మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

ఆరోగ్యంగా ఉండాలనే ఆశయంతో పరుగుపందెంలో పాల్గొన్నాడు.. లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుని మెడల్ కూడా అందుకున్నాడు.

Update: 2026-11-02 06:43 GMT

ఆరోగ్యంగా ఉండాలనే ఆశయంతో పరుగుపందెంలో పాల్గొన్నాడు.. లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుని మెడల్ కూడా అందుకున్నాడు. తన శ్రమకు గుర్తింపుగా లభించిన ఆ పతకాన్ని చూసుకుంటూ ఆనందంగా గడపాల్సిన క్షణాల్లోనే విధి కన్నెర్ర చేసింది. మారథాన్ పూర్తి చేసిన కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలచివేస్తోంది.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన మారథాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైన ఈ క్రీడా కార్యక్రమం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆరోగ్యంపై శ్రద్ధతో మారథాన్‌లో పాల్గొన్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొమ్మినేని గోపి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు.

మణికొండలోని అల్కాపూర్ కాలనీకి చెందిన గోపి ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఎన్.ఈబీ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన మారథాన్‌లో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్ణీత దూరాన్ని విజయవంతంగా పూర్తి చేసి ఫినిషర్ మెడల్‌ను అందుకున్నారు. తన లక్ష్యాన్ని చేరుకున్న ఆనందంతో ఉన్న ఆయనకు కొద్దిసేపటికే ఊహించని ప్రమాదం ఎదురైంది.

మారథాన్ పూర్తి చేసిన అనంతరం గోపి అల్పాహారం కోసం వెళ్తుండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కళ్లముందే ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోవడంతో అక్కడున్నవారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

వెంటనే స్పందించిన మారథాన్ నిర్వాహకులు ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే గోపి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో మారథాన్ ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఉదయం ఎంతో ఉత్సాహంగా ఇంటి నుంచి మారథాన్‌కు బయలుదేరిన గోపి.. తిరిగి వస్తారని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు ఆయన మరణవార్త పిడుగులా మారింది. ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పరుగుపందెలో పాల్గొన్న వ్యక్తి ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.

తోటి రన్నర్లు, మారథాన్ నిర్వాహకులు సైతం ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యారు. కాసేపటి క్రితం వరకు అందరితో కలిసి పరుగెత్తిన వ్యక్తి.. మెడల్ అందుకున్న కొద్దిసేపటికే విగతజీవిగా మారడం వారిని కలచివేసింది.

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో మొదలైన పరుగు.. గోపి జీవితంలో చివరి పరుగుగా మిగిలిపోయింది. విజయం సాధించి మెడల్ అందుకున్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఒకవైపు ఫినిషర్ మెడల్.. మరోవైపు తీరని విషాదం.. ఈ ఘటన మారథాన్‌లో పాల్గొనే వారందరినీ ఆలోచింపజేస్తోంది.

Tags:    

Similar News