లీడర్స్ వాంటెడ్.. రాయలసీమలో జనసేనకు పెద్ద సవాల్

కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పక్షం జన సేన పార్టీలో చేరికలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Update: 2026-09-27 00:30 GMT

కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పక్షం జన సేన పార్టీలో చేరికలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సహజంగా అధికారంలో ఉన్న పార్టీల్లో చేరికకు నేతలు క్యూ కడుతుంటారు. కానీ, జన సేన పార్టీ మాత్రం ఎవరు చేరుతారా? అని ఎదురు చూస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ స్థాపించిన 12 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రంలో ఆ పార్టీకి సరైన నాయకత్వం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోస్తాలో గోదావరి జిల్లాలతోపాటు విశాఖ, ఉమ్మడి కృష్ణా జిల్లాలలో తప్ప రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో జనసేన పార్టీ ఇప్పటికీ నాయకత్వ సంక్షోభంతోనే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నప్పటికీ జిల్లాలో అన్ని నియోజకవర్గాలను ప్రభావితం చేయగలిగే నాయకులు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.

అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా జనసేన పార్టీకి సరైన నాయకత్వం లేదని అంటున్నారు. ఈ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలతోపాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బలమైన నేతలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్న ఇటువంటి సమయంలో ఆ లోటు భర్తీ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ నాయకత్వం ఆ దిశగా ఆలోచించడం లేదా? లేక జనసేనలో చేరేందుకు నాయకులే ముందుకు రావడం లేదా? అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఇదే సమయంలో జనసేనలో చేరేందుకు చాలా మంది నాయకులు ఆసక్తిగా ఉన్నప్పటికీ ఆ పార్టీ నాయకత్వమే సరైన విధంగా స్పందించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పార్టీలో చేరికలను ప్రోత్సహించేలా అధిష్టానం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ కొత్త నేతల రాక మందకొడిగా ఉండటాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. విపక్షం నుంచి బొత్స వంటి సీనియర్లు వస్తారన్న ప్రచారాన్ని పట్టించుకోకపోవడం కూడా జనసేన పార్టీ వైఫల్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. బొత్స వస్తారన్న ప్రచారంలో నిజం లేకపోయినా, ఆ దిశగా ఆలోచించి ఉంటే బొత్స కుటుంబానికి చెందిన చిన్న శ్రీను పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారనే విషయం ముందే తెలిసివుండేదని, అటువంటి నాయకులను చేర్చుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇతర ప్రాంతాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉండేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లోనూ జనసేన వ్యూహాత్మక వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.

పొత్తులో ఉన్నప్పటికీ పార్టీలో చేరికల విషయంలో టీడీపీ మిత్రపక్షం జనసేన కంటే మెరుగ్గా పావులు కదుపుతోందని అంటున్నారు. దీనికి ఇటీవల ఆ పార్టీలోకి వస్తున్న కేడర్ ఒక ఉదాహరణగా చూపుతున్నారు. అదే సమయంలో జనసేన కూడా చేరికల విషయంలో సానుకూలంగా ఉన్నప్పటికీ అటువంటి ప్రయత్నాలు అన్నీ ఇప్పటికే బలంగా ఉన్న ప్రాంతంలోనే జరుగుతున్నాయని అంటున్నారు. గోదావరి జిల్లాల్లో సంస్థాగతంగా జనసేన బలంగా ఉందని, ఇక్కడ ఆ పార్టీ పెద్దగా ప్రయత్నించకపోయినా కొత్త నేతల చేరికకు వాతావరణం అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఇటీవల కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బరావు జనసేన తీర్థం పుచ్చుకోవడం ఇందులో భాగమే అంటున్నారు. అదే సమయంలో రాయలసీమ ప్రాంతంలో జనసేన పార్టీ విస్తరణకు అవకాశం ఉన్నప్పటికీ సరైన నాయకత్వం లేక చేరికలు ముందుకు సాగడం లేదని అంటున్నారు.

విపక్షం బలంగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో జనసేన విస్తరణకు చాలా అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా ఆ ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ అదనపు బలం కావొచ్చునని అంటున్నారు. అయితే ఆ ప్రాంతంలో చేరికలు ప్రోత్సహించేలా జనసేన నుంచి చొరవ ఉండటం లేదని అంటున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో పదవుల ఆశతో చాలా మంది జనసేన వైపు చూస్తున్నారని, అయితే అటువంటి వారు తమకు అవసరం లేదన్నట్లు జనసేన అధిష్టానం వ్యవహరించడమే అంతుచిక్కడం లేదని అంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి అవసరం ఉంటుందో అంచనా వేయడం కష్టమని, కానీ జనసేన అధిష్టానం మాత్రం పార్టీలో ఫలానా వారే చేరాలన్న గీత గీసుకుని కూర్చోవడం వల్లే ఇబ్బందులు ఎదుర్కుంటోందని అంటున్నారు.

Tags:    

Similar News