన్న వ్యాపారులకు ఈ పరిస్థితి మరింత కష్టంగా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News