అమెరికాలో భారత సంతతి మహిళ సంచలనం.. మేయర్ రేసులో నిత్యా రామన్!
అమెరికా రాజకీయాల్లో భారత సంతతికి చెందిన నిత్యా రామన్ పేరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అమెరికా రాజకీయాల్లో భారత సంతతికి చెందిన నిత్యా రామన్ పేరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లాస్ ఏంజెల్స్ మేయర్ ఎన్నికల్లో ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌తో ఆమె పోటీ పడుతున్నారు. నవంబర్ 3న జరగనున్న ఈ ఎన్నికల్లో నిత్యా రామన్ ఎలాంటి ఫలితాన్ని సాధిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
కేరళ నుంచి అమెరికా రాజకీయాల వరకు..
నిత్యా రామన్ కేరళలో తమిళ కుటుంబంలో జన్మించారు. ఆమెకు ఆరేళ్ల వయసున్నప్పుడు కుటుంబం అమెరికాకు వెళ్లింది. హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీలో చదువుకున్న ఆమె.. కొంతకాలం భారతదేశంలో పట్టణ సమస్యలపై పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2020లో లాస్ ఏంజెల్స్ సిటీ కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికై గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రజా సమస్యలే ప్రధాన అజెండా!
నిత్యా రామన్ ప్రచారంలో ఇళ్ల అద్దెలు తగ్గించడం, సామాన్యులకు అందుబాటులో ఉండే గృహాలు కల్పించడం, నిరాశ్రయుల సమస్యను పరిష్కరించడం ప్రధాన అంశాలుగా ఉన్నాయి. నగరంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపైనా ఆమె దృష్టి పెట్టారు.
గతంలో కరెన్ బాస్‌కు మద్దతుగా ఉన్న నిత్యా రామన్.. చివరి నిమిషంలో మేయర్ ఎన్నికల బరిలోకి దిగడం రాజకీయంగా ఆసక్తిని పెంచింది. తాజా సర్వేల్లో ఇద్దరికీ సమాన మద్దతు లభించినట్లు సమాచారం. దీంతో ఓటర్ల నిర్ణయం కీలకంగా మారింది.
మమ్దానీతో పోలికలు!
న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తరహాలో నిత్యా రామన్ కూడా డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికాతో అనుబంధం కలిగి ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే గృహాలు, అద్దెదారుల హక్కులు వంటి అంశాలపై ఇద్దరూ దృష్టి సారిస్తున్నారు.
నిత్యా రామన్ గెలిస్తే లాస్ ఏంజెల్స్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి దక్షిణాసియా సంతతి మహిళగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. చివరకు ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.