పులి అడవి బాట.. ఖర్చు తడిసి మోపెడు

తూర్పు గోదావరి జిల్లాలో ఒక పెద్ద పులి పెట్టిన టెన్షన్ అంతా ఇంతా కాదు, టీవీలు మీడియాతో పాటు సోషల్ మీడియాలో టాప్ న్యూస్ గా మారి హడలెత్తించిన ఈ పులి కోసం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే అప్రమత్తం అయింది.

Update: 2026-10-15 16:58 GMT

తూర్పు గోదావరి జిల్లాలో ఒక పెద్ద పులి పెట్టిన టెన్షన్ అంతా ఇంతా కాదు, టీవీలు మీడియాతో పాటు సోషల్ మీడియాలో టాప్ న్యూస్ గా మారి హడలెత్తించిన ఈ పులి కోసం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే అప్రమత్తం అయింది. ఎన్ని చేయాలో అన్నీ చేసింది. జనాలు ఆ పులి బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. పులిని ఎలా పట్టి బంధించాలో అన్న దాని మీద ఒక పెద్ద రెస్క్యూ ఆపరేషన్ నే చేపట్టింది. దాని కోసం అటవీశాఖ ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు లక్షలలోనే ఉంది అని అంటున్నారు. తీరా చూస్తే ఏ ఆపరేషన్ కి దక్కకుండా చిక్కకుండా ఆ పులి తాపీగా అడవి బాట పట్టినట్లుగా తెలుస్తోంది. దాంతో పులి కోసం పెట్టిన ఖర్చు, దాని బిల్లుల గురించి అసలైన టెన్షన్ పడుతూ అటవీ శాఖ అధికార యంత్రాంగం ఉంది అని అంటున్నారు.

యమ టెన్షన్ పెట్టి :

తూర్పు గోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం గత కొన్ని రోజులుగా స్థానిక ప్రజలనే కాదు, అటవీ శాఖ అధికారులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పగటిపూట పొలాలలో కనిపించింది. అక్కడ నుంచి క్వారీల్లో విశ్రాంతి తీసుకుంటూ రాత్రి వేళల్లో ఈ పులి గ్రామాల వైపుగా వచ్చి వణికించింది. దీంతో ఈ జిల్లాలో అనేక మండలాలు గ్రామాలు పులి తాకిడితో తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఆయా గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి కదలికలను కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు మరో సందర్భంలో పశువులపై దాడులను చేసి పులి భయపెట్టేసింది.

భారీ బడ్జెట్ తోనే :

తూర్పు గోదావరి జిల్లాలో సంచరించిన పెద్ద పులి ఏకంగా 15 రోజుల పాటు అక్కడే ఉంది. దాని ఆనవాళ్ళను తెలుసుకుని బంధించేందుకు అటవీశాఖ చేయని ప్రయత్నం లేదు అటవీ అధికారులు డ్రోన్ కెమెరాలు, జీపీఎస్ ట్రాకర్లు నైట్ విజన్ కెమెరాల సాయంతో పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు. పులిని సురక్షితంగా బంధించడానికి పూణే నుండి వచ్చిన ప్రత్యేక రెస్క్యూ బృందాలతో పాటు నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ బృందాలు రంగంలోకి దిగాయి. అలాగే మత్తు ఇంజెక్షన్లు బోన్లు కూడా సమకూర్చుకుని ఆపరేషన్ సాగించారు. పూణె నుంచి వచ్చిన నిపుణులకు వారికి వసతి సదుపాయంతో పాటు పులిని గురించేందుకు డ్రోన్లు, వాహనాలకు ఇంధనం, సిబ్బంది కోసం చేసిన ఖర్చు చూస్తే చాలా ఎక్కువగానే ఉంది మరి. అయితే ఇవన్నీ వృధా ప్రయాసగానే మిగిలాయి. ఎందుకంటే ఆ పెద్ద పులి హ్యాపీగా అడవుల్లోకి పోయింది. దాంతో ఈ నిధులు అన్నీ వృధాగా పోయాయని స్థానికులు చర్చిస్తున్నారు.

చెలగాటమే ఆడింది :

పెద్ద పులి అది. జనారణ్యంలోకి దిగబడి సంచరిస్తూంటే ఎవరికైనా టెన్షన్ గానే ఉంటుంది. జరగరానిది జరిగితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే ప్రభుత్వం అయితే సీరియస్ గానే తీసుకుని రంగంలోకి దిగింది. అయితే అందరితో చెలగాటం ఆడిన ఈ పెద్ద పులి ఏమనుకుందో ఏమో పీఛేముడ్ అంటూ వెనక్కి పోయి అడవులే బెటర్ అనుకుంది. ఖర్చు వృధాగా పోయింది అన్నది స్థానికుల విమర్శలుగా ఉన్నా ఒకవేళ ఆ పులి అక్కడే ఉంటే వచ్చే ముప్పు కూడా ఆలోచించాలి కదా అన్న మాట కూడా డిపార్ట్మెంట్ నుంచి వస్తోంది. మొత్తానికి పెద్ద పులా మజాకా అన్నట్లుగా దాని ఎపిసోడ్ అయితే ఇపుడు స్టోరీస్ గా చెప్పుకుంటున్నారు.

Tags:    

Similar News