తమిళనాడు నుంచి భవిష్యత్తు ప్రధాని....ఆ లోటు తీరుతుందా ?

ఇక తమిళనాడు నుంచి ప్రధాని చాన్స్ ఎందుకు రాలేదు అంటే అక్కడ గత అరవై ఏళ్ళుగా ప్రాంతీయ పార్టీలే రాజ్యం చేశాయి. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండూ అక్కడ లేవు.

Update: 2026-11-01 03:35 GMT

ఈ దేశానికి భవిష్యత్తులో తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రధాని వస్తారు అని తమిళనాడుకు చెందిన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజా పర్యటనలో ఈ కామెంట్స్ ఇపుడు ఆసక్తిని గొలుపుతున్నాయి. ఇంతకీ ఆయన ఏ సందర్భంలో ఈ కామెంట్స్ చేశారు అన్నది చూస్తే మదురైలో జరిగిన మీడియా సమావేశంలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఈ విధంగా అన్నారు. అంతే కాదు తమిళనాడు నుంచి ప్రధాని రావాలన్న తన ఆకాంక్షను కూడా వ్యక్తం చేశారు.

ఇప్పటిదాకా లేరు :

ఇక ఈ దేశంలో ఎందరో ప్రధానులు అయ్యారు. అందులో ఎక్కువ శాతం ఉత్తర ప్రదేశ్ నుంచే వచ్చారు. అలాగే మహారాష్ట్ర నుంచి మొరార్జీ దేశాయ్ అయ్యారు. గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ అయ్యారు. దక్షిణాదికి వస్తే ఉమ్మడి ఏపీ నుంచి పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. కర్ణాటక నుంచి దేవేగౌడ కూడా ప్రధానిగా పనిచేశారు. అయితే తమిళనాడుకు మాత్రం ఆ లోటు ఉంది. అందుకే ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆ రాష్ట్ర వాసిగా జనం మనోగతానికి అనుగుణంగా ఈ కామెంట్స్ చేశారు అని అంటున్నారు. భారత ప్రజాస్వామ్యంలో ప్రతీ పౌరుడికి ప్రధాని అయ్యే అవకాశం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు.

భవిష్యత్తులో అంటే :

ఇక తమిళనాడు నుంచి ప్రధాని చాన్స్ ఎందుకు రాలేదు అంటే అక్కడ గత అరవై ఏళ్ళుగా ప్రాంతీయ పార్టీలే రాజ్యం చేశాయి. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండూ అక్కడ లేవు. జాతీయ పార్టీ నుంచే నేతలకు ఎక్కువ ప్రధాని అయ్యే చాన్స్ ఉంటుంది. బహుశా భవిష్యత్తులో ప్రధాని అయ్యే అవకాశం తమిళనాడుకు అని రాధాక్రిష్ణన్ అన్నారు అంటే అది కూడా ఆలోచించాల్సిందే. మరి రేపటి రోజున జాతీయ పార్టీగా బీజేపీ అక్కడ పుంజుకుంటే కనుక మరో పదేళ్ళకు అయినా ప్రధాని రేసులో ఎవరైనా ఉండే చాన్స్ దక్కుతుందేమో చూడాలి.

ముగ్గురు రాష్ట్రపతులు :

అయితే తమిళనాడు మరో విషయంలో రికార్డునే సృష్టించింది. తమిళనాడు నుంచి ముగ్గురు రాష్ట్రపతులు అయ్యారు. అలాగే మరో ముగ్గురు ఉప రాష్ట్రపతులు కూడా అయ్యారు. తొలి రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ అయితే ఆ తరువాత కాలంలో వెంకటరామన్ ఉప రాష్ట్రపతి రాష్ట్రపతి అయ్యారు. అలాగే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయితే సీపీ రాధాక్రిష్ణన్ ఉప రాష్ట్రపతి అయ్యారు. మరి ఈ రికార్డుని సొంతం చేసుకున్న తమిళనాడు భవిష్యత్తులో ప్రధాని పదవిని కూడా అందుకుంటుందేమో అన్న చర్చ కూడా సాగుతోంది. నిజానికి తమిళులు రాజకీయంగా చైతన్యవంతులు అయినప్పటికీ ప్రాంతీయ వాదానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు, బహుశా అది కూడా వారి ప్రధాని ఆకాంక్షలకు కొంత అడ్డంకిగా మారుతున్నదేమో అన్నది కూడా విశ్లేషణగా ఉంది మరి.

Tags:    

Similar News