అమెరికా ఎయిర్ పోర్టులో ఫోన్ చెక్ చేస్తే ఫ్లైట్ వెనక్కి.. చదువుకోడానికి పోతే చాపచుట్టేశారు!

అమెరికా కలలు కనడం సులభమే.. కానీ ఆ కలలు నెరవేర్చుకోవడానికి బోర్డర్ ప్రొటెక్షన్ అధికారుల మూడ్ బాగుండాలి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కథనం భారతీయ ఎఫ్-1 విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

Update: 2026-07-31 13:57 GMT

అమెరికా కలలు కనడం సులభమే.. కానీ ఆ కలలు నెరవేర్చుకోవడానికి బోర్డర్ ప్రొటెక్షన్ అధికారుల మూడ్ బాగుండాలి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కథనం భారతీయ ఎఫ్-1 విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కష్టపడి వీసా తెచ్చుకుని డాలర్ల పంట పండించవచ్చని ఆశపడ్డ ఒకానొక విద్యార్థికి 'సెకండరీ చెకింగ్' పేరిట అమెరికా ఎయిర్‌పోర్టులోనే ఘనంగా సన్మానం చేసి తిరుగు ప్రయాణం కట్టించారట!

'గూగుల్ మ్యాప్స్' కొంప ముంచిందా?

కథనం ప్రకారం... ఆ విద్యార్థి మహాశయుడు వెబ్‌స్టర్ యూనివర్సిటీలో చదువుకుంటూ డిసెంబర్‌లో డిగ్రీ చేతికొస్తుందని మురిసిపోయాడట. సరే సొంత ఊరికెళ్లి అత్తెసరు బిర్యానీలు తిని ప్రశాంతంగా సెయింట్ లూయిస్ ఎయిర్‌పోర్టులో కాలుపెట్టాడు. మొదటి ఇమ్మిగ్రేషన్ వరకు అంతా స్మూత్‌గానే సాగింది. కానీ అక్కడ కాపుకాసిన సీబీపీ అధికారులకు ఏమనుమానం వచ్చిందో ఏమో... అతగాడిని పక్కకు తీసుకెళ్లి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లపై పడ్డారు.

సదరు అధికారులకు విద్యార్థి చదువుపై ఉన్న శ్రద్ధ కంటే అతడి 'గూగుల్ లొకేషన్ హిస్టరీ', 'చాటింగ్ హిస్టరీ' లపైనే ఎక్కువ ఆసక్తి కలిగింది. "నాయనా నువ్వు క్యాంపస్ బయట ఏమైనా గ్యాస్ స్టేషన్లలోనో, రెస్టారెంట్లలోనో పార్ట్‌టైమ్ అవతారం ఎత్తావా?" అని ఆరా తీశారట. అడిగిందే తడవుగా అధికారికంగా డిపోర్ట్ చేసి రికార్డు పాడుచేసుకోవడం కంటే... నైతికంగా స్వచ్ఛందంగా ఇండియాకు తిరిగి వెళ్లిపోవడం మేలని హితవు పలికారు. అంతే ఒక రోజు ఆపి, విద్యార్థి సొంత డబ్బులతోనే రిటర్న్ టికెట్ కొట్టించి విమానం ఎక్కించేశారని టాక్..

ఎఫ్-1 వీసా ఉంటే సరిపోదు బ్రదర్

ఎఫ్-1 వీసా ఉంటే మీ పాస్‌పోర్టుపై ముద్ర పడినట్లే కానీ అమెరికా నేలపై అడుగుపెట్టే హక్కు ప్రాప్టించినట్లు కాదు.. పాస్‌పోర్ట్‌లో వీసా స్టాంప్ ఉంటే సరిపోదు, ఎయిర్‌పోర్టులోని అధికారికి నచ్చితేనే ఎంట్రీ. ఎఫ్-1 వీసా నియమాల ప్రకారం క్యాంపస్ బయట వర్క్ చేయడం తీవ్రమైన నేరం. “మేము చదువుకోవడానికే వచ్చాం” అని చెప్పి క్యాంపస్ బయట నల్లధనం సంపాదనలో దొరికిపోతే కథ ఇలాగే అడ్డం తిరుగుతుంది.

ఈ సోషల్ మీడియా వైరల్ పోస్టు ఎంతవరకు నిజమో పక్కన పెడితే... నిబంధనలు అతిక్రమించి ఫోన్లలో అన్ని ఆధారాలు దాచుకుని తిరిగే 'అతి తెలివి' విద్యార్థులకు ఇది గట్టి హెచ్చరికే.. కాబట్టి అమెరికా వెళ్లే ముందు వీసా రూల్స్ చదువుకోవడం ఎంత ముఖ్యమో... ఫోన్ లోకేషన్లు, పర్సనల్ చాట్‌లు క్లీన్‌గా ఉంచుకోవడం అంతకంటే ముఖ్యం సుమీ..

Tags:    

Similar News