ప్రకృతి ప్రసాదించిన ఈ 10 మీ వద్ద ఉంటే.. రోగాలు దూరం..

వీరికి ఫీజు కట్టక్కర్లేదు, అపాయింట్‌మెంట్ తీసుకోవక్కర్లేదు. కేవలం వీరిని మన దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే చాలు.;

Update: 2026-04-21 07:30 GMT

ఆసుపత్రుల చుట్టూ తిరగడం, వేలాది రూపాయలతో మందులు వేసుకోవడం కంటే మన జీవనశైలిలోనే ఈ ‘10 మంది డాక్టర్లను’ భాగం చేసుకుంటే అసలు రోగాల బారిన పడే అవకాశమే ఉండదు. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఇవే.. ఆధునిక కాలంలో మానవుడు సాంకేతికతతో పాటు వేగాన్ని అలవర్చుకున్నాడు కానీ, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అయితే, మనకు తెలియకుండానే మన చుట్టూ పది మంది గొప్ప వైద్యులు ఉన్నారు. వీరికి ఫీజు కట్టక్కర్లేదు, అపాయింట్‌మెంట్ తీసుకోవక్కర్లేదు. కేవలం వీరిని మన దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే చాలు. ఆ పది మంది వైద్యులు మన ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతారు.

1. సూర్యుడు (The Sun): సూర్యుడు భూమిపై ఉన్న సమస్త జీవరాశికి మూలాధారం. ఉదయాన్నే ఎండలో కాసేపు ఉండడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్-డీ లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచడమే కాకుండా, మానసిక ఒత్తిడిని తగ్గించి ‘సెరోటోనిన్’ అనే హ్యాపీ హార్మోన్‌ను విడుదల చేస్తుంది.

2. నిద్ర (Rest/Sleep): శరీరం తనను తాను రిపేర్ చేసుకునే సమయం నిద్ర. రోజుకు 7 నుండి 8 గంటల గాఢ నిద్ర లేకపోతే మెదడు పనితీరు మందగిస్తుంది. నిద్ర అనేది కేవలం విశ్రాంతి కాదు, అది శరీరానికి ఇచ్చే ఒక 'రీఛార్జ్' వంటిది.

3. మంచి శృంగారం (Healthy Intimacy): ఇది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు. భాగస్వామితో గడిపే నాణ్యమైన సమయం వల్ల శరీరంలో 'ఆక్సిటోసిన్' విడుదలవుతుంది. ఇది రక్తపోటును తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, మానసిక బంధాన్ని బలోపేతం చేస్తుంది.

4. వ్యాయామం (Exercise): శరీరాన్ని కదిలించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా వ్యాయామం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవు. కండరాలు, కీళ్లు చురుగ్గా ఉంటాయి.

5. మంచి ఆహారం (Good Diet): ఆహారం మితంగా తీసుకుంటే ఔషదం.. మితం తప్పితే విషం అంటారు పెద్దలు. ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్ కాకుండా.. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

6. తాగునీరు (Water): శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి నీరు అత్యవసరం. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది, కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

7. గాలి (Fresh Air): స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. ఉదయాన్నే పార్కుల్లో లేదా చెట్ల మధ్య గడపడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరిగి ఏకాగ్రత పెరుగుతుంది.

8. నవ్వుకోవడం (Laughter): ‘నవ్వు నాలుగు విధాలా చేటు’ కాదు, ‘నవ్వు పది రకాల రోగాలకు మందు’. మనసారా నవ్వడం వల్ల ఊపిరితిత్తులకు వ్యాయామం లభిస్తుంది. ఒత్తిడిని కలిగించే 'కార్టిసోల్' హార్మోన్ తగ్గుతుంది.

9. స్నేహితులు (Friends): మనిషి సంఘజీవి. మంచి స్నేహితులతో మనసు విప్పి మాట్లాడడం వల్ల కలిగే మానసిక ప్రశాంతత ఏ థెరపీ ఇవ్వలేదు. ఒంటరితనాన్ని పారద్రోలి, ఆయుష్షును పెంచడంలో స్నేహం కీలక పాత్ర పోషిస్తుంది.

10. కృతజ్ఞత (Gratitude): చివరిగా, ఉన్నదానితో తృప్తి చెందడం, అందరికీ కృతజ్ఞతతో ఉండటం. ఈ లక్షణం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. సానుకూల దృక్పథం (Positive Attitude) వల్ల శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని సైన్స్ చెబుతోంది.

ఈ పది మంది డాక్టర్లు మనకు అందుబాటులోనే ఉన్నారు. కానీ మనం వీరిని నిర్లక్ష్యం చేసి ఖరీదైన ఆసుపత్రుల వెంట పడుతున్నాం. ప్రకృతి ఇచ్చిన ఈ ఉచిత వైద్యులను గౌరవిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం.

Tags:    

Similar News