మాకంటే మాకే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లపై కర్చీఫ్లు!
తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఈ సారి గవర్నర్ కోటాలో ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.
తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఈ సారి గవర్నర్ కోటాలో ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో మాకంటే మాకే అంటూ.. చాలా మంది నాయకులు క్యూ కట్టారు. అయితే.. రెండు రకాలుగా ఈ విషయంపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు.
1) పార్టీ కోసం కష్టపడిన నాయకులు.
2) సామాజిక వర్గాల వారీగా నాయకుల ఎంపిక. ఈ రెండు అంశాలపైనా నాయకులు తర్జన భర్జన పడుతున్నారు.
ఎస్సీ మాదిగ, బీసీ, ఓసీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని గత కొన్నాళ్లుగా డిమాండ్లు తెరమీదికి వచ్చాయి. అయితే.. మంత్రి వర్గంలో ఒకరిద్దరికి అవకాశాలు కల్పించారు. అయినప్పటికీ.. మెజారిటీ పరంగా తమ కు న్యాయం జరగడం లేదని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని భీష్మిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం `ఓట్ చోరీ` వ్యవహారంపై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టడంతో ఈ అంశంపై ఇంకా దృష్టి పెట్టలేదు.
ఇక, సీట్లను ఆశిస్తున్న వారిలో చాలా మంది కాంగ్రెస్ సీనియర్లే ఉండడం గమనార్హం. దాదాపు పదేళ్ల పాటు పార్టీ కోసం పనిచేసిన నేతలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి తరఫున పార్టీలోకి వచ్చిన వారు కూడా ఇప్పుడు ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఈ వ్యవహారం రాను రాను మరింత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో మూడు సీట్లలో ఎస్సీ మాదిగలకు ఒకటి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దొమ్మేటి సాంబయ్య ముందు వరుసలో నిలిచారు. అయితే..డిప్యూటీ సీఎం అనుచరుడిగా పేరున్న ప్రీతమ్ కూడా ఈ జాబితాలోనే ఉండడం గమనార్హం.
అలాగే.. కొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. సంపత్ కుమార్, చారుకొండ వెంకటేష్ తదితరులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు ఒక్కసీటు కూడా తమకు కేటాయించరా? అంటూ.. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వేణుగోపాల్ కూడా తెరమీదికి వచ్చారు. అలానే.. ఇతర నాయకులు కూడా పట్టు బడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. బీసీ కోటాలో అనిల్, కైలాష్, జగదీశ్వర్, జక్కని అనితలు సై అంటున్నారు. మొత్తంగా ఉన్న మూడు స్థానాలకు దాదాపు 30 మందికి పైగా నాయకులు తలపడుతుండడం గమనార్హం.