రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం.. 70 ఏళ్ల తర్వాత సంచలనం!
| భారత్‌కు చెందిన అరుదైన 24 క్యారెట్ల పింక్ డైమండ్ ‘ది బల్గారి పింక్’ స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన క్రిస్టీస్ వేలంలో రూ.130 కోట్లకు అమ్ముడైంది. 1950లలో భారత్‌లో కొనుగోలు చేసిన ఈ వజ్రం దాదాపు 70 ఏళ్లుగా ఒకే కుటుంబం వద్ద ఉంది. ‘ఫ్యాన్సీ ఇంటెన్స్ పింక్’ గ్రేడ్, అరుదైన నాణ్యత దీని ప్రత్యేకత.
ప్రపంచ వజ్రాల మార్కెట్లో భారతదేశానికి చెందిన అరుదైన పింక్ డైమండ్ భారీ ధరకు అమ్ముడైంది. ‘ది బల్గారి పింక్’ పేరుతో ప్రసిద్ధి చెందిన 24 క్యారెట్ల వజ్రం అంతర్జాతీయ వేలంలో ఏకంగా 12,086,000 స్విస్ ఫ్రాంక్‌లు పలికింది. అమెరికన్ డాలర్లలో దీని విలువ 14.8 మిలియన్లు కాగా.. భారతీయ కరెన్సీలో సుమారు రూ.130 కోట్లు.
ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీస్ స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో నిర్వహించిన ‘మాగ్నిఫిసెంట్ జువెల్స్’ వేలంలో ఈ వజ్రం అమ్ముడైంది. వేలానికి ముందు దీనికి 10 మిలియన్ల నుంచి 15 మిలియన్ల స్విస్ ఫ్రాంక్‌ల వరకు ధర వస్తుందని అంచనా వేశారు. చివరకు అంచనాలకు అనుగుణంగా భారీ ధర పలికింది.
70 ఏళ్లుగా ఒకే కుటుంబం వద్ద..
ఈ వజ్రానికి భారతదేశంతో ప్రత్యేకమైన చారిత్రక సంబంధం ఉంది. 1950వ దశకంలో విక్రేత కుటుంబానికి చెందిన పూర్వీకులు భారతదేశంలో దీన్ని కొనుగోలు చేశారు. అనంతరం ఇటలీలోని రోమ్కు తీసుకెళ్లి ప్రముఖ ఆభరణాల సంస్థ బల్గారి వద్ద ఉంగరంగా రూపొందించారు. అప్పటి నుంచి సుమారు ఏడు దశాబ్దాల పాటు ఒకే కుటుంబం వద్ద భద్రంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత తొలిసారిగా అంతర్జాతీయ వేలం వేదికపైకి వచ్చింది.
అరుదైన పింక్ డైమండ్ ప్రత్యేకతలివే!
‘బల్గారి పింక్’కు జెమాలజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా (GIA) నుంచి ‘ఫ్యాన్సీ ఇంటెన్స్ పింక్’ రంగు గ్రేడ్ లభించింది. ఇది అత్యంత అరుదైన టైప్-2ఏ వజ్రాల కేటగిరీకి చెందుతుంది. దీనికి VVS2 క్లారిటీ గ్రేడ్ ఉండటంతో పాటు విశాలమైన ముఖభాగాలతో కూడిన ఎమరాల్డ్ కట్లో రూపొందించారు.
సహజ పింక్ వజ్రాల్లో క్రిస్టల్ నిర్మాణంలో ఏర్పడే ప్రత్యేక మార్పులు వాటి గులాబీ రంగుకు కారణమవుతాయి. అరుదైన రంగు, నాణ్యత, చారిత్రక నేపథ్యం ఈ వజ్రానికి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. క్రిస్టీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ జ్యువెలరీ మాక్స్ ఫాసెట్ ఈ వజ్రాన్ని ‘పింక్ డైమండ్స్‌లో మోనాలిసా’గా అభివర్ణించారు.