లాస్ ఏంజిల్స్ ప్రవాస భారతీయుడికి ఇండియన్ పోలీస్ ఆఫీసర్ బెదిరింపులు.. రూ.3.4 కోట్లు డిమాండ్

అమెరికాలో నివసిస్తున్న ఒక భారతీయ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని.. భారతదేశానికి చెందిన ఒక ఉన్నత పోలీసు అధికారి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసిన ఉదంతం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

Update: 2026-07-08 13:02 GMT

అమెరికాలో నివసిస్తున్న ఒక భారతీయ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని.. భారతదేశానికి చెందిన ఒక ఉన్నత పోలీసు అధికారి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసిన ఉదంతం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. లాస్ ఏంజిల్స్‌లో స్థిరపడిన సదరు కుటుంబం నుంచి ఏకంగా 4 లక్షల అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 3.4 కోట్లు) వసూలు చేసేందుకు సదరు అధికారి బెదిరింపులకు పాల్పడినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయుల రక్షణ, అంతర్జాతీయ నేరాల దర్యాప్తు కోణంలో ఈ ఘటన ఇప్పుడు ఇరు దేశాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

తప్పుడు కేసుల పేరిట బ్లాక్‌మెయిల్

అమెరికా చట్ట అమలు సంస్థలు సేకరించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. బాధితులు డిమాండ్ చేసిన భారీ మొత్తాన్ని చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ అధికారి హెచ్చరించినట్లు తెలుస్తోంది. సదరు కుటుంబ సభ్యులపై భారతదేశంలో తప్పుడు హత్య కేసులు నమోదు చేస్తానని సదరు అధికారి బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న వారి ఆస్తులను జప్తు చేయిస్తామని.. తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తామని భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. ఈ ఆకస్మిక బెదిరింపులతో తీవ్ర ఆందోళనకు గురైన సదరు కుటుంబం, వేధింపులు తట్టుకోలేక చివరకు అమెరికా రక్షణ, దర్యాప్తు సంస్థలను ఆశ్రయించింది. దీంతో ఈ అంతర్జాతీయ దోపిడీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అమెరికాకు అప్పగించేందుకు చర్యలు తీవ్రం

ఈ కేసును అమెరికా అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా.. తీవ్రంగా పరిగణిస్తున్నారు. సాంకేతిక ఆధారాలు, డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ , బాధితుల స్టేట్‌మెంట్ల ఆధారంగా సదరు పోలీసు అధికారిపై పక్కా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. విదేశీ గడ్డపై ఉన్న పౌరులను డిజిటల్ మాధ్యమాల ద్వారా బెదిరించి డబ్బు వసూలు చేయడం అంతర్జాతీయ సైబర్ , వ్యవస్థీకృత నేరం కిందకు వస్తుందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సదరు భారత పోలీసు అధికారిని విచారణ నిమిత్తం అమెరికాకు రప్పించేందుకు అక్కడి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అధికారికంగా నేరగాళ్ల అప్పగింత ప్రక్రియను ప్రారంభించేందుకు అమెరికా న్యాయ శాఖ సన్నహాలు చేస్తోంది. ఇందుకోసం అవసరమైన దౌత్యపరమైన దస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇరు దేశాల దౌత్య సంబంధాలపై ప్రభావం?

ఈ తీవ్రమైన ఆరోపణలపై భారత ప్రభుత్వం గానీ, లేదా సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి తరఫు న్యాయవాదులు గానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. భారత్, అమెరికా దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక నేర పరిశోధన ఒప్పందాలు, నేరగాళ్ల అప్పగింత నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు ఉండనున్నాయి. ఒకవేళ అమెరికా అధికారికంగా అప్పగింత కోరితే, భారత ప్రభుత్వం అంతర్గతంగా విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ చట్టాన్ని రక్షించాల్సిన ఒక పోలీసు అధికారి ఇలా అంతర్జాతీయంగా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News