పులివెందులకు జగన్.. హెలిక్యాప్టర్ ల్యాండింగ్ లో గందరగోళం.. చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు

పోలింగ్ కేంద్రాలకు వస్తున్న ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని.. "మీ ఓటు ఇప్పటికే పడిపోయింది" అని పోలీసులు వెనక్కి పంపుతున్నారని జగన్ విమర్శించారు.

Update: 2026-11-01 05:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పులివెందుల కేంద్రంగా రాజకీయం తీవ్రంగా వేడెక్కింది. పులివెందుల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఓటువేసేందుకు హెలిక్యాప్టర్ లో పులివెందులకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, అధికార యంత్రాంగంపై నిప్పులు చెరిగారు.

బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పులివెందులకు చేరుకున్న జగన్‌కు ఆరంభంలోనే చేదు అనుభవం ఎదురైంది. భాకరాపురంలోని హెలిప్యాడ్ వద్ద ల్యాండింగ్‌కు అధికారులు మొదట అనుమతి నిరాకరించడంతో హెలికాప్టర్ కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత అనుమతి రావడంతో భాకరాపురం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న జగన్ 14వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు వేసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. పులివెందులలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని మండిపడ్డారు. మొత్తం 80 పోలింగ్ బూత్‌లలో దాదాపు 70 చోట్ల తమ పార్టీ ఏజెంట్లను టీడీపీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేసి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నాయని ఆరోపించారు. ఉదయం 4 గంటల నుంచే టీడీపీ గూండాలు బూత్‌లను ఆక్రమించుకుని.. యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ అభ్యర్థి ప్రమీలమ్మతో పాటు పలువురు నేతలపై దాడులు చేశారని.. మీడియా ప్రతినిధుల కెమెరాలను సైతం ధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.

పోలింగ్ కేంద్రాలకు వస్తున్న ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని.. "మీ ఓటు ఇప్పటికే పడిపోయింది" అని పోలీసులు వెనక్కి పంపుతున్నారని జగన్ విమర్శించారు. కలెక్టర్లు, ఎస్పీలకు ఫోన్ చేసినా ఏమాత్రం స్పందించడం లేదని.. పోలీసులే అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పులివెందుల మాత్రమే కాకుండా జమ్మలమడుగు, చిత్తూరు, మాచర్ల, తాడిపత్రి, మదనపల్లెల్లో కూడా ఓటర్లను తీవ్రంగా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.

ఇలాంటి అక్రమాలకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. "రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించలేకపోతున్న చంద్రబాబుకు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు" అని ధ్వజమెత్తారు. అక్రమాలు జరిగిన ఈ ఎన్నికలను తక్షణమే రద్దు చేసి.. పులివెందులలో వెంటనే పారదర్శకంగా రీ-పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం పులివెందులలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్‌ జగన్ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయం మరింత ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News