తెలంగాణ రాజకీయాల్లో 'దేవాదాయ' కాక.. సీఎం వద్దకు చేరిన సురేఖ-కడియం వివాదం

దేవాదాయ, అటవీ శాఖల మంత్రిగా ఉన్న కొండా సురేఖ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఒక అధికారిక లేఖ రాశారు.

Update: 2026-07-08 10:54 GMT

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. మంత్రి కొండా సురేఖ, స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. తన శాఖ వ్యవహారాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ సీఎంకు ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ముఖ్యమంత్రికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

దేవాదాయ, అటవీ శాఖల మంత్రిగా ఉన్న కొండా సురేఖ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఒక అధికారిక లేఖ రాశారు. స్టేషన్‌ ఘన్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనకు కనీస సమాచారం ఇవ్వకుండా తన ప్రమేయం లేకుండా దేవాదాయ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారని ఆరోపించారు. "ప్రభుత్వ పరిపాలనా నిబంధనలైన 'రూల్స్ ఆఫ్ బిజినెస్' ప్రకారం ఒక శాఖపై సమీక్ష నిర్వహించే అధికారం సంబంధిత మంత్రికి లేదా ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. కానీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి అధికారులతో భేటీ అయ్యారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి" అని మంత్రి కొండా సురేఖ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

"నేనేం తప్పు చేయలేదు" కౌంటర్ ఇచ్చిన కడియం శ్రీహరి..

మంత్రి కొండా సురేఖ చేసిన ఫిర్యాదుపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటుగానే స్పందించారు. ఈ వివాదంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తాను ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని, ఒక ప్రజాప్రతినిధిగా తన పరిధిలోనే పనిచేశానని స్పష్టం చేశారు.

కడియం శ్రీహరి మాట్లాడిన ముఖ్యమైన అంశాలు..

సమీక్ష నిర్వహించలేదని.. దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించే హక్కు తనకు లేదనే విషయం ఒక సీనియర్ నాయకుడిగా తనకూ తెలుసని, తాను అధికారులను పిలిపించి సమీక్ష పెట్టలేదని చెప్పారు. తన నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం తాను స్వయంగా దేవాదాయ శాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చానని వివరించారు. "నా వద్దకు అధికారులను పిలిపించి భేటీ పెడితే దాన్ని సమీక్ష అంటారు. కానీ నేను కమిషనర్ ఆఫీస్‌కు వెళ్లి కలిశాను. ప్రజా సమస్యల కోసం అధికారులను కలవడం సహజం. నేను ఎలాంటి తప్పూ చేయలేదు కాబట్టి ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు" అని తేల్చి చెప్పారు.

"కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు" అంటూ పరోక్ష చరకలు

ఈ వివాదంలో ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించకుండానే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు రాజకీయాల్లో "కొత్త అలవాట్లు" నేర్చుకుంటున్నారని.. అనవసర వివాదాలు సృష్టిస్తూ ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా మంత్రి కొండా సురేఖను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అవసరమైతే ఈ పూర్తి వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వాస్తవాలను వివరిస్తానని ఆయన పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు?

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు కీలక నేతల మధ్య రేగిన ఈ వివాదం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సరికొత్త చర్చకు దారితీసింది. మంత్రి సురేఖ ఫిర్యాదు, దానికి కడియం శ్రీహరి ఇచ్చిన కౌంటర్‌తో ఈ వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది. పార్టీలో, ప్రభుత్వంలో ఇమేజ్‌ దెబ్బతినకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇరు నేతలను ఎలా సమన్వయపరుస్తారు అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News