మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!
| దేశవ్యాప్తంగా నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 వరకు 25 రోజుల్లో సుమారు 52 లక్షల వివాహాలు జరగనున్నాయని సీఏఐటీ అంచనా వేసింది. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో రూ.7.50 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని తెలిపింది. వీటి ద్వారా 1.25 కోట్ల మందికి తాత్కాలిక ఉపాధి లభించనుందని వెల్లడించింది. బంగారం, వస్త్రాలు, క్యాటరింగ్, ఫంక్షన్ హాళ్లకు భారీగా గిరాకీ ఉండనుంది.
పెళ్లి అంటే కేవలం మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధం మాత్రమే కాదు.. ఒక కుటుంబంలో అతిపెద్ద వేడుక. అంతకుమించి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే ఒక భారీ పరిశ్రమ! ఒక వివాహం అంగరంగ వైభవంగా, జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకంగా నిలవాలంటే తెరవెనుక వందలాది చేతుల శ్రమ దాగి ఉంటుంది. పందిరి వేసే కార్మికుడి నుంచి బంగారు నగల వ్యాపారి వరకు ఎందరో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములవుతారు. అందుకే ఆర్థిక నిపుణుల లెక్కల్లో పెళ్లి అంటే.. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే ఒక బలమైన 'ఆర్థిక ఇంజిన్'.
దేశంలో మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలవబోతోంది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 వరకు 25 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా సుమారు 52 లక్షల వివాహాలు జరగనున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తాజాగా అంచనా వేసింది. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో ఏకంగా రూ. 7.50 లక్షల కోట్ల మేర వ్యాపారం జరగనుందని అంటున్నారు. 25 రాష్ట్రాల్లో వివిధ వర్తక, వ్యాపార సంఘాలతో సంప్రదించిన అనంతరం 'సీఏఐటీ రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్‌మెంట్ సొసైటీ' ఈ గణాంకాలను విడుదల చేసింది.
పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు, దేశంలోని మార్కెట్లన్నీ కళకళలాడతాయి. పల్లె నుంచి పట్నం వరకు ప్రతి రంగంలోనూ పని పెరిగి, ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుంది. ఒక పెళ్లి జరగాలంటే ఎన్నో రకాల వస్తువులు, సేవల అవసరం ఉంటుంది. సీఏఐటీ అంచనాల ప్రకారం ఈ సీజన్ లో రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపారంలో వస్తువులు, రిటైల్ కొనుగోళ్ల వాటా 54 శాతంగా ఉంది. అంటే సుమారు రూ. 4.05 లక్షల కోట్లు. ఇందులో బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్ల ద్వారా అత్యధికంగా రూ. 1.20 లక్షల కోట్లు, పెళ్లి బట్టలు, పట్టుచీరలు, డిజైనర్ దుస్తుల ద్వారా రూ. 90,000 కోట్ల వ్యాపారం జరగనుంది. వీటితో పాటు బహుమతులు, పెళ్లి సామగ్రికి రూ. 37,500 కోట్లు, కిరాణా సరుకులు, కూరగాయలు, ఆహార పదార్థాలకు రూ. 37,500 కోట్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వస్తువులకు రూ. 30,000 కోట్లు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్‌కు మరో రూ. 30,000 కోట్ల మేర గిరాకీ ఉంటుందని అంచనా వేశారు.
వస్తువుల కొనుగోళ్లతో పాటు సేవా రంగం (46 శాతం వాటా) ద్వారా మరో రూ. 3.45 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. ముఖ్యంగా క్యాటరింగ్, ఆహార సేవల ద్వారా రూ. 75,000 కోట్లు, ఫంక్షన్ హాళ్లు, బాంక్వెట్ హాళ్లు, హోటళ్ల బుకింగ్స్ ద్వారా రూ. 60,000 కోట్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్, వెడ్డింగ్ ప్లానింగ్ సేవల ద్వారా రూ. 37,500 కోట్ల వ్యాపారం జరగనుందని నివేదిక పేర్కొంది. సామాన్య కుటుంబాల్లో జరిగే పెళ్లిళ్లకు సగటున రూ. 4 నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుండగా, సంపన్న వర్గాలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్‌లో ఈ ఖర్చు రూ. 4 నుంచి 5 కోట్లు, అంతకంటే ఎక్కువగా ఉంటోంది.
ఈ పెళ్లిళ్ల సీజన్ కేవలం బడా వ్యాపారులకే కాకుండా, సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి కూడా భారీగా ఉపాధి కల్పిస్తుందని చెబుతున్నారు. ఈ 25 రోజుల సీజన్‌లో దేశవ్యాప్తంగా సుమారు 1.25 కోట్ల తాత్కాలిక, సీజనల్, పార్ట్-టైమ్ ఉద్యోగాలు లభిస్తాయని సీఏఐటీ వెల్లడించింది. జ్యువెలరీ, వస్త్ర వ్యాపారులు, చేనేత కార్మికులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, హస్తకళాకారులతో పాటు హోటళ్లు, క్యాటరర్లు, వంట మాస్టర్లు, పండ్లు, కూరగాయలు, పూల సాగు చేసే రైతులు, టెంట్ హౌస్ నిర్వాహకులు, డెకరేటర్లు, లైటింగ్, సౌండ్ టెక్నీషియన్లు, ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, బ్యూటీషియన్లు, సంగీత కళాకారులకు చేతినిండా పని దొరుకుతుంది.
దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలలో వెడ్డింగ్ ఎకానమీకి అతిపెద్ద కేంద్రంగా నిలవనున్నాయి. ఒక్క ఢిల్లీ-NCR ప్రాంతంలోనే సుమారు 5 లక్షల వివాహాలు జరగనుండగా, తద్వారా రూ. 2.50 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ఢిల్లీలో చాందినీ చౌక్, కరోల్ బాగ్, సదర్ బజార్, లజపత్ నగర్ వంటి ప్రముఖ హోల్‌సేల్ మార్కెట్లు పొరుగు రాష్ట్రాల వ్యాపారులు, వినియోగదారుల కొనుగోళ్లతో కిటకిటలాడనున్నాయి. మరోవైపు ప్రస్తుతం 'వోకల్ ఫర్ లోకల్' ట్రెండ్ నడుస్తోందని అంటున్నారు. అంటే స్వదేశీ ఉత్పత్తుల వినియోగం బాగా పెరిగిందని, విదేశీ బ్రాండ్లు, దిగుమతి చేసుకున్న అలంకరణ వస్తువుల స్థానంలో భారతీయ చేనేత వస్త్రాలు, స్థానిక కళాకారులు తయారు చేసిన హస్తకళాఖండాలకు కుటుంబాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.