ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కు అమెరికా షాక్.. అమెరికా వీడితే ఖతమే..

గతంలో అమెరికా వీసా పాలసీ ఎంత ముచ్చటగా ఉండేదంటే... 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ (D/S)' పేరుతో ఒక లగ్జరీ ఆఫర్ ఉండేది.

Update: 2026-07-17 04:37 GMT

అగ్రరాజ్యం అమెరికా వెళ్లడం.. డాలర్లు సంపాదించడం.. అక్కడ పచ్చటి ల్యాండ్‌స్కేప్‌ల మధ్య సెటిల్ అయిపోవడం... ఇదీ మన దేశీ విద్యార్థుల 'లైఫ్ లాంగ్ డ్రీమ్'. కానీ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఈ 'అమెరికన్ డ్రీమ్' సాఫ్ట్‌వేర్‌కు సరికొత్త అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్ అన్‌లిమిటెడ్ ప్లాన్‌లా ఉన్న ఎఫ్-1 (స్టూడెంట్), జే-1 (ఎక్స్‌ఛేంజ్ విజిటర్) వీసాలను కాస్తా బడ్జెట్ ఫోన్ రీఛార్జ్ ప్లాన్ల లాగా '4 ఏళ్ల వ్యాలిడిటీ' కి కుదించేలా సరికొత్త స్కెచ్ వేసింది. అవును మీరు విన్నది నిజమే! ఇకపై అమెరికాలో చదువుకోవాలంటే 'టైమ్ లిమిట్' ఉంది బాసూ!

ఆ 'డ్యూరేషన్ ఆఫ్ స్టే' లగ్జరీ ఇక లేదు!

గతంలో అమెరికా వీసా పాలసీ ఎంత ముచ్చటగా ఉండేదంటే... 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ (D/S)' పేరుతో ఒక లగ్జరీ ఆఫర్ ఉండేది. అంటే "నువ్వు చదువుకో నాయనా.. నీ చదువు, నీ రీసెర్చ్, నీ ప్రాజెక్టులు పూర్తయ్యే దాకా ఎంత కాలమైనా ఇక్కడే ఉండు" అని ప్రేమగా చూసుకునేవారు. కానీ ఇప్పుడు అమెరికాకు జ్ఞానోదయం అయినట్టుంది. "ఫ్రీగా ఇన్ని రోజులు ఉంటే వాల్యూ ఉండదు బాబూ నాలుగేళ్లు కాగానే ప్యాకప్ చెప్పాల్సిందే" అని సరికొత్త రూల్ తెస్తోంది. ఒకవేళ నాలుగేళ్ల తర్వాత కూడా మీరు అక్కడే ఉండి రీసెర్చో, పీహెచ్‌డీనో చేస్తామంటే కుదరదు. మళ్లీ లైన్ లో నిలబడాలి. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తలుపు తట్టాలి. జేబు ఖాళీ చేసుకుని అప్లికేషన్ ఫీజులు కట్టాలి. మళ్లీ చేతి వేలిముద్రలు ఇచ్చి "నేను మంచివాడినే సార్" అని నిరూపించుకోవాలి.

"అమెరికా వదిలి రావద్దు" - లాయర్ల 'ఉచిత' సలహా

మరోవైపు అమెరికా ఇమిగ్రేషన్ న్యాయ నిపుణులు మన విద్యార్థులకు ఇస్తున్న సలహాలు చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు. "బాబోయ్.. ఎఫ్-1 వీసా స్టూడెంట్లు ఎవరూ ఇప్పట్లో అమెరికా వదిలి బయటకు వెళ్లొద్దు!" అంటే పొరపాటున ఇండియాకు వచ్చి అమ్మ చేతి బిర్యానీ తిని వెళ్దామనుకుంటే.. మళ్లీ అమెరికా ఎయిర్‌పోర్టులో దిగేసరికి కొత్త రూల్స్ తో స్వాగతం పలుకుతారట. "వచ్చావు బాగానే ఉంది.. కానీ లోపలికి వెళ్లాలంటే నీ ఫైల్ మొత్తం మళ్లీ వెతకాలి.. కాసేపు పక్కన కూర్చో" అంటూ ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. దీంతో మన విద్యార్థులు 'ల్యాండ్ ఆఫ్ ది ఫ్రీ'లో ఫ్రీగా తిరగలేక ఇల్లు వదిలి బయటకు రాలేక గృహనిర్బంధంలో ఉన్నట్టు ఫీలవుతున్నారు.

మనోళ్లకు పెద్ద తలనొప్పే..

ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది గట్టి షాకే. ఎందుకంటే అమెరికా వెళ్లే ప్రతీ పది మంది అంతర్జాతీయ విద్యార్థులలో మనోళ్లు కచ్చితంగా ఉంటారు. ఎంఎస్ పూర్తి చేసి, ఇంకేదైనా కోర్సు చేద్దామనుకునే లోపే నాలుగేళ్లు అయిపోతాయి. ప్రతిసారీ వీసా పొడిగింపు కోసం ఫీజులు కట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. యూఎస్.సీఐఎస్ వారు మన అప్లికేషన్‌ను ఎప్పుడు ఓకే చేస్తారో.. ఎప్పుడు రిజెక్ట్ చేస్తారో తెలియని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా రోజూ చూడాలి.

చివరగా చెప్పేదేంటంటే.. ఇకపై అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు లగేజీ సర్దుకునేటప్పుడు బట్టలతో పాటు ఒక పెద్ద 'కౌంట్‌డౌన్ క్లాక్' కూడా కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే అక్కడ దిగగానే టిక్.. టిక్.. టిక్.. అంటూ నాలుగేళ్ల సమయం కరిగిపోతుంటుంది కదా.. ఈ లోగా అమెరికా ప్రభుత్వం దీనిపై అధికారికంగా జీవో జారీ చేసి, ఫైనల్ గైడ్‌లైన్స్ ఇచ్చే వరకు... మన విద్యార్థులు గాల్లో దీపం పెట్టి "దేవుడా.. మా వీసాలను కాపాడు" అని ప్రార్థించడమే ఏకైక మార్గం.

Tags:    

Similar News