28 ఏళ్లుగా ప్రపంచ పాదయాత్ర.. 50 వేల కిలోమీటర్లు నడిచిన బ్రిటిష్ సాహసికుడు!
ప్రపంచాన్ని చుట్టి రావాలంటే విమానాల్లో కొన్ని వారాలు లేదా నెలలు పడుతుంది.
ప్రపంచాన్ని చుట్టి రావాలంటే విమానాల్లో కొన్ని వారాలు లేదా నెలలు పడుతుంది. కానీ కాలినడకన ప్రపంచ యాత్ర చేయాలంటే ఎంత సమయం పడుతుంది? దీనికి సమాధానంగా నిలుస్తున్నాడు బ్రిటన్‌కు చెందిన 57 ఏళ్ల కార్ల్ బుష్బీ. ఏకంగా 28 ఏళ్లుగా కొనసాగుతున్న అతని సాహసయాత్ర ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
1998 నవంబర్‌లో చిలీలోని పుంటా అరేనాస్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు బుష్బీ. దాదాపు 50 వేల కిలోమీటర్లు, నాలుగు ఖండాలు, 30 దేశాలను దాటుకుంటూ ఇంగ్లాండ్‌లోని తన స్వస్థలం హల్‌కు చేరుకునే దిశగా సాగుతున్నాడు. అంతకుముందు 12 ఏళ్లపాటు బ్రిటిష్ ఆర్మీలో పారాట్రూపర్‌గా పనిచేసిన అతను.. మ్యాపులు, సుదూర ప్రయాణాలపై ఆసక్తితో ఈ సాహసానికి శ్రీకారం చుట్టాడు.
ఈ యాత్రలో అతను రెండు కఠినమైన నియమాలు పెట్టుకున్నాడు. ఎలాంటి మోటరైజ్డ్ వాహనాలను ఉపయోగించకూడదు. మొత్తం ప్రయాణాన్ని కాలినడకన పూర్తి చేసే వరకు ఇంటికి తిరిగి వెళ్లకూడదు.
2006లో అలాస్కా నుంచి రష్యాకు గడ్డకట్టిన బెరింగ్ జలసంధిని దాటడం అతని ప్రయాణంలో అత్యంత ప్రమాదకరమైన ఘట్టం. వీసా, భౌగోళిక రాజకీయ సమస్యల కారణంగా కాస్పియన్ సముద్రంలో 160 మైళ్లకు పైగా ఈదుకుంటూ అజర్‌బైజాన్ చేరుకున్నాడు.
మొదట 12 ఏళ్లలో పూర్తి చేయాలనుకున్న యాత్ర దాదాపు మూడు దశాబ్దాలకు చేరుకుంది. తన అనుభవాలను పుస్తకాలు, ప్రసంగాల ద్వారా ప్రపంచంతో పంచుకోవాలని బుష్బీ భావిస్తున్నాడు. అతని ప్రయాణం పట్టుదల, సహనం, సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది.