సౌండ్ పెంచిన వైసీపీ...ఈక్వేషన్స్ చేంజ్ !

ఏపీలో ఒకే సౌండ్ ఉంటుంది అన్నది ఒక ఘాటు విమర్శ. దేశమంతా ఏమి జరిగినా ఏపీలో మాత్రం పట్టదు. ఏపీలో అంతా ఒక్కటే రాజకీయ విధానంగా ఉంటాయి.

Update: 2026-09-27 01:30 GMT

ఏపీలో ఒకే సౌండ్ ఉంటుంది అన్నది ఒక ఘాటు విమర్శ. దేశమంతా ఏమి జరిగినా ఏపీలో మాత్రం పట్టదు. ఏపీలో అంతా ఒక్కటే రాజకీయ విధానంగా ఉంటాయి. అది అధికార కూటమి అయినా లేదా ప్రతిపక్ష వైసీపీ అయినా అంతే సంగతులు అన్నట్లుగా బయట నుంచి కానీ ఏపీ నుంచి కానీ విమర్శలు అనేకం వచ్చాయి. ఎన్డీయేకి కొంత మంత్రి ప్రత్యక్ష మిత్రులు అయితే మరి కొంతమంది పరోక్ష మిత్రులు అందుకే కేంద్రానికి వ్యతిరేకంగా ఎలాంటి సౌండ్ ఉండదని కూడా సెటైర్లు పడుతూ ఉండేవి. అలాంటిది ఇపుడు ఏపీలో ఒక భిన్న రాజకీయ వాతావరణం ఏర్పడుతోంది. వైసీపీ అయితే సీఈసీ ఇష్యూలో బాహాటంగానే గళం విప్పుతోంది. ఒక విధంగా బిగ్ సౌండ్ చేస్తోంది.

జగన్ డిమాండ్ అదే :

కేంద్ర ఎన్నికల సంఘంలో నియామకాల విషయంలో 2023లో చేసిన చట్టాన్ని సమీక్ష చేయాలని మార్పులు తీసుకుని రావాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా డిమాండ్ చేసిన సంగతి విధితమే. 2023లో సవరించిన చట్ట ప్రకారం చూస్తే కనుక ప్రధాని ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నామినేట్ చేసిన ఒక కేంద్ర కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఇందులో మెజారిటీ నిర్ణయం తీసుకోవాలంటే ప్రధాని కేంద్ర మంత్రి కలిస్తే సరిపోతుంది. అపుడు విపక్ష నేత అభిప్రాయం భిన్నంగా ఉన్నా అమలు కాదు, అయితే గతంలో ఉన్న విధానం ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు. దానివల్ల సహేతుకమైన నిర్ణయానికి ఆస్కారం ఉంటుంది అన్న భావన ఉంది. అందుకే 'కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం-2023 పున పరిశీలించాలని క్యాబినెట్ మంత్రి స్థానంలో తిరిగి భారత ప్రధాన న్యాయమూర్తి ని చేర్చి పారదర్శకతను కాపాడాలని జగన్ కోరారు. ఇది ఒక విధంగా బీజేపీ పెద్దలకు ఇరకాటం లాంటిదే అని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.

సీఈసీ రాజీనామా :

ఇపుడు మరో అడుగు ముందుకేసి వైసీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాధ్ అయితే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ బాధ్యతల నుంచి వెంటనే తప్పుకోవాలని ఆయన కోరారు. జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని శైలజానాథ్ ఆరోపించారు. దీంతో ఈసీ గౌరవం కూడా దెబ్బ తింటోంది అని ఆయన అన్నారు. దీంతో ఇండియా కూటమిలోని కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలు చేసిన డిమాండ్ నే వైసీపీ కూడా చేసినట్లు అయింది అంటున్నారు.

ఏపీ ఫలితాల మీద :

ఇక మరో మాట కూడా శైలజానాథ్ అన్నారు. ఏపీలో దాదాపుగా 49 లక్షల ఓట్లు రాకెట్ కంటే వేగంగా బ్యాలెట్ మిషన్ లోకి వెళ్ళిపోయాయి అని. దాని ఫల్లనే కూటమికి ఫలితాలు అనుకూలంగా వచ్చాయి అని. 2024లో జరిగిన పోలింగ్ మీద ఈసీ ప్రకటనలు సందేహాస్పదంగా ఉన్నాయని కూడా ఆయన ఆరోపించారు. పోలింగ్ రోజున రాత్రి రెండు గంటల వ్యవధిలో 15 లక్షల ఓట్లు ఎలా పోల్ అయ్యాయని ఆయన నిలదీశారు. ఈ విషయం మీద తమ పార్టీ అధినేత జగన్ అడిగినా ఈసీ జవాబు చెప్పలేదని శైలజానాథ్ మండిపడ్డారు.

వైసీపీ స్టాండ్ ఇదే :

ఏపీలో 2024లో జరిగిన పోలింగ్ తీరు వల్లనే తమకు అధికారం చేజారింది అని వైసీపీ ఇపుడు గట్టిగా చెబుతున్నట్లు అయింది. ఈసీ విధానాల మీద వైసీపీ ఇంత పెద్ద ఎత్తున విమర్శలు చేయడానికి ఇది ఒక కారణంగా ఉంది. మరో వైపు ఎన్డీయేకు పరోక్ష మద్దతు అని వైసీపీ మీద ఇంతకాలం ఉన్న నిందలకు ఇపుడు సరైన జవాబు ఇవ్వాలని ఆ పార్టీ ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది అంటున్నారు. అదే విధంగా జాతీయ స్థాయిలో సమీకరణల విషయంలో రాజకీయ విధానాలను వైసీపీ మార్చుకుంటున్నట్లుగా అర్ధం అవుతోంది అంటున్నారు. రానున్న రోజులలో వైసీపీ నుంచి మరింత స్పష్టత వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News