తాగడానికే నీళ్లు లేవు .. రెండో పంట వేయొద్దు .. రైతాంగం సహకరించాలి
ఎల్‌నినో మూలంగా ఈ ఏడాది తాగడానికే నీటి కొరత వచ్చేలా ఉంది. రాష్ట్రంలోని రిజర్వాయర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి.
ఎల్‌నినో మూలంగా ఈ ఏడాది తాగడానికే నీటి కొరత వచ్చేలా ఉంది. రాష్ట్రంలోని రిజర్వాయర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. తాగడానికే నీటి కొరత ఏర్పడే పరిస్థితులలో సాగునీరు ఇవ్వడం కష్టం. రిజర్వాయర్లలో నీళ్లు లేకపోవడం మూలంగా కరంటు ఉత్పత్తి కూడా కష్టంగా ఉంది. రైతాంగం ఈ పరిస్థితులను గమనించి రెండో పంట వేయడం మానుకోవాలని, దేవుడు వచ్చినా నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండదని, ఈ విషయం రైతులు అర్ధం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
‘2027 జూన్ వరకు పరిస్థితులు ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో తాగునీరు, సాగునీరు, విద్యుత్, వ్యవసాయ రంగాలలో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉందని, రానున్న ఎనిమిది నెలలు అత్యంత కీలకమని, కొందామన్నా కరంటు దొరకని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులు యాసంగి పంటల సాగు విషయంలో వెనక్కు తగ్గాలని సీఎం రేవంత్ రెడ్డి రైతాంగానికి సూచించారు.
ఎల్‌నినో పరిణామాల నేపథ్యంలో అనుసరించాల్సిన విధానాలపై ఈ రోజు సచివాలయంలో క్యాబినెట్ కీలకభేటీ ఏర్పాటు చేశారు. క్యాబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులతో చర్చించడానికి రైతువేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఢిల్లీలో ఆందోళనకు జాతీయ కాంగ్రెస్ పిలుపు రావడంతో ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.
ఎల్‌నినోను సమర్ధంగా ఎదుర్కోనేందుకు ఈ ఏడాది జూలై 18న 27 మందితో మాజీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అధ్యక్షతన ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఎల్‌నినో ప్రభావం వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి జులై 30న ఈ కమిటీ ప్రభుత్వానికి రూ.802.92 కోట్ల ప్యాకేజీతో కూడిన నివేదికను అందించింది.
నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరికి బదులుగా మొక్కజొన్న, పప్పు ధాన్యాలు వంటి తక్కువ నీటితో పండే పంటలు సాగుచేయాలని సూచించింది. బిందు, తుంపర సేద్యం, డ్రిప్ మరియు స్ప్రింక్లర్ సేద్యానికి రాయితీలు పెంచాలని సిఫారసు చేసింది. 399 మండలాల్లో కొత్త వరినాట్లు వేయవద్దని సూచించింది. ఈ కమిటీ సూచనల మేరకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఏడాది జూన్ వరకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు అదేశాలు ఇచ్చారు.
అదే సమయంలో కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని, కేంద్రం రూ.20 వేల కోట్ల ప్యాకేజీ అందించాలని, ఉపాధిహామీ పథకానికి అదనపు పనిదినాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంది. మొత్తంగా రాష్ట్రంలో 17 నుండి 30 శాతం లోటు వర్షపాతం నమోదయిందని, 200 పైచిలుకు మండలాలలో కరవు ఛాయలు నెలకొన్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అన్న విషయంలో స్పష్టమయిన కార్యాచరణ కనిపించే అవకాశం ఉంటుంది.