మళ్లీ అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు : పెరిగిన చమురు ధరలు.. భారత్‌కు కొత్త ఆందోళన

అంతర్జాతీయ మార్కెట్‌లో తాజా ట్రేడింగ్‌లో క్రూడాయిల్ ధరలు ఏకంగా 5 శాతానికి పైగా ఎగబాకాయి.

Update: 2026-07-08 11:13 GMT

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య తలెత్తిన తాజా ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లను ఒక్కసారిగా కుదిపేశాయి. ఇరాన్‌తో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడంతో గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా రెక్కలు తొడిగాయి. ఈ పరిణామం ఇంధన అవసరాల కోసం దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడే భారత్ లాంటి దేశాలకు కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది.

భగ్గుమంటున్న చమురు ధరలు.. పతనమైన రూపాయి

అంతర్జాతీయ మార్కెట్‌లో తాజా ట్రేడింగ్‌లో క్రూడాయిల్ ధరలు ఏకంగా 5 శాతానికి పైగా ఎగబాకాయి. ప్రస్తుతం వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్ ధర సుమారు 74 డాలర్లకు చేరగా, బ్రెంట్ క్రూడ్ ధర 78.57 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ చమురు సంక్షోభం భారత కరెన్సీపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సుమారు 0.40 శాతం నష్టపోయి, సరికొత్త జీవితకాల కనిష్ట స్థాయి 95.67 వద్దకు పడిపోవడం దేశీయ మార్కెట్లను కలవరపెడుతోంది.

అమెరికా మెరుపు దాడులు.. హోర్ముజ్ జలసంధిలో హై అలర్ట్

అమెరికా వర్గాల సమాచారం ప్రకారం.. జూలై 7న అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్‌లోని పలు వ్యూహాత్మక లక్ష్యాలపై భారీ ఎత్తున దాడులు నిర్వహించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి' మీదుగా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగానే తాము ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా ప్రకటించింది. ఈ వైమానిక దాడుల్లో ఇరాన్‌కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు.. తీర ప్రాంత రాడార్ వ్యవస్థలు, యాంటీ-షిప్ క్షిపణి కేంద్రాలు.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు చెందిన చిన్న తరహా పడవలను అమెరికా సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది.

గత నెలలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గినట్లు కనిపించినా తాజా దాడులతో ఆ శాంతి తాత్కాలికమేనని తేలిపోయింది. ప్రపంచ చమురు రవాణాలో సింహభాగం సాగే హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత ముదిరితే, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్‌కు పొంచి ఉన్న ముప్పులేమిటి?

తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 80-85 శాతం వరకు దిగుమతుల ద్వారానే భారత్ తీర్చుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజా సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థపై బహుముఖ ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా వ్యయం భారమై, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఒకవైపు చమురు ధరలు పెరగడం, మరోవైపు రూపాయి బలహీనపడటంతో విదేశాల నుంచి చేసుకునే దిగుమతులు భారత్‌కు అత్యంత ఖరీదైనవిగా మారనున్నాయి.

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ భౌగోళిక రాజకీయ పరిస్థితులు రానున్న రోజుల్లో ఏ మలుపు తిరుగుతాయోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ సంక్షోభం గనుక మరింత ముదిరితే అది భారత్ సహా పలు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక ప్రగతికి పెద్ద బ్రేక్ వేసే ప్రమాదం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News