మనవడి కోరిక.. పూరీలు తయారు చేసిన రేవంత్..

"తాతా... నువ్వే పూరీలు చెయ్యాలి. నువ్వు చేస్తేనే తింటా!" అంటూ మనవడు ప్రేమగా కమాండ్ చేయడంతో మన ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచించకుండా వంటగదిలోకి ఎంట్రీ ఇచ్చారు.

Update: 2026-07-09 12:42 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి అంటే రోజంతా ఫైళ్లు.. సమీక్షలు.. అధికారులకు క్లాసులు.. రాజకీయ వ్యూహాలు, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు... ఇలా నిమిషం కూడా తీరిక లేని షెడ్యూల్. కానీ ఎంతటి పవర్‌ఫుల్ సీఎం అయినా ఇంట్లోకి అడుగుపెడితే మాత్రం ‘హోదా’ అనే పవర్ బటన్ ఆఫ్ చేయాల్సిందేనని రేవంత్ రెడ్డి నిరూపించారు. సచివాలయంలో ఎంతటి సంచలన నిర్ణయాలైనా తీసుకోగలరు కానీ వంటగదిలో మనవడి ఆర్డర్ ముందు మాత్రం సీఎం కుర్చీ కూడా సైలెంట్ అయిపోవాల్సిందే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఎవరికైనా నవ్వాగదు.

ఆఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాపుల్లా పూరీలు

"తాతా... నువ్వే పూరీలు చెయ్యాలి. నువ్వు చేస్తేనే తింటా!" అంటూ మనవడు ప్రేమగా కమాండ్ చేయడంతో మన ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచించకుండా వంటగదిలోకి ఎంట్రీ ఇచ్చారు. నిత్యం పెన్ను పట్టుకుని జీవోలపై సంతకాలు చేసే చేతులు.. కాస్తా చపాతీ కర్ర, పిండి ముద్ద పట్టుకున్నాయి.

అయితే రాజకీయాల్లో ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉన్నా.. వంటగదిలో పూరీలు గుండ్రంగా చేయడం రేవంత్‌కు అంత ఈజీ కాలేదని అర్థమవుతోంది. ఆయన ఒత్తిన పూరీలు ఒక్కోటి ఒక్కో దేశం మ్యాప్‌లా తయారయ్యాయి. ఒకటి ఆఫ్రికా లా, ఇంకోటి ఆస్ట్రేలియా లా మరొకటి తెలంగాణ కొత్త జిల్లాల మ్యాప్‌లా వింత వింత ఆకారాల్లో వచ్చాయి.

"తాతా.. ఇవేంటి గుండ్రంగా లేవు.. వరల్డ్ మ్యాప్‌లా ఉన్నాయి" అని మనవడు సెటైర్ వేసినా.. సీఎం గారు మాత్రం కేవలం చిరునవ్వుతోనే మేనేజ్ చేశారు. అసలే పొలిటికల్ అపోజిషన్‌కు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చే రేవంత్.. ఇక్కడ మాత్రం మనవడి లాజిక్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యారు.

ఇంట్లో నడుస్తోంది 'మనవడి ప్రభుత్వమే'

కథ అక్కడితో అయిపోలేదు.. "నాకే కాదు.. అమ్మమ్మకు కూడా తాతే పూరీలు వత్తి ఇవ్వాలి" అంటూ మనవడు మరో కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చాడు. దీంతో ఇంట్లో అసలైన 'హైకమాండ్' ఎవరో, ఎవరి ప్రభుత్వం నడుస్తోందో క్లారిటీ వచ్చేసింది. పొలిటికల్ గ్రౌండ్‌లో ప్రతిపక్షాల ప్రశ్నలకు సింగిల్ హ్యాండ్‌తో ఆన్సర్ ఇచ్చే సీఎం.. మనవడి 'ఆర్డర్ల' ముందు మాత్రం సరెండర్ అయిపోయారు. ఆ వింత ఆకారాల పూరీలనే దోరగా నూనెలో వేయించి, మనవడికి తినిపించి ‘బెస్ట్ తాత’ అనిపించుకున్నారు.

అసలైన రిలీఫ్.. ఈ మధుర క్షణాలే!

రాజకీయ ఒత్తిళ్లు, విమర్శలు, నిరంతర ప్రజా జీవితంలో ఉండే నాయకులకు ఇలాంటి కుటుంబ క్షణాలే అసలైన బూస్టర్ డోస్. అధికార హోదా ఎంత పెద్దదైనా ఇంటికి వెళ్లాక తాతగా మారిపోవడంలో ఉండే మజానే వేరు. ప్రస్తుతం నెటిజన్లు రేవంత్ రెడ్డి కొత్త అవతారాన్ని చూసి మురిసిపోతున్నారు. సోషల్ మీడియాలో ఒకటే కామెంట్లు... "రేవంత్ రెడ్డి గారు కేవలం సీఎం మాత్రమే కాదు.. ప్రమోషన్ పొందిన సర్టిఫైడ్ పూరీ మాస్టర్ కూడా" అంటూ చెలరేగిపోతున్నారు. మొత్తానికి మనవడి దెబ్బకు సీఎం హోదా కూడా కాసేపు సెలవు తీసుకుందన్నమాట..

Tags:    

Similar News