కారుణ్య మరణాలకు ఏపీలో గ్రీన్ సిగ్నల్
ఐచ్చిక మరణం అన్నది ఇపుడు చట్టబద్ధంగా ఒక మార్గం కాబోతోంది. అవసరమైన వారికి ఇది ఒక వరం కాబోతోంది.
ఐచ్చిక మరణం అన్నది ఇపుడు చట్టబద్ధంగా ఒక మార్గం కాబోతోంది. అవసరమైన వారికి ఇది ఒక వరం కాబోతోంది. ఈ జీవితం చాలు అని కారుణ్య మరణం కోరుకునే వారికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చించి. కారుణ్య మరణానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. వాటిని పాటించిన వారికి అన్ని రకాల చట్టపరమైన విధి విధానాలను పూర్తి చేసిన వారికి ప్రభుత్వం తరఫున అనుమతి లభించనుంది. దీంతో ఏపీలో ఇక మీదట కారుణ్య మరణాలకు మార్గం సుగమం అయినట్లుగా భావిస్తున్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే :
ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే రాష్ట్ర ప్రభుత్వం కారుణ్య మరణాల మీద కీలమైన చర్యలు తీసుకున్నట్లుగా వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు కారుణ్య మరణాలకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినట్లుగా ఆయన వెల్లడించారు. ఈ నేపధ్యంలో వైద్యులు, రోగుల కుటుంబ సభ్యుల నిర్ణయాలకు చట్ట బద్ధత దక్కనుందని పేర్కొన్నారు.
నరకయాతన నుంచి :
కారుణ్య మరణాలు అంటే అందరికీ కాదు, దానికి ఒక విధి విధానం ఉంది. కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. దాంతో మరణానికి చేరువై నరక యాతనను అనుభవించే రోగులకు ఊరట కల్పించే దిశగా ఈ ప్రధానమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అదే విధంగా సుప్రీం కోర్టు ఆదేశాలకనుగుణంగా కారుణ్య మరణాలకు విధివిధానాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ క్రమంలో కారుణ్య మరణాలకు వీలు కల్పించే ఈ ప్రక్రియను అత్యంత పటిష్టంగా పర్యవేక్షించాలని అధికార యంత్రాంగాన్ని వైద్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.
పొరపాట్లకు చోటు లేకుండా :
కారుణ్య మరణాల విహ్సయంలో అనుమతుల మంజూరులో ఏ దశలోనూ పొరపాటు జరక్కుండా తగిన చర్యలు తీసుకోవాలని సత్యకుమార్ యాదవ్ అధికారులకు దిశా నిర్దేశం చేయడం విశేషం. రోగి పరిస్థితిని పరీక్షించేందుకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. అదే విధంగా భిన్నాభిప్రాయాలుంటే రోగి కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించ వచ్చునని కూడా చెప్పారు. కారుణ్య మరణాలకు సంబంధించిన రికార్డుల్ని రోగి మరణానంతరం మూడేళ్ల వరకు భద్రపరచాలన్నది మరో కీలకమైన నిబంధనగా రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలలో రూపొందించింది.
ఎవరికి మేలు :
కారుణ మరణాలు అంటే సాధారణంగా అనేక సందేహాలు వస్తాయి. అంతా బాగున్న వారు చావు ఆలోచనలు చేయరు, జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి మాత్రం అదే పెద్ద పరిష్కారంగా కనిపిస్తుంది. అయితే అందరికీ కారుణ్య మరణాలకు అనుమతి ఉండదు, ఒక రోగి ఈ లోకంలో కేవలం జీవశ్చ్చవంగా ఉంటూ అసలు ఏ మాత్రం కదలిక లేని పరిస్థితులు ఉన్నపుడు ఈ అవకాశం తీసుకోవచ్చు. కారుణ్య మరణం అంటే తీవ్రమైన వ్యాధితో పాటు కోలుకోలేని అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి డాక్టర్ల సమక్షంలో కోరిక మేరకు గానీ లేదా రోగి తరఫున కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు గానీ నొప్పి లేకుండా మరణాన్ని ప్రసాదించడంగా పేర్కొంటారు.
ఎనిమిదేళ్ళ క్రితమే :
ఇదిలా ఉంటే భారతదేశంలో 2018 మార్చి నుండి కారుణ్య మరణం కొన్ని కఠినమైన మార్గదర్శకాలకు లోబడి చట్టబద్ధత కల్పించారు. ప్రపంచంలోని చాలా దేశాలలో ఇది చట్టవిరుద్ధంగా ఇప్పటికీ ఇది కొనసాగుతూ వస్తోంది. ఇక కారుణ్య మరణంలో రెండు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి క్రియాశీలక కారుణ్య మరణం అంటే మందులు ఇంజెక్ట్ చేసి ప్రాణాలు తీయడం అన్న మాట. ఇక రెండవది నిష్క్రియాత్మక కారుణ్య మరణంగా వైద్య నిపుణులు చెబుతారు. అంటే ప్రాణాధార వైద్యం లేదా వెంటిలేటర్‌ను తొలగించడం అన్న మాట. ఇక భారతదేశంలో నిష్క్రియాత్మక కారుణ్య మరణానికి మాత్రమే చట్టపరమైన అనుమతి ఉంది. ఇక దీనిని కూడా నిబంధనలు ఉన్నాయి. రోగి జీవితానికి సంబంధించిన లైఫ్ సపోర్ట్ ను తొలగించాలని బంధువులు వైద్యులు నిర్ణయించినప్పటికీ దానికి ఇద్దరు సాక్షులతో పాటు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆమోదం ఉండాలి. అలాగే ఆసుపత్రి ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది.