బుల్లెట్ ట్రైన్.. అంత వేగంగా సాగుతుందా?
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగానే ఫ్యూచర్ సిటీ సహా బుల్లెట్ ట్రైన్, మెట్రో వ్యవస్థలను కీలకంగా తీసుకుంది. మెట్రో ను సైతం ప్రభుత్వమే కొనుగోలు చేసింది. దీనిని విస్తరించే ప్రతిపాదనను కూడా సర్కారు సిద్ధం చేసింది. ఇక, ఫ్యూచర్ సిటీని 14 వేల ఎకరాలకు పరిమితం చేయాలని అనుకున్నా.. ఇప్పుడు దాదాపు మరో 14 వేల ఎకరాలకు విస్తరించనుంది. మరోవైపు బుల్లెట్ రైల్ కారిడార్ ప్రతిపాదనలు కూడా రెడీ అవుతున్నాయి.
అయితే.. ఇవన్నీ.. చెప్పుకొనేందుకు బాగానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఏమేరకు సాకారం అవుతాయన్నది ప్రశ్నగా మారింది. దీనికి కారణం.. భూముల సమస్యే. అటు ఫ్యూచర్ సిటీ కోసం భూ సేకరణ (2013 నాటి చట్టం) చేపట్టాలని నిర్ణయించారు. కానీ, దీనికి అనుకున్న విధంగా ప్రజల నుంచి రెస్పాన్స్ రాలేదు. పైగా.. రాజకీయ జోక్యం పెరిగిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో భూసేకరణ వ్యవహారం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.
ఇక, బుల్లెట్ ట్రైన్‌కు ఆదిలోనే రెడ్ సిగ్నల్స్ పడుతున్నాయి. బహదూర్‌పురలో భూములు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. పైగా ఈ భూముల్లోనే ఎక్కువగా పంటలు పండుతుండడంతో రైతులకు సెంటిమెంటుగా మారింది. దీంతో వారు సదరు భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఇప్ప టికే చేపట్టిన సర్వేలో 30 శాతం మంది తమ భూములు ఇవ్వబోమని చెబుతున్నారు. ఒకవేళ భూములు కావాలంటే బహిరంగ ధరలకు కొనుగోలు చేయాలని చెబుతున్నారు. ఇది సర్కారుకు మరింత భారంగా మారనుంది.
మెట్రో పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఒకవైపు భూముల సమస్యలతో పాటు.. మెట్రో అలైన్‌మెంటు విషయంలో చోటు చేసుకున్న విమర్శలు రాజకీయంగా ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరోవైపు కేంద్రం నుంచి ఆశించిన మేరకు సహకారం లేదని సీఎం రేవంత్ స్వయంగా చెబుతున్నారు. రుణం విషయంలోనూ సర్కారు స్పందించడం లేదని అంటున్నారు. ఈ పరిణామాలతో ఈ మూడు ప్రాజెక్టులు కూడా ఎక్కడి గొంగళి అక్కడే అన్నచందంగా మారడం గమనార్హం. కానీ, మరో రెండు సంవత్సరాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వీటిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.