మనసులో చీకట్లు తొలగించుకో !
| దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక మాత్రమే కాదు.. మనలోని అజ్ఞానం, చెడు ఆలోచనలను తొలగించుకుని జ్ఞానంతో ముందుకు సాగాలనే సందేశాన్ని కూడా ఇస్తుంది. దీపం వెలుగు కొత్త ఆలోచనలకు, ప్రగతికి మార్గం చూపుతుంది. జీవితంలో విజయాలు సాధించాలంటే చీకటిని నిందిస్తూ కూర్చోకుండా మన ప్రయత్నంతో జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలన్నదే దీపావళి అంతరార్థం.
వెలుగు ఎపుడూ విజయమే. అది చూపే దారి ఎపుడూ అభ్యుదయమే. అందుకే వెలుతురుని దేవతలా కొలుస్తారు. దీపాన్ని లక్ష్మీ దేవిగా భావిస్తారు. సనాతనులు ఈ విధంగా ఆధ్యాత్మిక భావాలను వీటికి అద్దినా తార్కికంగా చూసినా వెలుగుకు ఉన్న విలువ వేరు. చీకటిని చీల్చుకుంటూ సాగించే ఆ ప్రయాణంలో అప్రతిహత విజయాలే నమోదు అవుతాయి. ఇక్కడ చీకటి అంటే అజ్ఞానం అని అర్థం చేసుకోవాలి. ప్రతీ మనిషికీ మెదడు ఉంటుంది. అందులో నిండారా తెలివి ఉండాలని ఏమీ ఎక్కడా రాసిపెట్టి లేదు. కాస్తా మంద బుద్ధి కూడా తోడు అవుతూ ఉంటుంది. అలాంటి సమయాలలో అలసత్వం ప్రదర్శించిన సందర్భాలలో తట్టి లేపి నిన్ను నీవుగా నిలబెట్టి వెన్ను తట్టేదే జ్ఞాన దీపం. అందుకే వెలుగుకు అంత గౌరవం, మన్నన.
చెడు తలపులతో :
కేవలం మంద బుద్ధి మాత్రమే కాదిక్కడ. చెడు తలపులు మదిని చేరి వక్ర మార్గం పట్టించే చోట అన్నీ ముళ్ల దారులే కనిపిస్తాయి, అంతటా అంధకారమే తాండవిస్తుంది. అలాంటి సమయాలలో సైతం ఉదయం కావాలి. మనసు పొరలలో కాంతి రేఖలు విరజిమ్మే తెలివి నెగడు కావాలి. ఏది మంచి ఏది చెడు అన్న తారతమ్యం చూసే బుద్ధి కలగాలి అంటే మళ్లీ వెలుగుని ఆశ్రయించవలసిందే. తెలివి అధికమైనా చేటుగానే ఉంటుంది. సమతూకంలో ఉంటే ప్రణాళిక పారుతుంది. పై మెట్టుకు దారి దొరుకుతుంది. అలా గమ్యానికి బాటలు పరచే అందమైన పరిష్కారాన్నే వెలుగుగా భావించాలి.
తూరుపు వైపుగా :
తూరుపు తిరిగి దండం పెట్టు అంటే అది వెటకారం కాదు, అసలైన పరమార్ధం అందులోనే ఉంది. తూరుపున ఉదయించే సూరీడు అందిస్తాడు ఆయువుతో పాటు ఆరోగ్యంతో పాటు జీవితానికి ఎన్నో ప్రగతి సూత్రాలను. ఆ వెలుగు జిలుగులలో బతుకుని దిద్దుకోవడం మాత్రం నీ చేతుల్లో చేతలలోనే ఉంది అన్నది వాస్తవం. తూర్పు ఎరుపు ఎపుడూ రేపటి ఉదయానికి మార్గ నిర్దేశకత్వం చేస్తుంది. నీవేంటో చాటి చెబుతుంది. నీలో ఉన్న శక్తిని బయటకు తీస్తుంది. నీవు ఎక్కడ ఉండాలో నిర్ణయించి మరీ విజయ పతాక చేతికి అందిస్తుంది.
దీపావళి సూక్షం ఇదే :
పండుగలు ఎపుడూ సంతోషాన్నే కాదు సందేశాన్ని అందిస్తాయి. చెడు మీద మంచి గెలుపుగా దీపావళి జరుపుకోవటం ఆనవాయితీ. దుర్జనులను నిర్జించి సజ్జనుల సాంగత్యంతో సాగిపోమని పరమార్ధాన్ని అవి చెబుతాయి. దీపావళిలో ఉన్న సూక్షం కూడా ఇదే. అయితే చెడుగు అంటే ఏమిటో తెలుసుకోవాలి. రాక్షసుడు అంటే క్రూరంగా నిలబడి పురాణాలలో వర్ణించినట్లుగా కంటికి కనిపించరు. ముందే చెప్పినట్లుగా మన ఆలోచనలలో చెడు ఉంటే గతి బాగుండదు, ప్రగతి కానరాదు, అందుకే వాటిని విసర్జించి ఉన్నతమైన భావాలతో ఎదగాలని దీవించేదే దీపావళి. ఎవరు ఏ వృత్తులలో ఉన్నా ఏ ప్రవృత్తులలో సాగుతున్నా అందరికీ విజయాలు దక్కాలీ అంటే జ్ఞానమే అతి ముఖ్యం. అందులోనే వెలుగు ఉంటుంది. తిమిరంతో సమరం చేస్తూ చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ మూసిన తలుపులు తెరచుకోవు. పిసరంత కూడా వెలుగు రేఖలు విచ్చుకోవు. అందుకే నీ ప్రయత్నం నీవు చేయాలి. కొత్త ఆలోచనలు చేయాలి. అందులో విజయాలు అందుకోవాలి. అలా ముందుకు సాగే దారులలో నీ చేతిన ఉండాల్సింది వెలుగు జెండా.