ఖైరతాబాద్ లిట్మస్ టెస్ట్ : కేసీఆర్ వైపు తిరిగిన తెలంగాణా !
రాజకీయం ఎపుడూ ఒకేలా ఉండదు. అది మారుతూ ఉంటుంది. ప్రజాభిప్రాయం నిరంతరం గతులు మార్చుకుంటుంది.
రాజకీయం ఎపుడూ ఒకేలా ఉండదు. అది మారుతూ ఉంటుంది. ప్రజాభిప్రాయం నిరంతరం గతులు మార్చుకుంటుంది. 2023లో కేసీఆర్ ఓడిపోగానే ఆయన పని అయిపోయింది అని అన్న వారు ఉన్నారు. 2024 లో లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాలేదు, ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రెండు ఎమ్మెల్యే సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కానీ అది నిజం కాదని తాజాగా ఖైరతాబాద్ లో ఒక ప్రముఖ సర్వే సంస్థ ఆర్ఆర్ నిర్వహించిన దాంట్లో తేలింది. ఇందులో విశ్లేషణలు చూస్తే కనుక బీఆర్ఎస్ దే మరోసారి తెలంగాణాలో అధికారం అన్నది తేలుతోంది. లిట్మస్ టెస్ట్ గా రేపు జరగబోయే ఖైరతాబాద్ ఉప ఎన్నికల ఫలితం ఉండబోతోంది అని ఈ సర్వే స్పష్టం చేసింది.
తరువాత సీఎం ఆయనే :
ఖైరతాబాద్ ఉప ఎన్నికల గురించి జనాభిప్రాయాన్ని ఆర్ ఆర్ సర్వే చాలా లోతుల్లోకి వెళ్ళి రాబట్టింది. దానిలో కేసీఆర్ పాలన గురించి జనాలను ప్రశ్నించినపుడు అత్యధిక శాతం ఆయన హయాంలో బాగుంది అని చెప్పారు. అంతే కాదు 2028 లో జరిగే ఎన్నికల్లో సీఎం ఎవరు అంటే కేసీఆర్ అని ఏకంగా 53.84 శాతం మంది ఓటేశారు. ఇక ప్రస్తుతం సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డికి 20.87 శాతం మద్దతు తెలిపితే బీజేపీ ఫైర్ బ్రాండ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ తదుపరి సీఎం అంటూ కేవలం 14.30 మంది చెప్పారు. మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి 4.39 శాతం లభించింది. ఈ సర్వే ప్రకారం చూస్తే కనుక అందరి కంటే చాలా దూరంలోనే కేసీఆర్ నిలిచి తెలంగాణా ప్రజల అభిమానం అందుకున్నారు అని అర్ధం అవుతోంది.
ఉత్తమ పాలనగానూ :
అంతే కాదు కేసీఆర్ పరిపాలన ఉత్తమంగా ఉందని, అభివృద్ధి సంక్షేమం ఆయన హయాంలోనే బాగా జరిగాయని ఖైరతాబాద్ జనాలు బల్ల గుద్ది మరీ చెప్పారు. ఆర్ఆర్ సర్వే ప్రకారం చూస్తే రెండు సార్లు సీఎం గా చేసిన కేసీఆర్ కి మద్దతుగా 57.14 శాతం మంది నిలిచారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి రెండున్నరేళ్ళ పాలన బాగుందని 21.97 శాతం మంది మాత్రమే మద్దతు ఇవ్వడం విశేషం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తాము చెప్పుకుంటున్నట్లుగా తెలంగాణాలో అభివృద్ధి సంక్షేమం పట్ల జనం అంత సంతృప్తిగా లేరు అన్నది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఒక కీలక నియోజకవర్గం. రాజకీయంగా చైతన్యవంతమైన ఖైరతాబాద్ లో ఓటర్ల మనోభావాలు తెలియచేశాయని అంటున్నారు.
ఎన్నికల హామీల అమలులో :
అంతే కాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఎన్నికల హామీల అమలుతో సక్రమంగా పనిచేసింది అని ఆర్ఆర్ సర్వే ప్రకారం జనాలు కితాబు ఇస్తున్నారు. బీఆర్ ఎస్ సర్కార్ ఇచ్చిన మాట మేరకు హామీలు నెరవేర్చింది అని 54.94 శాతం మంది చెబుతూ జై కొట్టారు. అదే కాంగ్రెస్ ఎన్నికల హామీల విషయంలో అంత కచ్చితంగా అమలు చేయడం లేదన్న భావనలో జనాలు ఉన్నారనడానికి ఆ పార్టీకి 19.78 శాతం ప్రజల మద్దతు దక్కడం ఒక ఉదాహరణగా చూడాలని అంటున్నారు.
కేసీఆర్ రాకుండానే :
లిట్మస్ టెస్ట్ అంటే అన్నంలో ఒక మెతుకుని పట్టడం లాంటిది. ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు జరగలేదు. జనం మూడ్ ఇదీ అని ఆర్ఆర్ సర్వే తన నివేదిక బయటపెట్టింది. దాని ప్రకారం చూస్తే అక్కడ ఉప ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ అభ్యర్ధి గెలుస్తారు అని 36.89 శాతం ఓటు షేర్ దక్కుతుందని ఈ సర్వే వెల్లడిస్తోంది. అదే కాంగ్రెస్ కి 34.78 శాతం ఓటు షేర్ దక్కి రెండో ప్లేస్ లో ఉంటుందని తేటతెల్లం చేసింది. ఇవన్నీ పక్కన పెడితే గత రెండున్నరేళ్ల బట్టి కేసీఆర్ అయితే జనంలో లేరు, ఆయన పెద్దగా సభలు సమావేశాలు కూడా నిర్వహించలేదు. కానీ ఆయన తదుపరి సీఎం అని జనాలు అంటున్నారు. అలాగే బీఆర్ ఎస్ హామీలు బాగా నెరవేర్చింది అని సమర్ధిస్తున్నారు.
సరికొత్త రాజకీయ సరళిగా :
బీఆర్ఎస్ పాలన బెస్ట్ అని ప్రశంసిస్తున్నారు. మరి ఎన్నికల ముందు కనుక కేసీఅర్ జనంలోకి వచ్చి ప్రచారం చేస్తే ఇంకా ఈ సానుకూలత పెరుగుతుందని అంటున్నారు. ఏది ఏమైనా ఆర్ ఆర్ సర్వే అయితే జనం నాడిని పట్టుకుంది అని అంటున్నారు. అధికార పార్టీలకు యాంటీ ఇంకెంబెన్సీ అన్నది పెరగడం ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఒక సరికొత్త రాజకీయ సరళిగా ఉంది. ఒక అయిదేళ్లకు మాత్రమే ప్రభుత్వాన్ని జనాలు ఎన్నుకుంటున్నారు. రెండోసారి చాన్స్ ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు, అది తమిళనాడులో ఇటీవల ఎన్నికల్లో వెల్లడైంది. ఏపీలో వరుస మూడు ఎన్నికల్లో అలాగే జరిగింది. రేపటి ఎన్నికల్లో తెలంగాణాలో అదే జరుగుతుందా అంటే ఆర్ఆర్ సర్వే ప్రకారం చూస్తే అవును అన్న మాట వస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.