విద్యార్థి ప్రాణాలు తీసిన హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీ దసరా వేడుకలు

హైదరాబాద్ నాదర్ గుల్ లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో శుక్ర -శనివారాల్లో సంగమం 2026 పేరుతో ఉత్సవాల్ని ఏర్పాటు చేశారు.

Update: 2026-10-18 06:52 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ కళ పెరుగుతున్న వేళ.. హైదరాబాద్ శివారులోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన దసరా వేడుకలు తీవ్ర విషాదానికి కారణమయ్యాయి. శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఉదంతంలో కవలలైన విద్యార్థినుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతోంది. అనూహ్యంగా వీసిన ఈదురుగాలులతో.. వేడుక నిర్వహించే వేదిక వద్ద ఏర్పాటు చేసిన లైటింగ్ పోల్ ఉడిపోవటంఈ పెను విషాదానికి కారణమైంది.

హైదరాబాద్ నాదర్ గుల్ లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో శుక్ర -శనివారాల్లో సంగమం 2026 పేరుతో ఉత్సవాల్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు భారీ ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. శనివారం రాత్రి కాలేజీ గ్రౌండ్ లో దాండియా వేడుక నిర్వహించారు. కాలేజీ గ్రౌండ్ లో విద్యార్థిని విద్యార్థులకు వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. రెండు చోట్ల విద్యుత్ లైట్లతో భారీ సెట్టింగ్ వేశారు. డీజే సౌండ్ తో ఆ ప్రాంగణమంతా సందడి సందడిగా ఉన్న వేళలో.. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. బలమైన గాలులు వీశాయి. విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన ప్రదేశంలోని ఏర్పాటు చేసిన లైటింగ్ పోల్ లో ఒకటి హటాత్తుగా కిందకు ఒరిగింది. దీంతో మిగిలిన లైటింగ్ పోల్స కూడా పడిపోయాయి.

అప్పటికే ఆ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయి ఉండటంతో విద్యార్థినులు తప్పించకునే వీల్లేకపోయింది. ఈ అనూహ్య ఘటనతో అక్కడ గందరగోళ పరిస్థితి చోటు చేసుకుంది. విద్యార్థినుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుగున్న సోనా.. ఆమె సోదరి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇరువురిని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సోనా ప్రాణాలు విడవగా.. ఆమె సోదరి మాత్రం తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతోంది. మరో పందొమ్మిది మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని.. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. పండుగ వేళ.. ప్రమాదాలు పొంచి ఉంటాయి. తగిన జాగ్రత్తలతో ఉండాల్సిన అవసరాన్ని తాజా ఉదంతం చెబుతుందని చెప్పాలి.

Tags:    

Similar News