ఇళ్లే చెబుతున్న కన్నీటి కథ: నిశ్శబ్దంగా మారుతున్న జపాన్.. బోసిపోతున్న మనుషుల ఊళ్లు

జపాన్ అనగానే మన కళ్లముందు మెదిలేది నూతన సాంకేతికత.. ఆకాశాన్నంటే భవనాలు.. సమయపాలన పాటించే బులెట్ రైళ్లు.. వెలుగులీనే ఆధునిక నగరాలు.

Update: 2026-09-26 17:17 GMT

జపాన్ అనగానే మన కళ్లముందు మెదిలేది నూతన సాంకేతికత.. ఆకాశాన్నంటే భవనాలు.. సమయపాలన పాటించే బులెట్ రైళ్లు.. వెలుగులీనే ఆధునిక నగరాలు. కానీ ఆ రంగుల వెలుగుల వెనుక ఒక నిశ్శబ్ద వేదన దాగి ఉంది. ఒకప్పుడు నవ్వులు, కేరింతలతో క‌లక‌లలాడిన గృహాలు నేడు దిగులుగా మూగబోతున్నాయి. తలుపులకు వేలాడే తాళాలు, తుప్పు పట్టిన గడియలు, పగుళ్లు బారిన గోడలు ఒక దేశపు జనాభా సంక్షోభాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. అక్కడి ఇళ్లే స్వయంగా తమ కన్నీటి కథను వినిపిస్తున్నాయి.

జపాన్‌లో ఈ ఖాళీ ఇళ్లను 'అకియా' అని పిలుస్తారు. ఇవి కేవలం సిమెంట్, ఇటుకల నిర్మాణాల సమూహం కాదు... ఒకప్పుడు కుటుంబాలు కలిసి పంచుకున్న తీపి జ్ఞాపకాలు, ఇప్పుడు అనాథగా మారిన ఆనవాళ్లు.. 2020 నుంచి 2025 మధ్య కాలంలోనే జపాన్ జనాభా సుమారు 31 లక్షల మేర తగ్గడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీని ప్రభావంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు కోటి ఇళ్లు దిక్కులేకుండా ఖాళీగా పడి ఉన్నాయి. ఈ విషాదం ఏదో మారుమూల పల్లెలకు మాత్రమే పరిమితం కాలేదు.. టోక్యో, ఒసాకా, నగోయా వంటి మహానగరాల్లోనూ వీధుల వెంట బోసిపోయిన ఇళ్లు దర్శనమిస్తున్నాయి.

పిల్లలు రాని ఇల్లు.. వారసత్వం లేని గడప..

ఈ నిశ్శబ్ద సంక్షోభానికి ప్రధాన కారణం జననాల రేటు ఘోరంగా పడిపోవడమే. పెరిగిన జీవన వ్యయం, ఉద్యోగాల్లో విపరీతమైన ఒత్తిడి, మారిన జీవన శైలి కారణంగా నేటి యువత వివాహాలకు, పిల్లలను కనడానికి దూరంగా ఉంటోంది. ఆ పిల్లల నవ్వుల శబ్దాలేవీ లేక జపాన్ భవిష్యత్తు సన్నగిల్లుతోంది.

మరోవైపు దేశంలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో శేష జీవితాన్ని గడిపిన పెద్దవారు కన్నుమూశాక.. ఆ ఇళ్లను చూసుకోవడానికి వారసులు ముందుకు రావడం లేదు. నగరాల్లో స్థిరపడిన పిల్లలు ఈ పాత ఇళ్ల పన్నులు కట్టలేక.. వాటి నిర్వహణ భారం కావడం వల్ల వాటిని అలాగే వదిలేస్తున్నారు. కాలక్రమేణా ఆ ఇళ్లు శిథిలాలుగా మారి.. తమ యజమానుల రాక కోసం ఎదురుచూసే మూగబోయిన సాక్ష్యాలుగా మిగిలిపోతున్నాయి.

ప్రయత్నాలు సాగుతున్నా... చెదిరిపోతున్న ఆశలు..

వీటికే ‘అకియాలు’ అని జపాన్ భాషలో అంటారు. ఈ అకియాల సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం కొన్ని ఇళ్లను ఉచితంగా లేదా చాలా తక్కువ ధరకు విక్రయించడం, బాగు చేసుకోవడానికి సబ్సిడీలు ఇవ్వడం వంటి మార్గాలను ప్రోత్సహిస్తోంది. కానీ ప్రస్తుత జనాభా ధోరణి చూస్తుంటే ఇవి చాలవని స్పష్టమవుతోంది. ఇలాగే కొనసాగితే 2038 నాటికి జపాన్‌లో ప్రతి మూడు ఇళ్లలో ఒకటి ఖాళీగా మిగిలిపోయే ముప్పు ఉందనే అంచనాలు గుండెలను పిండేస్తున్నాయి.

జపాన్ ఎదుర్కొంటున్న ఈ 'అకియా' సంక్షోభం కేవలం ఒక భౌగోళిక సమస్య కాదు. మనుషులు లేని ఊళ్లు, చిన్నారుల కేరింతలు లేని వీధులు, భవిష్యత్తుపై భయం పెంచుతున్న నిశ్శబ్దం... ఇవన్నీ ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరిక. అభివృద్ధి ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఆ అభివృద్ధిని అనుభవించేందుకు మనుషులు, వారిలోని అనుబంధాలు లేకపోతే ఆ ప్రగతి ఎంతో కాలం నిలవదని ఈ ఖాళీ ఇళ్లు ప్రపంచానికి నిశ్శబ్దంగా చాటిచెబుతున్నాయి.

Tags:    

Similar News