టార్గెట్ 350 : హ్యాట్రిక్ సీఎంగా యోగి నిలుస్తారా ?

ఎన్డీయే కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న అప్నా దళ్ (ఎస్) 9, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 4 గెలుచుకున్నాయి.

Update: 2026-11-01 09:30 GMT

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. దేశంలో ఎంతో ప్రత్యేకమైన రాష్ట్రం. ఎందుకంటే అతి పెద్ద రాష్ట్రం. ఇప్పటికే ఉత్తరాఖండ్ అని వేరు చేసినా ఇంకా సైజ్ లో బిగ్ స్టేట్ గానే ఉంది. అక్కడ 402 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. దేశంలో ఇన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నది మరో రాష్ట్రం లేదు. అలాగే 80 ఎంపీ సీట్లు ఉన్నది కూడా ఒక్క యూపీలో మాత్రమే. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ లో రెండు సార్లు గెలిచి సత్తా చాటిన బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అందుకోసం అతి పెద్ద టార్గెట్ ని ముందు పెట్టుకుని మరీ సాగుతోంది. ఈసారి ఎన్నికల్లో 350 సీట్లు గెలిచి తీరాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. దాని కోసం తెర వెనక కసరత్తుని ముమ్మరం చేసింది.

విపక్షానికి అంతే :

మొత్తం అసెంబ్లీలో 350 సీట్లు బీజేపీనే గెలవాలి అనుకుంటే విపక్షానికి 52 మాత్రమే వదిలేసినట్లు అన్న మాట. 2024 లోక్ సభ ఎన్నికల్లో 38 దాకా ఎంపీ సీట్లను గెలుచుకున్న సమాజ్ వాదీ పార్టీని మరీ తక్కువగా బీజేపీ చూస్తోందా లేక తమ బలం ఇంకా పెరిగిందని అంచనా వేసుకుంటోందా తెలియదు కానీ బీజేపీ మాత్రం బిగ్ నంబర్ మీద మోజు అయితే పెంచుకుంది. ఇక వెనక్కి వెళ్ళి చూస్తే 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ యూపీలో గెలుచుకున్న అసెంబ్లీ సీట్లు 325. అందులో బీజేపీ ఒంటరిగా 312 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది.

ఎన్డీయే కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న అప్నా దళ్ (ఎస్) 9, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 4 గెలుచుకున్నాయి. ఇక 2022 కి వచ్చేసరికి బీజేపీ యూపీలో గెలుచుకున్న అసెంబ్లీ సీట్లు 255. మిత్రులతో కలిపి 273 సీట్లు సాధించింది. మరి 2022 నాటికే 52 సీట్లు తగ్గిపోయిన బీజేపీ కూటమి ఇపుడు అదనంగా మరో 77 సీట్లను కోరుకుంటోంది అంటే గెలుపు ధీమా ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతోంది అంటున్నారు.

సాధ్యమేనా :

ముచ్చటగా మూడోసారి బీజేపీ యూపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. పదేళ్ళ పాలన తరువాత సహజంగానే యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. దానికి తోడు ప్రత్యర్థి పార్టీ ఎస్పీ బాగానే పుంజుకుందని అంటున్నారు. 2024లో ఎక్కువ ఎంపీ సీట్లతో పాటు లేటెస్ట్ గా మోడీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్ధి గెలిచి బీజేపీకి షాక్ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ కూడా యూపీలో బలం పుంజుకుంటోంది. ఇలా చూస్తే కనుక ఎస్పీ కాంగ్రెస్ సహా ఇతర పార్టీల కూటమి బలంగానే బీజేపీని ఢీ కొట్టనున్నాయి. దీంతో ఈసారి బీజేపీ 402కి 200 ప్లస్ గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా రికార్డు అన్న పరిస్థితి ఉంది. కానీ బీజేపీ 350 అని టార్గెట్ పెట్టుకుంది. మరి యోగీ ఆదిత్యనాథ్ మీద నమ్మకమా లేక ఎస్పీని ఎలాగైనా వీక్ చేయవచ్చు అన్న ధీమానా అన్నది అయితే చూడాల్సి ఉంది. ఇక మూడోసారి కూడా ఎలాగైనా బీజేపీని యోగి గెలిపిస్తే మాత్రం బీజేపీలో మోడీ తరువాత ప్లేస్ కచ్చితంగా యోగీదే అవుతుందని అంటున్నారు. ఆయన భావి ప్రధాని అభ్యర్ధిగా కూడా ఉంటారని అంటున్నారు.

Tags:    

Similar News