షర్మిల వ్యూహాత్మక మౌనం...ఏపీ మీద కాంగ్రెస్ స్టాండ్ ?
వైఎస్సార్ జయంతి వేళ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన తండ్రికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రికి రెండు తెలుగు రాష్ట్రాలలో కోట్లాది మంది ప్రజలే అతి పెద్ద కుటుంబంగా అభివర్ణించారు.
వైఎస్సార్ జయంతి వేళ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన తండ్రికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రికి రెండు తెలుగు రాష్ట్రాలలో కోట్లాది మంది ప్రజలే అతి పెద్ద కుటుంబంగా అభివర్ణించారు. వైఎస్సార్ కేవలం అయిదేళ్ళ పాటు మాత్రమే పాలించినా అనేక సంక్షేమ పధకాలను అమలు చేశారని ఆమె గుర్తు చేశారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక దాదాపుగా ఏడు వందల మంది మరణించారు ఆమె చెప్పారు. వైఎస్సార్ తెలుగు వారి గుండెలలో చిర స్థాయిగా ఉంటారు అని అన్నారు. ఇలా ఆమె తన తండ్రిని గురించి మంచి మాటలు చెప్పి మీడియా మీట్ ని ముగించారు.
చాలా కాలం తరువాత :
ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చారు. ఆమె చాలా తక్కువగా మాట్లాడారు, చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక షర్మిల గతానికి భిన్నంగా ఇపుడు కొంత లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు అని అంటున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సీటుని ఆశించారు. అయితే అది ఆమెకు చివరి నిముషంలో దక్కకుండా పోయింది. దాని వెనక ఏమి కారణాలు ఉన్నా మాత్రం ఆమె నిరాశకు గురి అయ్యారని అంటున్నారు. కర్ణాటక నుంచి ఖాళీ అయిన మూడు సీట్లలో ఆమెకు తప్పకుండా ఒక ఎంపీ సీటు ఇస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. షర్మిల అయితే తన పార్టీని తెలంగాణాలో స్థాపించి ఆ తరువాత కాంగ్రెస్ లో విలీనం చేసి 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఓటమికి తీవ్ర స్థాయిలో కృషి చేశారు.
సోదరుడితోనే తీవ్రంగా :
సొంత అన్న జగన్ తోనే ఆమె తీవ్ర స్థాయిలో విభేచించారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు వెనక షర్మిల చేసిన జగన్ వ్యతిరేక ప్రచారం కూడా కీలక పాత్ర పోషించింది అన్న రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమలో 52 సీట్లకు కేవలం ఏడు సీట్లు మాత్రమే దక్కాయి అంటే అది షర్మిల ప్రభావమే అని చెబుతారు. వైసీపీకి ఆ విధంగా ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. ఇంత చేసినా వైసీపీ నుంచి కాంగ్రెస్ కి ఓటు షేర్ వన్ పర్సెంట్ కూడా వెనక్కి తిరిగి రాలేదని గుర్తు చేస్తున్నారు.
జగన్ వెంటే అంతా :
వైసీపీని ఓడిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తమ వైపు వస్తుందని కాంగ్రెస్ పెద్దలు ఊహించే షర్మిలను ఏపీకి పంపించి పీసీసీ చీఫ్ చేశారు. వారి టార్గెట్ 2029 ఎన్నికలు అని కూడా చెప్పుకున్నారు. అయితే మరో మూడేళ్ళలో ఏపీలో ఎన్నికలు ఉండగా ఈ రోజు కూడా కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఇక షర్మిల వైఎస్సార్ రాజకీయ వారసత్వాన్ని తన వైపు తిప్పుకోవడంలో విఫలం అయ్యారని కూడా కాంగ్రెస్ పెద్దలు అంచనా కట్టారని అందుకే ఆమెక్ రాజ్యసభ సీటు హామీ ఇచ్చి కూడా తీరా ఇవ్వలేదని కూడా అంటున్నారు. ఇక వైఎస్ జగన్ ని గత్త రెండేళ్ళుగా షర్మిల ఘాటుగా విమర్శిస్తూ వచ్చారు. కానీ దాని వల్ల కాంగ్రెస్ కి కానీ ఆమెకు కానీ ఎటువంటి రాజకీయ ప్రయోజనం సమకూరలేదని గుర్తు చేస్తున్నారు.
మౌన ముద్రలోనే :
గత నెలలో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఆనాటి నుంచి షర్మిల మౌన ముద్రలోనే ఉంటూ వస్తున్నారు. గతంలో మాదిరిగా జగన్ మీద తీవ్ర విమర్శలు చేయడం లేదు అని గుర్తు చేస్తున్నారు. షర్మిల జగన్ మీద చేసే విమర్శల ప్రభావం కాంగ్రెస్ కి మేలు చేయడం లేదని కూటమికే లాభం అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఇక రెండేళ్ళు కూటమి పాలన పూర్తి అయిన నేపథ్యంలో వైసీపీ తన గ్రాఫ్ పెంచుకునే పనిలో ఉంది. దీంతో అధికార కూటమి మీద విమర్శలు చేస్తేనే కాంగ్రెస్ కి రాజకీయ లాభం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల ప్రస్తుతానికి మౌనాన్ని ఆశ్రయించారు అని అంటున్నారు. ఇక రాజ్యసభ ఖాళీలు అన్నవి చూస్తే కనుక 2028 దాకా లేవు. అప్పటికి 2029 ఎన్నికలు దగ్గర పడతాయి కాబట్టి ఆమెను లోక్ సభ ఎన్నికల్లోనే పోటీ చేయమని అధినాయకత్వం కోరవచ్చు. ఆ విధంగా గెలిచే అవకాశాలు ఏపీలో అయితే కాంగ్రెస్ లేవు. దాంతో ఇవన్నీ కూడా షర్మిల రాజకీయాన్ని ప్రభావితం చేసేలా ఉన్నాయని అంటున్నారు. ఇండియా కూటమి కూడా వైసీపీ మీద కొంత సాఫ్ట్ కార్నర్ తో ఉంది అన్న వార్తల నేపథ్యం కూడా ఆమె మౌనానికి మరో కారణం అంటున్నారు. ఏది ఏమైనా షర్మిల రాజకీయ వ్యూహాలు ఏమిటి అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.