జగన్ రెడీ అయినట్లేనా ?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ లో దాదాపుగా ఏడేళ్ళ క్రితం నాటి స్పీడ్ ని అంతా చూశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ లో దాదాపుగా ఏడేళ్ళ క్రితం నాటి స్పీడ్ ని అంతా చూశారు. ఆయన పులివెందుల ఆర్వో ఆఫీస్ ముందు నేల పైన కూర్చుని ధర్నా చేసిన తీరుని చూసినపుడు జగన్ లోకల్ ఫైట్ కి కాదు అసలు ఫైట్ కే రెడీ అయ్యారని అంటున్నారు. నిజంగా జగన్ వ్యూహం కూడా అదే. ఆయన ఆలోచనలూ చూపు అంతా 2029 ఎన్నికల మీదనే ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు అయితే సాధారణంగా రిజల్ట్ ని ఎవరూ అంతగా పట్టించుకోరు. ఇక్కడ గెలుపు అన్నది అధికార పక్షానికి సహజం, సర్వ సాధారణంగానే భావిస్తారు. అధికారంలో ఉన్న పార్టీ వైపే జనాలు మొగ్గు చూపుతారు. ఇక దేశంలో ఎక్కడైనా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు ఒకేలా ఉంటాయి. కాస్తా పట్టు విడుపులు ఉంటే విపక్షానికి కొన్ని సీట్లు దక్కుతాయేమో. అంతకు మించి వాటికి ఇంపార్టెన్స్ లేదనే రాజకీయ పండితులు అంటారు.
జగన్ పట్టుదల :
మరి ఇవన్నీ జగన్ కి తెలియవా. ఎందుకు ఆయన లోకల్ బాడీస్ విషయంలో ఇంత పట్టుదల చూపించారు అంటే అక్కడే ఆయన వ్యూహం ఉందని అంటున్నారు. తాను ఒక్కడే ఆగ్రహిస్తే సరిపోదు, తనలో కసి రేగితే అది చాలదు, తన సైన్యం కూడా అలాగే ఆగ్రహించాలి. వారిలోనూ పట్టుదల పెంచాలి. అందుకే లోకల్ బాడీస్ ఎన్నికలను ఆయన ముందు పెట్టారని అంటున్నారు. ఒక విధంగా చూస్తే ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా వైసీపీ క్యాడర్ అయితే రీచార్జి అయింది. జగన్ సైతం వారి యాక్షన్ కి రియాక్షన్ అన్నట్లుగా తానూ నేల మీదకు వచ్చి నిరసనలకు సిద్ధమని చెప్పేశారు. దాంతో లోకల్ బాడీస్ కి సంబంధించి వైసీపీ ఆలోచనలు వ్యూహాలు పూర్తి అయినట్లే అంటున్నారు.
నెక్స్ట్ ఏంటి మరి :
ఇది కదా అసలైన ప్రశ్న. ఇపుడు ఏమిటి. వైసీపీ ఏమి చేయబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికంగా వైరాలు ఉంటాయి. కోపాలు ఉంటాయి, కసి ఉంటుంది. అందుకే పంచాయతీలకు రాజకీయ ముద్ర లేకుండా ఎన్నికలు పెడతారు. కానీ ఇపుడు అన్ని చోట్లా అటూ ఇటూగా రాజకీయ జనం మోహరింపు కనిపిస్తోంది. అలా వైసీపీ వైపు నుంచి బాగానే మోపు చేసుకొచ్చారు అని అంటున్నారు. నేను మీకు అండగా ఉన్నాను అని జగన్ సైతం ఆందోళనలకు రెడీ అయిపోయిన వేళ అటు క్యాడర్ ఆవేశం ఇటు జగన్ వ్యూహం కలగిస్తే రేపు ఏపీలో వైసీపీ రాజకీయం ఎలా ఉండబోతోంది అన్నదే చర్చ. నెక్స్ట్ ఏంటి అన్నదే ప్రశ్న.
దూకుడుగానే :
ఇక చూస్తే జగన్ పాదయాత్రను సరిగ్గా ఎన్నికలకు ఏణ్ణర్థం ముందు మొదలెట్టడానికే చూస్తున్నారు. అంటే వచ్చే ఏడాది అక్టోబర్ కానీ నవంబర్ కానీ అది ఉండబోతోంది. అప్పటిదాకా వైసీపీ ఆవేశం అలాగే ఉంచుతార అంటే కాదనే మాట వినిపిస్తోంది. జగన్ ఈ పదకొండు నెలలూ వైసీపీని మరింతగా తట్టి లేపే కార్యక్రమాలతో పాటు తాను నిరంతరం జనంలో ఉండేలా భారీ యాక్షన్ ప్లాన్ నే రెడీ చేసుకున్నారు అని అంటున్నారు. అంటే లోకల్ ఫైట్ అన్నది వైసీపీ వ్యూహంలో ట్రైలర్ అయితే 2029 లో అసలు సినిమా అంటున్నారు.
దీంతో రానున్న రోజులలో ఢీ అంటే ఢీ అన్న రాజకీయం ఏపీలో సాగుతుందని అంటున్నారు. అంతే కాదు ఏపీ మరింతగా హీటెక్కిపోవడం ఖాయమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.