లోకల్ ఫైట్....తీర్పు కోసం వెయిటింగ్ !
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసుకుంటోంది. ఎన్నికలు విడతల వారీగా నిర్వహించేందుకు కూడా రంగం సిద్ధం చేశారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసుకుంటోంది. ఎన్నికలు విడతల వారీగా నిర్వహించేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఏపీలో పట్టణాలు, మునిసిపాలిటీలు, కార్పోరేషన్లలో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి అయి వార్డులు అదనంగా పెరిగాయి. అలాగే ఓటర్ల జాబితా కూడా సిద్ధం అయింది. ఇక ఏపీలో మరో 40 దాకా పట్టణ స్థానిక సంస్థలలో డీలిమిటేషన్ ప్రక్రియతో పాటు ఓటర్ల జాబితా తయారు చేసే కార్యక్రం అయితే ఇప్పటికే జోరుగా సాగుతోంది. అది కనుక పూర్తి అయితే ఎన్నికల సంఘం వరకూ ఎన్నికలకు పూర్వ రంగం అంతా పూర్తి అయినట్లే అంటున్నారు.
ఆ రెండు ఇష్యూస్ మీద :
ఇదిలా ఉంటే హైకోర్టులో రెండు అంశాల మీద పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటి మీద విచరించిన హైకోర్టు తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. అందులో ఒకటి 34 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడం. మొత్తం రిజర్వేషన్లు దేశంలో 50 శాతం మించకూడదని రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి. దాని కంటే ఎక్కువగా ఇస్తే అది కుదరని అంటున్నారు. అందుకే ఏపీలో బీసీల రిజర్వేషన్ మీద కొందరు కోర్టుకు వెళ్ళారు, దీని మీద హైకోర్టు సమగ్రమైన విచారణ జరిపింది. దీనికి సంబంధించిన తీర్పు రిజర్వ్ లో పెట్టారు. మరో వైపు చూస్తే ఓటర్ల జాబితాకు సంబంధించిన పలు అంశాల మీద వైసీపీ కోర్టుకు వెళ్ళింది. సర్ ప్రక్రియ ఒక వైపు సాగుతుండగా పాత ఓటర్ల జాబితాతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం మీద అభ్యంతరం వ్యక్తం చేసింది. సర్ ప్రక్రియలో 40 లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయని వాటిలో డబుల్ ఎంట్రీలు, మరణించిన వారు, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు ఉన్నారు అని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీని మీద విచారణ తదుపరి తీర్పు రిజర్వ్ చేశారు.
తీర్పు అనంతరమే :
ఇక ఈ విషయంలో కోర్టు తీర్పు ఏమి చెప్పబోతోంది అన్న ఉత్కంఠ అంతటా ఉంది. రెండు ఇష్యూస్ చాలా ప్రాధాన్యత కలిగినవి కావడం విశేషం. అందువల్ల కోర్టు ఇచ్చే తీర్పుని బట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి అడుగులు వేస్తుంది అని అంటున్నారు. తీర్పు అనుకూలంగా వస్తే మాత్రం చకచకా ఎన్నికలకు ముందుకు వెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకుంది. ఇక ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరం అయిన బ్యాలెట్ బాక్సులను మునిసిపల్, పంచాయతీ రాజ్ అధికారులు రెడీ చేసి పెట్టారు అని అంటున్నారు. ఒకవేళ అవి సరిపోవు అనుకుంటే అదనంగా బ్యాలెట్ బాక్సులను తెలంగాణా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి తీసుకుని వస్తారని అంటున్నారు. ఇక ఎన్నికల నిర్వహణ కోసం మొత్తంగా ప్రక్రియను పూర్తి చేసుకుని రాష్ట్ర ఈసీ కోర్టు వైపు చూస్తోంది అని అంటున్నారు.
విడతల వారీగా :
రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలను విడతల వారీగా నిర్వహించాలని అనుకుంటోంది. ముందుగా పట్టణ సంస్థలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు పెడతారు. ఆ తరువాత మండల పరిషత్తు జిల్లా పరిషత్తులకు ఎన్నికలు ఉంటాయి. ఇక మూడవ విడతలో పంచాయతీలకు ఎన్నికలు ఉంటాయి. మొత్తం ఈ ఎన్నికల కార్యక్రమం అంతా సాగేందుకు నెలన్నర వ్యవధి పడుతుంది అని అంటున్నారు. కోర్టు తీర్పు రావడమే ఆలస్యం అక్టోబర్ మొదట్లోనే నోటిఫికేషన్ జారీ చేసి మొత్తం మూడు విడతల ఎన్నిలను నవంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని కూడా పకడ్బందీ ఏర్పాట్లలో ఈసీ ఉందని తెలుస్తోంది. మొత్తం మీద అయితే ఈసీ ఇపుడు కోర్టు తీర్పు కోసమే వెయిటింగ్ అని అంటున్నారు. మరి కోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాల్సి ఉంది.