వ్యూహాలు స‌రే.. వైసీపీ అమ‌లు చేసేదెవ‌రు ..!

అయితే.. పైస్థాయిలో ఎన్ని వ్యూహాలు వేసినా.. క్షేత్ర‌స్థాయిలో అమలు చేసే వారు లేక‌పోతే.. ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయ‌న్న‌ది ప్ర‌శ్న‌.

Update: 2026-09-26 22:30 GMT

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ వ్యూహాలు సక్సెస్ అవుతాయా లేదా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత, ఈ స్థానిక పోరును వైసీపీ సవాల్‌గా తీసుకుంది. పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం నింపేందుకు, ఉనికిని చాటుకోవడానికి అధినేత జగన్ సరికొత్త వ్యూహాలను సిద్ధం చేశారు. అయితే.. పైస్థాయిలో ఎన్ని వ్యూహాలు వేసినా.. క్షేత్ర‌స్థాయిలో అమలు చేసే వారు లేక‌పోతే.. ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయ‌న్న‌ది ప్ర‌శ్న‌.

ప్రధాన వ్యూహాలు ఇవీ..

కమిట్‌మెంట్‌ ఉన్న వారికే టిక్కెట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. కేవలం ధనబలం మాత్రమే కాకుండా, క్లిష్ట సమయాల్లో కూడా పార్టీకి విధేయంగా ఉంటూ, కష్టపడి పనిచేసే ద్వితీయ శ్రేణి నాయకులకు, కేడర్‌కు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అవసరమైతే పార్టీ తరపున ఆర్థిక సాయం అందించే ఆలోచన కూడా చేస్తున్నారు.ప్రతీ స్థానంలోనూ ఏక‌గ్రీవాలు లేకుండా చేయాల‌ని జ‌గ‌న్ ఆలోచ‌న‌. గత ఎన్నికల తరహాలో అధికార కూటమి ఏకగ్రీవాలు చేసుకోకుండా, ప్రతీ స్థానంలోనూ (పంచాయతీ నుంచి మేయర్ వరకు) అభ్యర్థులను నిలబెట్టాలని జగన్ గట్టిగా ఆదేశించారు.

ఈ క్ర‌మంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలను ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల‌ని జ‌గ‌న్ చెప్పారు. కానీ, నాయ‌కులు ఈ విష‌యంలో విఫ‌ల‌మ‌య్యారు. అలాగే తమ హయాంలో జరిగిన సంక్షేమాన్ని గుర్తు చేయాల‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ రంగంలోకి దిగ‌లేదు. పైగా.అంతర్గత విభేదాలతో పార్టీలో మ‌రింత గ్యాప్ పెరుగుతోంది. అయితే.. త‌మ విభేదాల‌పై దృష్టి పెట్ట‌కుండా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల సర్దుబాటు లేదా క్షేత్రస్థాయిలో వచ్చే అంతర్గత విభేదాలు తమకు కలిసి వస్తాయని వైసీపీ ఆశిస్తోంది.

వ్యూహాలు సక్సెస్ అయ్యేందుకు ఉన్న అవకాశాలను గ‌మ‌నిస్తే.. ఇటీవల రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ కొన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఇది కేడర్‌లో కొంత నమ్మకాన్ని పెంచింది.సామాజిక సమీకరణల ప‌రంగా చూస్తే.. గ్రేటర్ విశాఖ వంటి కీలక ప్రాంతాలలో సామాజిక సమీకరణాలపై (ఉదాహరణకు యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత) ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కలిసి రావచ్చు. అయిన‌ప్ప‌టికీ ప్రధాన సవాళ్లు పార్టీని వెంటాడుతున్నాయి.

కేసుల భయంతో ద్వితీయ శ్రేణి నాయకులు చాలా చోట్ల పోటీ చేసేందుకు వెనుకాడుతున్నారు. వారిని ఒప్పించడం పార్టీకి కష్టంగా మారినట్లు తెలుస్తోంది. కూటమి సమన్వయం కూడా వైసీపీకి మ‌రింత ఇబ్బందిగా మారింది. కూటమి పార్టీల మధ్య విభేదాలు వస్తాయని వైసీపీ భావిస్తుండగా, అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాలని సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. దీంతో వైసీపీ వ్యూహాలు ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయ‌న్న‌ది ప్ర‌స్తుతానికి సందేహంగానే మారింద‌ని చెప్పాలి.

Tags:    

Similar News