'గ్రీన్ కార్డ్' వచ్చినా వదలని ట్రంప్ తాత.. పౌరసత్వం కావాలంటే జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే..
"అమెరికా వెళ్ళాలి.. డాలర్లు సంపాదించాలి.. గ్రీన్ కార్డ్ సాధించి లైఫ్ సెటిల్ చేసుకోవాలి" దశాబ్దాలుగా సగటు భారతీయుడి.. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల యువత డ్రీమ్ ఇది.
"అమెరికా వెళ్ళాలి.. డాలర్లు సంపాదించాలి.. గ్రీన్ కార్డ్ సాధించి లైఫ్ సెటిల్ చేసుకోవాలి" దశాబ్దాలుగా సగటు భారతీయుడి.. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల యువత డ్రీమ్ ఇది. అయితే ఎన్నో ఏళ్ల నిరీక్షణ.. మరెన్నో తిప్పల తర్వాత ఎట్టకేలకు ‘గ్రీన్ కార్డ్’ చేతికి వచ్చిందని సంబరపడే లోపే.. ట్రంప్ తాత భారతీయుల నెత్తిన మరో భారీ పిడుగు వేశారు. "గ్రీన్ కార్డ్ వచ్చింది కదా అని రిలాక్స్ అయిపోతే ఎలా? అసలు సినిమా ముందుంది" అంటూ అమెరికా పౌరసత్వం ఫీజులను ఏకంగా 75 శాతం పెంచేసేందుకు సరికొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నిర్ణయం ముఖ్యంగా భారతీయ వలసదారుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.
ప్రస్తుతం అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారికి 760 డాలర్లు (సుమారు రూ.65,360) ఫీజుగా ఉంది. తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే ఈ మొత్తం 1,330 డాలర్లకు (దాదాపు రూ.1,14,380) పెరగనుంది. అంటే ఒక్కసారిగా 570 డాలర్లు, దాదాపు 75 శాతం మేర ఫీజు పెరుగుతుంది. అమెరికా ప్రభుత్వం పెరిగిన పరిపాలనా ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పరిపాలనా ఖర్చులంట.. నమ్మేలా ఉందా?
ఈ భారీ పెంపునకు అమెరికా ప్రభుత్వం చెబుతున్న సాకు ఏంటో తెలుసా? "పరిపాలనా ఖర్చులు పెరిగిపోయాయి!" అవును మరి.. దరఖాస్తు ఫారాలు ప్రింట్ చేయడానికి వాడే పేపర్ రేట్లు పెరిగాయో.. లేక సంతకాలు పెట్టే పెన్నుల ధరలు ఆకాశాన్ని తాకాయో కానీ.. ఒక్కసారిగా 75 శాతం పెంచేయడం వెనుక ఉన్న ‘అసలు మైండ్ గేమ్’ వలసదారులకు బాగానే అర్థమవుతోంది. విదేశీయులను, ముఖ్యంగా ఐటీ రంగాన్ని ఏలుతున్న భారతీయులను టార్గెట్ చేయడానికే ట్రంప్ సర్కార్ ఈ ఎత్తుగడ వేసిందని ఇమిగ్రేషన్ నిపుణులు సెటైర్లు వేస్తున్నారు.
ఒక్క ఛాన్స్ మిస్సైతే.. డబుల్ ధమాకా భారం!
ఇక దరఖాస్తు చేసుకున్న లక్కీ డ్రాలో ఎవరిదైనా అప్లికేషన్ రిజెక్ట్ అయిందనుకోండి.. దానికి అప్పీల్ చేసుకోవాలంటే ఒకప్పుడు $830 కడితే సరిపోయేది. కానీ కొత్త రూల్ ప్రకారం $1,475 సమర్పించుకోవాలి. అంటే "మరోసారి ట్రై చేస్తావా బాబూ.. అయితే ముందు నీ జేబు ఖాళీ చెయ్" అని పరోక్షంగా హెచ్చరిస్తున్నారన్నమాట!
ఇంకా టైమ్ ఉందండోయ్.. కానీ
ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన కేవలం 'ప్రజాభిప్రాయ సేకరణ' దశలోనే ఉంది. "మేము ఫీజులు పెంచుతున్నాం.. మీకేమన్నా అభ్యంతరాలు ఉన్నాయా?" అని అడుగుతున్నారు. అయితే వలసదారులు ఎంత మొత్తుకున్నా ట్రంప్ తాత అనుకున్నది చేయకుండా వదిలిపెట్టరనేది జగమెరిగిన సత్యం.
ఈ ప్రతిపాదనపై చర్చ ముగిసి.. తుది నిర్ణయం రావడానికి కనీసం 60 రోజుల సమయం పడుతుంది. కాబట్టి.. అమెరికా పౌరసత్వానికి అర్హత ఉండి ఇంకా అప్లై చేసుకోకుండా బద్ధకిస్తున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఎవరైనా ఉంటే.. వెంటనే ముహూర్తం చూసుకుని పాత ధరలకే అప్లికేషన్ పంపించేయడం ఉత్తమం. లేదంటే పెరిగిన ఫీజుల పుణ్యమా అని వచ్చే ఏడాది ఇండియా ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది.