పగను శ్వాసిస్తున్నారు !
ప్రేమ తగ్గిన చోట తాటకిలా పగ కచ్చితంగా మొలుస్తుంది, అదే గెలిచినట్లుగా వికటాట్టహాసం కూడా చేస్తుంది.
ప్రేమ పగ ఈ రెండూ పక్క పక్కనే ఉంటాయి. అయితే ప్రేమ అందరిదీ అయితే పగ కొందరిది మాత్రమే. ప్రేమ ఉన్న చోట పగకు స్థానం లేదు, పగ అన్న దానికి ఉనికి వెన్నెల వెలుగు లాంటి చల్లని ప్రేమ తాకనంతవరకే. అది చేరాక చీకటిలా పగ కూడా పరుగు తీయాల్సిందే. అయితే ప్రేమ అంతటా పరచుకునేలా చేసే పని ఎవరిది అన్నదే మౌలికమైన ప్రశ్న. ప్రేమతో దేనిని అయినా జయించవచ్చు అన్న ముఖ్య సూత్రాన్ని తెలియచెప్పడంలో సమాజంలో తడబాటు పొరపాటు ఎక్కడ జరుగుతోంది అన్నది మరో ప్రశ్న. ప్రేమ తగ్గిన చోట తాటకిలా పగ కచ్చితంగా మొలుస్తుంది, అదే గెలిచినట్లుగా వికటాట్టహాసం కూడా చేస్తుంది.
ఐచ్చిక మరణంగా :
మహా భారతంలో భీష్ముడికి మాత్రమే ఐచ్చిక మరణం ఉండేది. ఆయన తాను ఎపుడు కోరుకుంటే అపుడు మరణించే వరాన్ని పొందిన ఏకైక యోధుడు. అందుకే ఆయనను బాణాలు వేసి అర్జునుడు నేల కూల్చిన ప్రాణాలను మాత్రం తీయలేకపోయాడు. అయితే భీష్ముడి వరం కంటే కూడా గొప్పగా ఇపుడు కలియుగంలో ఆధునిక జీవనంలో తెలివైన వారు అంతా ఐచ్చిక మరణాన్ని ఆశ్రయిస్తున్నారు. అదే ఆత్మహత్య. తాము ఎపుడు కోరుకుంటే అపుడు చనిపోవడం. దానికి ముందు ఎన్ని తప్పులు చేయాలో అన్నీ చేసేసి మరీ తాము కూడా తనువు చాలించడం. ఇది ఒక వికృత క్రీడ. తాను చస్తూ అనేక మందిని చంపడం పగ ప్రతీకారంతో శ్వాసించి అందులోనే తుది శ్వాస విడవడం.
సైకో రాజ్ కుమార్ మిగిల్చినది :
ఇక ఇదంతా ఎందుకు అంటే తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా షాబాద్ లోని ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు అయిన బి. రాజ్ కుమార్ సోమవారం తన మేనమామ ఊళ్ళో ఆత్మహత్య చేసుకుని శవమై తేలాడు. దీంతో ఎవరికీ చిక్కకుండా రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకుని ఐచ్చిక మరణం పొందాడు అన్న మాట. దాంతో సభ్య సమాజం మొత్తానికి అతగాడు అంతులేని అసంతృప్తి మిగిల్చాడు. ఇంతలా పసి గొంతులతో పాటు వృద్ధుల ప్రాణాలు తీసి మరీ నర మేధం చేసిన రాజ్ కుమార్ ని పట్టి బంధించి నలుగురి మధ్యన ఉరి తీయాలని పౌర సమాజం డిమాండ్ చేసింది. అలాగే ఆశించింది. కానీ అందరి కోపాన్ని అలాగే ఉంచేస్తూ రాజ్ కుమార్ తన చావు తానే కోరి తెచ్చుకున్నాడు, అలా ప్రశాంతంగా వెళ్ళిపోయాడు అని సమాజం గోడుమనడమే మిగిలింది.
తప్పెవరిది అని అంటే :
ఈ ఎపిసోడ్ లో సైకో రాజ్ కుమార్ తాను ఆరుగురిని చంపాడు, తానూ తనువు చాలించాడు. మొత్తానికి తాను అనుకున్నది చేశాడు. గెలిచాను అనుకుంటూనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక విధంగా సమాజానికి సవాల్ చేసి జవాబు లేని ప్రశ్నలు ఎన్నో రేకెత్తించి మరీ లోకం వదిలాడు. ఈ మొత్తం ఎపిసోడ్ లో తప్పు ఎవరిది అంటే వారూ వీరూ అని ఎవరినో అనుకుంటారు, కానీ మొత్తానికి బాధ్యత స్వీకరించాల్సింది పౌర సమాజం మాత్రమే అన్నది అసలైన జవాబు. ఏ సమాజంలో అయితే నైతిక నిష్ట ఉంటుందో ఎక్కడైతే మోరల్ పోలీసింగ్ సజావుగా సాగుతుందో అక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉండదు, సైకో రాజ్ కుమార్ గుండె నిండా పగ నింపుకుని అందరి మధ్యనే మానవ మృగంగా తిరిగాడు. అతను చేసే తప్పులు అన్నీ ఇన్నీ కావు, టీనేజ్ నుంచే జులాయి వేషాలు వేసాడు అని పోలీసుల దర్యాప్తులో తేలిన విషయం. మరి అతగాడిని ఆదిలోనే అదుపు చేయాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులతో పాటు సమాజం మీద కూడా ఉంది కదా అన్న ప్రశ్న తలెత్తుతుంది.
నైతికత లేకపోతేనే ముప్పు :
ఏ సమాజంలో అయితే నైతికత దెబ్బ తింటుందో అక్కడే అసలైన ముప్పు పొంచి ఉంటుందని మేధావులు చెబుతారు. ఎన్ని చట్టాలు ఉన్నా సమాజం నుంచి నేర్చేదే ఎక్కువగా ఉంటుంది. ఏమి చేసినా చెల్లుతుంది అనే ధోరణి నుంచే సైకోలు పుడతారు, వారిని మొగ్గలోనే అదుపు చేసి అణచివేసే చర్యలు సమాజం కూడా తీసుకోవాలి. విద్యార్థి దశ నుంచి అది బలంగా చేరాల్సి ఉంది. పాఠశాల విద్య నేర్పే గురువుల నుంచి తోటి స్నేహితుల నుంచి అలాగే ఇరుగుపొరుగు నుంచి ఇంకా సమాజంలో వివిధ వర్గాల నుంచి ఈ తరహా సైకో ప్రవర్తనను కట్టడి చేసే మెకానిజం అన్నది ఎక్కడో దెబ్బ తినడం వల్ల మూడున్నర దశాబ్దాల తన సైకో ప్రవృత్తితో పగనే మొత్తంగా చేసుకుని రాజ్ కుమార్ లాంటి వారు జీవిస్తున్నారు, మరణిస్తూ కూడా తామే గెలిచామని భ్రమిస్తున్నారు.
తనను తాను తడుముకోవాలి :
ఈ తరహా సంఘటనలు జరిగిన ప్రతీ సారీ మోరల్ పోలీసింగ్ బాధ్యత తెలియచేస్తుంది. అలాగే సమాజంలో నైతిక ప్రమాణాలను మరింత బలంగా పాదుగొల్పాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెబుతోంది. కురు సభలో ద్రౌపది వలువలు దుశ్శాసనుడు ఒలిచినపుడు ప్రధాని విలన్ గా అతడే కనిపిస్తాడు, కానీ మంచి చెడూ చెప్పలేని కురు వృద్ధులు కురు వృద్ధ బాంధవులు అంతా కూడా దానికి బాధ్యత వహించిన వారే అవుతారు. అలాగే మన మధ్యనే సైకో విష సర్పాలు పెరుగుతున్నాయంటే సమాజం ఒక్కసారి తనను తాను తడుముకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తమ విలువలకు పట్టం కట్టే దిశగా అడుగులు బలంగా వేయాల్సిన అవసరం ఉంది, పగ కాదు ప్రేమతోనే జీవితం అని చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. లేకపోతే సైకోలే చచ్చి గెలుస్తారు, బతికి చంపుతారు.