వరుణ కరుణ కోసం... రేవంత్ ఆధ్యాత్మికత మార్గం
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహా వరుణ యాగాన్ని తలపెట్టారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రకృతి కరుణ కోసం ఈ యాగం నిర్వహిస్తున్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహా వరుణ యాగాన్ని తలపెట్టారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రకృతి కరుణ కోసం ఈ యాగం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పీద ఎత్తున వానలు కురియాలని అలాగే చెరువులు, గుంటలు ఇతర జలాశయాలు పూర్తిగా నిండాలని కోరుకుంటూ ఈ యాగాన్ని తెలంగాణా ప్రభుత్వం తలపెట్టింది. ఆధ్యాత్మిక మార్గాన్ని ఈ విధంగా ఎంచుకుంది. దాంతో ఈ మహా వరుణ యాగానికి ఎంతో విశిష్టత ఏర్పడింది. ఈ నెల 10న నాగార్జున సాగరం తీరంలో జరిగే ఈ మహా వరుణ యాగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరవుతున్నారు.
భారీ ఆకాంక్షతో :
తెలంగాణా అంతటా విస్తారంగా వర్షాలు కురియాలని కోరుతూ నిర్వహిస్తున్న ఈ యాగం ఏకంగా 108 మంది వేద పండితులు అలాగే 11 హోమ గుండాలతో సర్వశాస్త్రోక్తంగా పదునాలుగు హోమ గుండాలతో జరగనుంది. కృష్ణా గోదావరి నదులతో పాటుగా తెలంగాణ లో కట్టిన డ్యాములు అన్నీ కూడా పూర్తిగా నీటితో నిండాలని కూడా కోరుకుంటూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇపుడు దేశంలోని 12 రాష్ట్రాలలో ఎల్ నినో ప్రభావం ఉంది. తెలంగాణాలో కూడా అలాంటి వర్షాభావ పరిస్థితులే కొనసాగుతున్నాయి. దీంతో ప్రకృతి కరుణ కోరుకుంటూ ఈ యాగాన్ని సంకల్పించినట్లుగా తెలుస్తోంది. తాగు సాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా వరుణ దేవుడికి ప్రార్థనలు చేస్తూ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యాగం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణం వేదికగా చేసుకుని సాగుతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ప్రస్తుతం ఎంతో జోరుగా సాగుతున్నాయి.
రెండు శాఖల కో ఆర్డినేషన్ :
ఈ మహా వరుణ యాగం రెండు శాకల కో ఆర్డినేషన్ తో జరుగుతోంది. దేవాదాయ శాఖ అలాగే నీటి పారుదల శాఖ కలసి తలపెట్టిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం గురించి అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. గతంలో వరుణుడి కరుణ కోసం ఈ తరహా యాగాలు ఎన్నో చేపట్టారు. ఫలితాలు కూడా అనుకూలంగా వచ్చాయి. వర్తమానంలో కూడా ఎన్ని శాస్త్ర సాంకేతిక విధానాలు అమలులోకి వచ్చినా ఆధ్యాత్మికతను ఆసరాగా చేసుకుని ప్రకృతి కరుణ కోసం ప్రార్ధించడం కూడా ఒక ఉత్తమ సంప్రదాయంగా మారింది. గతంలో చాలా మంది ఇలాగే ఆచరించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో పయనించడం విశేషం. దీంతో వానల కోసం అల్లాడుతున్న రైతాంగం సామాన్య ప్రజలు కూడా మహా వరుణ యాగ ఫలితాలు సానుకూలంగా రావాలని ప్రార్థిస్తున్నారు.