మన ఆంధ్రా ఇక బంగారం...వెరీ గుడ్ న్యూస్ !

బంగారం మీద మోజు లేనిది ఎవరికి అన్న ప్రశ్నకు జవాబు అయితే ఉండదు. ఎందుకంటే బంగారం అంటే అంత ఇష్టం మన వాళ్ళకు. అది సెంటిమెంట్. అది ఆధ్యాత్మికత.

Update: 2026-06-21 04:58 GMT

బంగారం మీద మోజు లేనిది ఎవరికి అన్న ప్రశ్నకు జవాబు అయితే ఉండదు. ఎందుకంటే బంగారం అంటే అంత ఇష్టం మన వాళ్ళకు. అది సెంటిమెంట్. అది ఆధ్యాత్మికత. అది పెట్టుబడి, అది భద్రత, అదే భవిత. ఇలా బంగారం గురించి చెప్పుకోవాలంటే ఎంతో ఉంది. మన భారతీయులకు బంగారం తో ఉన్న బంధం బహు గట్టిది. అది తరతరాల నుంచి ఉన్నది. ఎంత తరగని నిధులు ఉన్నా బంగారం ఇంకా కావాలనే అనిపిస్తుంది. అందుకే బంగారం రేటు కొండెక్కి పోతున్నా కూడా జనం మాత్రం ఆ వైపుగానే చూస్తున్నారు.

దిగుమతి చేసుకోవాల్సిందే :

బంగారం గనులు అయితే మన దగ్గర పెద్దగా లేవు. దాంతో ఏటా ఏకంగా ఎనిమిది వందల టన్నుల బంగారాన్ని భారత దేశం దిగుమతి చేసుకుంటుంది అని ఒక లెక్క ఉంది. ఇది మన జీవితాలను నడిపే ఇంధన దిగుమతులతో పోటీ పడే స్థాయిలో ఉంది. చమురు ఉంటే దేశం మొత్తం కదులుతుంది. ఆర్ధిక వ్యవస్థకు బలం చేకూరుతుంది. కానీ బంగారం దిగుమతి చేసుకుంటే అది ఇంట్లోనో వంట్లోనో పడి ఉంటుంది. డెడ్ క్యాపిటల్ అని ఆర్ధిక నిపుణులు అంటారు. అయినా సరే బంగారం కొనుగోళ్ళు మనవాళ్ళు ఆపరంటే ఆపరు అని కూడా చెబుతారు. ఈ మధ్యనే ప్రధాని నరేంద్ర మోడీ బంగారం కొనుగోలు ఒక ఏడాది వాయిదా వేసుకోవాలని జనాలకు సూచించారు. మరి దానిని ఎంత మంది పాటిస్తున్నారు అన్నది కూడా చర్చగానే ఉంది.

ఏపీలో భారీగా బంగారం :

ఇవన్నీ పక్కన పెడితే అసలైన గుడ్ న్యూస్ ఏంటి అంటే మన రాష్ట్రం అదే మన ఏపీలో భారీగా బంగారు నిల్వలు ఉన్నట్లుగా ప్రభుత్వం కనుగొంది. నిజంగా ఇది ఎగిరి గంతేసే వార్తగానే చూడాలని అంటున్నారు. బంగారం దిగుమతి చేసుకుని మరీ భారీ రేట్లకు కొనుగోలు చేసుకునే మోజున్న మనకు పక్కనే బంగారం గనులు ఉన్నాయంటే మహా సంబరమే అని అంటున్నారు. ఇంతకీ ఈ బంగారం గనులు ఎక్కడ ఉన్నాయంటే ఏపీలోని కర్నూలు జిల్లా జొన్నగిరిలో భారీగా బంగారు నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అని అంటున్నారు. ఈ జిల్లాలోని జొన్నగిరి, రామగిరి, జవ్వకుల, చిగురుకుంట బిస్నాతం అనే నాలుగు ప్రాంతాలలో బంగారం తవ్వకాలకు అనుకూలమైన అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు చెబుతున్నారు.

అక్కడే యాభై టన్నులు :

అంతే కాదు కేవలం జొన్నగిరిలోనే 50 టన్నుల బంగారం అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు అంటే అంతకంటే ఆనందం ఏముంది అని అనుకోవాల్సిందే. మరి ఈ బంగారం గనులు గుర్తించిన నేపధ్యంలో ఏపీ రాబోయే రోజులలో బంగారం అని వేరేగా చెప్పాల్సిన పని అయితే లేదని అంటున్నారు. అంతే కాదు ఏకంగా దేశానికే రానున్న కాలంలో ఏపీ అత్యధికంగా బంగారాన్ని అందించే రాష్ట్రంగా అగ్రపీఠం అందుకుంటుందని కూడా చెబుతున్నారు. మొత్తానికి ఈ బంగారం గనుల మూలంగా ఏపీ దశ దిశ కూడా మారనుందని చంద్రబాబు తరచూ చెప్పే స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా ఇక మీదట పిలవబడడం ఖాయమని అంతా చెబుతున్నారు. సో ఏపీ అంటే గోల్డ్ అనాల్సిందేగా మరి.

Tags:    

Similar News