ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

అమెరికా రాజకీయాలన్నా.. అక్కడ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మాట్లాడే మాటలన్నా ఒక వింతైన డ్రామా గుర్తురాక మానదు.

Update: 2026-11-02 07:05 GMT

అమెరికా రాజకీయాలన్నా.. అక్కడ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మాట్లాడే మాటలన్నా ఒక వింతైన డ్రామా గుర్తురాక మానదు. త్వరలో జరగబోయే మధ్యంతర ఎన్నికల వేళ ఆయన మరోసారి తనదైన శైలిలో పొలిటికల్ సెన్సేషన్ సృష్టించారు. ఒకవేళ పొరపాటున లేదా గ్రహచారం బాగోక డెమోక్రాట్లు మధ్యంతర ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్‌పై జెండా పాతేస్తే ఏమవుతుంది? అనే ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వాషింగ్టన్ వర్గాల్లో నవ్వులతో పాటు చర్చకూ దారితీస్తోంది.

మిరాండా డివైన్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్.. ఒకవేళ డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తే తాను అస్సలు తగ్గనని.. ప్రెసిడెంట్ వీటో పవర్‌తో చెలరేగిపోతానని తేల్చిచెప్పారు. అంటే మధ్యంతర ఎన్నికల్లో తాను ఓడిపోతానని.. రిపబ్లికన్లు ఓటమి చెందడం ఖాయమని ట్రంప్ నకు జ్ఞానోదయం అయ్యిందన్న మాట..అందుకే డెమోక్రాట్లు పంపే ప్రతి బిల్లునూ ఆమోదించకుండా ‘డిజైనింగ్’ సైన్‌తో రిజెక్ట్ చేస్తూ ‘మిస్టర్ వీటో’గా మారిపోతానని ప్రకటించారు. ‘వారు ఉత్సాహంగా బిల్లులు పంపిస్తుంటారు.. నేను ఒకటికి రెండు నెలలు వరుసగా వాటిని వీటో చేస్తుంటాను. పాపం ఆ తిరస్కరణలు చూసి చూసి వాళ్లకే విసుగొస్తుంది.. అప్పుడు దారికి వచ్చి నాతో రాజీ పడతారు. చివరికి డీల్ నా దగ్గరకే వస్తుంది’ అంటూ ట్రంప్ వేసిన పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ విని విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. చట్టసభలను నడిపించడం అంటే పిల్లలాట అనుకుంటున్నారా ఏంటి బాస్? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఇక 2028 అధ్యక్ష ఎన్నికల గురించి మాట్లాడేటప్పుడు ఆయనలోని అసలైన ఔత్సాహిక రాజకీయ నాయకుడు బయటికొచ్చాడు. వీలైతే 2028లోనూ పోటీ చేయాలని ఉందంటూ మనసులో కోరిక బయటపెట్టారు. అయితే అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ‘రెండుసార్లకు మించి కుదరదు తండ్రీ’ అని ముందే రాసి పెట్టిందని ఆయనకు కూడా తెలుసు. అయినా సరే ‘చూద్దాం.. రాజ్యాంగం ఉందిగా’ అంటూ ఆయన ఇచ్చిన లీక్ చూస్తుంటే 2028 నాటికి కొత్త ట్విస్టులు ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు.. సెనేట్‌లో మూడో వంతు స్థానాలకు జరగనున్న ఈ మధ్యంతర ఎన్నికలు వైట్‌హౌస్‌కు, కాంగ్రెస్‌కు మధ్య పెను సమరానికి వేదిక కానున్నాయి. డెమోక్రాట్లు గెలిచినా ట్రంప్ వీటోలను దాటాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. కాబట్టి ఎన్నికలు ముగిశాక వైట్‌హౌస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య జరగబోయే ఈ ‘వీటో గేమ్‌’ ప్రేక్షకులకు కావాల్సినంత పొలిటికల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది..

Tags:    

Similar News