మమతతో దీప్కే భేటీ....తెలుగు నాట కూడా సీజేపీ ?
ఇదిలా ఉంటే సీజేపీ ఇటీవల చేపట్టిన ఆందోళనలకు ఇండియా కూటమి పార్టీలతో పాటు దేశంలో తటస్థ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి.
సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే తన వ్యూహాన్ని మార్చారు. సీజేపీ అంటే యువ సమూహంగా ఉంటూ వస్తున్న నేపథ్యంలో రాజకీయ నేతలను కూడా కలసి మరింత మద్దతుని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తొలుత కలిసింది పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని. ఆమెతో దీప్కే సమావేశం అయి వర్తమాన రాజకీయాల గురించి చర్చించారు. యువత చేపట్టిన ఉద్యమాలకు మమత మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు చెప్పామని ఆయన అంటున్నారు. ఓట్ల చోరీ మీద విపక్షాలు తలపెట్టిన ర్యాలీకి ఆయనా సంఘీభావం ప్రకటించారు. అలాగే ఓట్ల చోరీ అంశం మీద సీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని కూడా స్పష్టం చేశారు.
అందరినీ కలుస్తారా :
ఇదిలా ఉంటే సీజేపీ ఇటీవల చేపట్టిన ఆందోళనలకు ఇండియా కూటమి పార్టీలతో పాటు దేశంలో తటస్థ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. ఈ క్రమంలో దీప్కే మొదట మమతను కలిసారు. మిగిలిన వారిని కూడా ఆయన కలుస్తారా అన్న చర్చ ఇపుడు సాగుతోంది. తెలుగు నాట చూస్తే తెలంగాణా నుంచి బీఆర్ఎస్ అలాగే ఏపీ నుంచి వైసీపీ కూడా సీజేపీకి మద్దతుగా నిలిచాయి. అంతే కాదు, సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సమయంలోనూ ఆ పార్టీలు ట్వీట్లు చేసి అండగా నిలిచాయి. దానికి ప్రతిస్పందనగా దీప్కే కూడా ట్వీట్ చేసి మరీ థాంక్స్ చెప్పారు. ఇపుడు ఆయన వరసబెట్టి తమకు మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీల అధినేతలను కలుస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తెలుగు రాష్ట్రాలలో పార్టీల అధినేతలను కూడా కలుస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది.
జగన్ నోట కాక్రోచ్ :
ఇటీవల కాలంలో అంటే గత నాలుగైదు నెలలుగా జగన్ నోట కాక్రోచ్ అన్న మాట పదే పదే వినిపిస్తోంది. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ ఉద్యమం చేపట్టిన దగ్గర నుంచి ఆయన కాక్రోచ్ అని గట్టిగానే చెబుతూ వస్తున్నారు. ఇక సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలను పోలీసులు అరెస్టు చేసినపుడు కూడా ట్వీట్ చేస్తూ ఇది అన్యాయం అని కూడా చెప్పారు. మరి అభిజిత్ దీప్కే కనుక రానున్న రోజులలో కలిసే నేతలలో జగన్ కూడా ఉన్నారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే జగన్ పాలకుల తీరు మీద ఆగ్రహంతోనే కాక్రోచులు పుట్టుకుని వస్తాయని విమర్శిస్తున్నారు. తాజాగా పులివెందులలో మునిసిపల్ ఎన్నికల సందర్భంగా కూడా ఆయన ఇదే మాట అన్నారు. మరి కాక్రోచ్ అంటూ చెబుతున్న జగన్ ని సీజేపీ నేతలు కలిస్తే రాజకీయాల్లో అది సంచలనమే అవుతుందని అంటున్నారు.
తటస్థంగానే :
అయితే రాజకీయ పార్టీల నేతలను కలసినా తమ పంధా స్వతంత్ర్యంగా తటస్థంగా ఉంటుందని అభిజిత్ దీప్కే చెబుతున్నారు. కానీ సీజేపీ చేపట్టే ఉద్యమాలకు విపక్ష రాజకీయ పార్టీలు అలాగే ఆ పార్టీలకు సీజేపీ మద్దతు కొనసాగుతుందని తెలుస్తోంది. మరో వైపు చూస్తే జెన్ జీ యూత్ సపోర్ట్ కోసం సీజేపీకి విపక్షాలు మద్దతు ఇస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో సీజేపీ నాయకుడు దీప్కే కలిసే నేతలను బట్టి సీజేపీతో వారికి ఉన్న బంధం మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.