ఈ 40 పెట్రోల్.. రైతులను రెడీ చేస్తున్న చంద్రబాబు

ఈ బ్లెండింగ్ విధానం అమల్లోకి వస్తే, మార్కెట్‌లో ఈ పంటలకు అపరిమితమైన డిమాండ్ ఏర్పడుతుందని సీఎం భావిస్తున్నారు.

Update: 2026-07-08 10:24 GMT

రేపటి అభివృద్ధిని, రాబోయే అవకాశాలను ముందుగానే పసిగట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. గతంలో కంప్యూటర్లు, ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే, ఏపీని ఐటీ హబ్‌గా మార్చి యువతకు ఉపాధి అవకాశాలు చూపిన దూరదృష్టి ఆయనది. అదే స్ఫూర్తితో నేడు క్వాంటం కంప్యూటింగ్, డీప్ టెక్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై దృష్టి సారిస్తూనే, రాష్ట్ర ఆర్థిక వెన్నెముక అయిన రైతులకు కొత్త బాటలు చూపిస్తున్నారు. భవిష్యత్తులో ఇథనాల్‌కు డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో, రైతులను కేవలం పంటలు పండించే వారిగానే కాకుండా, ఇథనాల్ ఉత్పత్తిదారులైన పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

'E 40' దిశగా ముందస్తు సన్నాహాలు

భారత ఇంధన రంగంలో ఇథనాల్ బ్లెండింగ్ కీలకం కానుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఇథనాల్ ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిపేందుకు అడుగులు వేస్తున్నారు. పెట్రోల్‌లో 40 శాతం ఇథనాల్ బ్లెండింగ్ (E 40) ప్రక్రియకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ఆకర్షణపై ఆయన దృష్టి సారించారు.

రైతే రాజు.. ఇక పారిశ్రామికవేత్త!

ఇథనాల్ తయారీకి మొక్కజొన్న, చెరకు వంటి పంటలు ప్రధాన ముడిసరుకులు. ఈ బ్లెండింగ్ విధానం అమల్లోకి వస్తే, మార్కెట్‌లో ఈ పంటలకు అపరిమితమైన డిమాండ్ ఏర్పడుతుందని సీఎం భావిస్తున్నారు. దీంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరేలా ఈ పంటల సాగును ప్రోత్సహించేందుకు సీఎం ప్రణాళిక రెడీ చేయమని ఆదేశించారు. సంప్రదాయ పంటల కంటే ఇథనాల్ తయారీకి ఉపయోగపడే పంటలు రైతులకు అధిక గిట్టుబాటు ధరను అందిస్తాయని సీఎం భావిస్తున్నారు. అంతేకాకుండా రైతులు కేవలం ముడిసరుకు అమ్మేవారిగానే కాకుండా, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వ పాలసీ - సర్క్యులర్ ఎకానమీ

సచివాలయంలో జరిగిన 19వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇథనాల్‌తో పాటు మీథేన్, ఏవియేషన్ ఫ్యూయల్ ఉత్పత్తిపై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించే 'సర్క్యులర్ ఎకానమీ'లో భాగంగా, వ్యవసాయ ఉత్పత్తులను ఇంధనంగా మార్చడం ద్వారా పర్యావరణహితమైన, స్వయం సమృద్ధి కలిగిన ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.

Tags:    

Similar News