వైఎస్సార్ కి కేంద్ర మంత్రి ఛాన్స్ ఎలా మిస్ అయింది ?
తొలి విడతలోనే మంత్రి పదవిని చేపట్టిన వైఎస్సార్ 1983లో టీడీపీ ఏపీలో గెలిచిన తరువాత పీసీసీ చీఫ్ గా ఉమ్మడి ఏపీకి పనిచేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని రాజకీయ నేతగా నిలిచి గెలిచిన వారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన రాజకీయ రంగ ప్రవేశం నుంచి ఆయన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు చూస్తే ఎన్నో ఆసక్తికరమైనవి ఉంటాయి. వైఎస్సార్ 1978లో తొలిసారిగా తన 29వ ఏట పులివెందుల నుంచి రెడ్డి కాంగ్రెస్ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా అయ్యారు. ఇక ఆ తరువాత ఆ పార్టీ ఇందిరా కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆ పార్టీ నుంచి యువ నేతగా వైఎస్సార్ రాజకీయం సాగుతూ వచ్చింది. తొలి విడతలోనే మంత్రి పదవిని చేపట్టిన వైఎస్సార్ 1983లో టీడీపీ ఏపీలో గెలిచిన తరువాత పీసీసీ చీఫ్ గా ఉమ్మడి ఏపీకి పనిచేశారు. అప్పటికి ఆయన వయసు 35 ఏళ్ళు మాత్రమే. అంత చిన్న వయసులో కీలకమైన నాయకత్వ బాధ్యతలు ఆయన చేపట్టడం ఆనాటి రోజులల్లో ఎంతో విశేషంగా చెప్పుకున్నారు.
ఎన్టీఆర్ తోనే నేరుగా :
ఇక వైఎస్సార్ అప్పటి ముఖ్యమంత్రి ప్రజలలో అశేషమైన అభిమానం కలిగిన వైఎస్సార్ తో అసెంబ్లీలో లోపలా బయట కాంగ్రెస్ అధ్యక్షుడిగా గట్టిగా ఢీ కొట్టారు. ఆయన అనేక ప్రజా సమస్యల మీద నాటి టీడీపీ ప్రభుత్వంతో నిలదీసి మరీ తలపడ్డారు. ఇక వైఎస్సార్ తరువాత జలగం వెంగళరావు పీసీసీ చీఫ్ అయ్యారు, 1989 ఎన్నికల ముందు మర్రి చెన్నారెడ్డికి ఈ కీలక బాధ్యతలను నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రధాని అయిన రాజీవ్ గాంధీ అప్పగించారు. అంతే కాదు 1989లో కాంగ్రెస్ కచ్చితంగా ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వస్తుందన్న సమయంలో వైఎస్సార్ ని కడప నుంచి ఎంపీగా పోటీ చేయమని కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశించింది. అప్పటికి మూడు సార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పదకొండేళ్ళ పాటు పనిచేసి మంత్రిగా పీసీసీ చీఫ్ గా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన వైఎస్సార్ కి రాష్ట్ర రాజకీయం దూరం అయింది.
ఎంపీగా నాలుగు సార్లు గెలిచినా :
ఇదిలా ఉంటే ఎంపీగా వైఎస్సార్ నాలుగు సార్లు కడప నుంచి గెలిచారు. 1989, 1991, 1996, 1998లలో ఆయన గెలిచి పదేళ్ళ పాటు పార్లమెంట్ లో ఉన్నారు. ఈ సమయంలో 1991 నుంచి 1996 వరకూ పీవీ నరసింహారావు ప్రధాని గా కాంగ్రెస్ ప్రభుత్వం అయిదేళ్ళు పాలించింది. ఆ తరువాత 1996 నుంచి 1998 వరకూ రెండేళ్ళ పాటు యునైటెడ్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలో ఉంది. అందులో కాంగ్రెస్ కీలక మద్దతు పార్టీగా ఉంది. అయితే ఇన్నేళ్ళ కాలంలో వైఎస్సార్ కి ఎక్కడా కేంద్ర మంత్రి అయ్యే చాన్స్ మాత్రం దక్కలేదు. దానికి రాజకీయంగానే కాదు ఇతరత్రా కారణాలు ఉన్నాయని చెబుతారు.
కేంద్ర మంత్రి వస్తుందనుకున్న వేళ :
ఇక కేంద్ర రాజకీయాల్లో చూస్తే పీవీ నరసింహారావు మంత్రి వర్గంలో వైఎస్సార్ కి చోటు దక్కలేదు. ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని చెబుతారు. దాంతో వైఎస్సార్ కాకుండా ఎందరో కేంద్ర మంత్రులు అయినా వైఎస్సార్ స్వపక్షంలోనే విపక్షంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో అంటే 1989 నుంచి 1994 మధ్యలో మూడు సార్లు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మారారు, మారిన ప్రతీసారీ వైఎస్సార్ పేరు సీఎం రేసులో గట్టిగా వినిపించేది. కానె వైఎస్సార్ కి జాతీయ రాష్ట్ర స్థాయిలో సొంత పార్టీలో వ్యతిరేకుల లాబీయింగ్ పైచేయి సాధించడం వల్ల దక్కకుండా పోయిందని చెబుతారు. ఇక వైఎస్సార్ దశ ఎలా తిరిగింది అంటే 1998 ప్రాంతంలో సోనియా గాంధీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలిగా కావడంలో మళ్ళీ ఆయన రాజకీయం ఊపందుకుంది అని చెబుతారు.
పీసీసీ చీఫ్ గా రెండోసారి :
ఈ క్రమంలో ఆయన 1999 ఎన్నికల ముందు ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ కి పీసీసీ చీఫ్ గా రెండోసారి నియమితులు అయ్యారు. ఇక 1999లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కాంగ్రెస్ నుంచి ప్రొజెక్ట్ చేయబడ్డారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు అయింది. 2004 నాటికి మాత్రం కాంగ్రెస్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవడంతో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయి తిరుగులేని అధికారాన్ని అందుకున్నారు. 2009లో రెండోసారి కాంగ్రెస్ ని గెలిపించి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యారు. అంతలా సోనియా గాంధీ వైఎస్సార్ ని ప్రోత్సహించారు. ఇక వైఎస్సార్ సైతం గాంధీ ఫ్యామిలీ మీద పూర్తి విశ్వాసాన్ని అభిమానాన్ని చాటుకున్నారు. చిత్రమేంటి అంటే వైఎస్సార్ మరణించాక అదే గాంధీలతో వైఎస్సార్ కుమారుడు జగన్ కి గ్యాప్ రావడం, చివరికి కాంగ్రెస్ నుంచి జగన్ దూరం కావడం సొంత పార్టీ పెట్టుకోవడం జరిగిపోయింది.