తరగతి గదిలోనే రాక్షసత్వం : పదోతరగతి విద్యార్థినిపై పాశవిక దాడి
అనంతపురం జిల్లా రాప్తాడులో ఘోరం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువున్న విద్యార్థినిపై పాశవిక దాడి జరిగింది.
అనంతపురం జిల్లా రాప్తాడులో ఘోరం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువున్న విద్యార్థినిపై పాశవిక దాడి జరిగింది. చెట్లు నరికేందుకు ఉపయోగించిన రంపంతో విద్యార్థిని తలపై ఉన్మాది దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్లంబింగ్ పనులు చేసే పేరుతో పాఠశాలలోకి ప్రవేశించిన దుండగుడు నేరుగా క్లాసురూములోకి వెళ్లి విద్యార్థినిపై దాడి చేసినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ పరిణామంతో హతాశులైన విద్యార్థినులు వెంటనే దుండగుడిని ఆపేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. దాడిలో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. అడ్డుకునే ప్రయత్నంలో మరో విద్యార్థినికి గాయాలు అయినట్లు చెబుతున్నారు. నిందితుడు బాలికకు సమీప బంధువు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పదో తరగతి గదిలో విద్యార్థినిపై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. యథావిధిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థిని క్లాసురూములో ఉండగా దుండగుడు ప్రవేశించి దాడి చేసినట్లు చెబుతున్నారు. రంపంతో విద్యార్థినిపై అత్యంత పాశవికంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. రక్తపు మడుగులో ఉన్న బాలికను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం నిందితుడు రంపంను అక్కడే వదిలేసి పరారయ్యాడు. పోలీసులు నిందితుడు కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్థిని అనంతపురం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోందని అంటున్నారు. దాడిలో బాలిక ముఖం, తల, వీపుపై తీవ్ర గాయాలు అయినట్లు వైద్యులు తెలియజేశారు.
ఆ రాక్షసుడు దగ్గర బంధువేనా?
విద్యార్థినిపై దాడి చేసిన దుండగుడు సమీప బంధువుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు చెబుతున్నారు. నిందితుడు ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. అతడి కోసం రాప్తాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. చెట్టుకొమ్ములు కోసే రంపాన్ని వెంట బెట్టుకుని స్కూల్ లోకి ప్రవేశించిన దుండగుడు, తరగతి గదిలోకి వెళ్లే ముందు దాన్ని ఆన్ చేసి వెళ్లాడని, ఒక్క ఊదుటన విద్యార్థిని వద్దకు చేరుకుని దాడి చేశాడని చెబుతున్నారు. ఈ హఠాత్ పరిణామంతో టీచర్ తోపాటు పిల్లలు భయాందోళనతో పరుగులు తీశారని అంటున్నారు. కొందరు దుండగుడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, రంపం అక్కడే వదిలేసి పారిపోయినట్లుగా చెబుతున్నారు.
భద్రత చర్యలపై ప్రశ్నలు
రాప్తాడు ఘటన ప్రభుత్వ పాఠశాలల్లో రక్షణ చర్యలను ప్రశ్నార్థకం చేసిందని అంటున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు చదవే పాఠశాలల్లో భద్రత పెంచాల్సిన అవసరం ఉందని అంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లో సెక్యూరిటీ, వాచ్ మన్ వంటి పోస్టులు లేకపోవడంతో ఇలాంటి ఘటనలకు ఆస్కారం కలుగుతోందని అంటున్నారు. ఈవ్ టీజింగ్ వంటి ఘటనల నేపథ్యంలో పాఠశాలల సమయంలో ఆరు బయట పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. కానీ, పాఠశాలల లోపల ఎటువంటి భద్రత లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు చెబుతున్నారు.
సీఎం దిగ్భ్రాంతి
విద్యార్థినిపై దాడి ఘటన తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఫోన్ చేసి వెంటనే అనంతపురం ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఆమెకు ఫోన్ చేసి బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ఓదార్చారు. ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి అనిత కూడా ఘటనపై స్పందించారు. 'చిన్నారి చెల్లిని క్లాస్‌రూమ్‌లో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు. గుండె బరువెక్కింది. ఉన్మాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తాం. ఆడపిల్లల వైపు చూడాలంటేనే భయపడేలా చేస్తాం' అని హెచ్చరిస్తూ ఎక్స్ లో మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.