నీళ్లకు బదులు చెర్రీ కోక్.. వారెన్ బఫెట్ డైట్ సీక్రెట్ ఇదేనా?

విచిత్రమేమిటంటే వారెన్ బఫెట్ దాదాపు 50 ఏళ్ల పాటు పెప్సీ డ్రింక్ తాగేవాళ్లట. చిన్నతనంలో తన కొడుకు హౌవార్డ్ స్నేహితులు కూడా బఫెట్‌ను సరదాగా "పెప్సీ వారెన్" అని పిలిచేవారట.

Update: 2026-11-01 04:34 GMT

ప్రపంచ కుబేరులలో ఒకరైన, లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (96) తన లైఫ్‌స్టైల్‌తో ఎప్పుడూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. సాధారణంగా ఆరోగ్యం కోసం ప్రతీ ఒక్కరూ రోజూ లీటర్ల కొద్దీ మంచినీళ్లు తాగుతుంటారు. కానీ, వారెన్ బఫెట్ మాత్రం ఏకంగా 48 ఏళ్లుగా మంచినీళ్లే తాగలేదనే షాకింగ్ నిజం బయటికొచ్చింది. బిలియనీర్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిల్ ఆక్‌మన్ ఓ పాడ్‌కాస్ట్‌లో బయటపెట్టిన ఈ సీక్రెట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలు చూద్దాం..

48 ఏళ్లుగా మంచినీళ్లే ముట్టుకోలేదు:

తాజాగా ‘ఈక్విటీ మేట్స్ ఇన్వెస్టింగ్’ పాడ్‌కాస్ట్‌లో బిల్ ఆక్‌మన్ మాట్లాడుతూ బఫెట్‌తో తనకున్న జ్ఞాపకాన్ని పంచుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఒక డిన్నర్ సమయంలో బఫెట్‌ను "స్టిల్ వాటర్ తాగుతారా? లేక స్పార్కిలింగ్ వాటర్ కావాలా?" అని అడగగా.. బఫెట్ దాన్ని నవ్వుతూ తిరస్కరించారు. "బిల్, నేను మంచినీళ్లు తాగి ఏకంగా 48 ఏళ్లు అవుతోంది" అని చెప్పడంతో ఆక్‌మన్ నోరెళ్లబెట్టారట. ఇక నీళ్లకు బదులుగా తన ఫేవరెట్ డ్రింక్ 'చెర్రీ కోక్' నుంచే శరీరానికి కావలసిన హైడ్రేషన్ పొందుతానని బఫెట్ చెప్పారట.

రోజుకు 5 కెన్లు.. 2700 క్యాలరీలు:

గతంలో ఓ మేగజైన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ తన ఆహార అలవాట్ల గురించి స్వయంగా వెల్లడించారు. "నేను పావు వంతు కోకాకోలాతోనే తయారయ్యాను" అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. రోజుకు తాను తీసుకునే 2,700 క్యాలరీల ఆహారంలో పావు వంతు భాగం కేవలం కోకాకోలా నుంచే వస్తుందని తెలిపారు. ఇక రోజుకు కనీసం ఐదు 12-ఔన్స్ పొడవాటి కెన్ల కోక్‌ను ఆయన ఖాళీ చేస్తుంటారట.

పెప్సీ నుంచి చెర్రీ కోక్‌కు ఎలా మారారు?:

విచిత్రమేమిటంటే వారెన్ బఫెట్ దాదాపు 50 ఏళ్ల పాటు పెప్సీ డ్రింక్ తాగేవాళ్లట. చిన్నతనంలో తన కొడుకు హౌవార్డ్ స్నేహితులు కూడా బఫెట్‌ను సరదాగా "పెప్సీ వారెన్" అని పిలిచేవారట. అయితే ఒక పక్కింటి వ్యక్తి సూచనతో 1986లో ఆయన పెప్సీ నుంచి చెర్రీ కోక్‌కు మారారు. ఇక 1986 బెర్క్‌షైర్ హాత్‌వే వార్షిక సమావేశంలో బఫెట్ చెర్రీ కోక్‌ను తమ కంపెనీ అధికారిక డ్రింక్‌గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

96 ఏళ్ల వయసులోనూ అదే ఫేవరెట్:

ప్రస్తుతం 96 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటికీ బఫెట్ తన ఈ విచిత్రమైన ఆహార అలవాట్లను వీడకపోవడం విశేషం. డాక్టర్లు, హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సాధారణంగా సోడాలు, కూల్ డ్రింక్స్ తగ్గించి మంచినీళ్లు ఎక్కువగా తాగాలని చెబుతుంటారు. కానీ, ప్రపంచంలోని అత్యంత సంపన్నుడైన బఫెట్ మాత్రం దశాబ్దాలుగా సాధారణ నీటికి దూరంగా ఉంటూ కేవలం కోకాకోలాతోనే రోజులు గడిపేస్తున్నారు.

ఇక మొత్తానికి చూస్తే, 48 ఏళ్లుగా మంచి నీళ్లకు బదులు రోజుకు ఐదు కెన్ల చెర్రీ కోక్ తాగుతూ బఫెట్ చెబుతున్న ఈ డైట్ సీక్రెట్ వింటుంటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇక బిజినెస్ ప్రపంచంలో దిగ్గజంగా నిలిచిన బఫెట్, తన వ్యక్తిగత లైఫ్‌స్టైల్‌తోనూ మరోసారి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు...

Tags:    

Similar News